మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jangaon - Sep 16, 2020 , 04:39:28

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

  • కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు
  • పౌరహక్కుల పరిరక్షణ , అత్యాచార నిరోధక చట్టం అమలుపై విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం 

హన్మకొండ, సెప్టెంబర్‌ 15: ఎస్సీ, ఎస్టీలపై లైంగికదాడులు, దాడులు జరిగితే జాప్యం లేకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పౌరహక్కుల పరిరక్షణ (పీసీఆర్‌), అత్యాచార నిరోధక చట్టం(పీవోసీ) అమలుపై జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి ఆయా శాఖల్లో పెండింగ్‌లో కేసుల వివరాలు తెప్పించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులో స్టే ఆర్డర్‌లో ఉన్న కేసులపై వెంటనే కౌంటర్‌ ఫైల్‌ చేయాలని పోలీస్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. విచారణ పూర్తయిన తరువాత జాప్యం లేకుండా చార్జిషీట్‌ దాఖలు చేయాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే అధికారులు స్పందించని పక్షంలో కమిటీ సభ్యులు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణలో పక్షపాతం లేకుండా పారదర్శకంగా విచారణ జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు. విచారణ (యూఐ) స్థాయిలో 36 కేసులు, పెండింగ్‌ ట్రయల్‌ (పీటీ)లో 143 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు పరిహారంలో భాగంగా 66 కేసులకుగాను 39 కేసులకు రూ.48.62లక్షల వేలు వివిధ స్థాయిల్లో పరిహారం అందిందని, మిగతా వారి బ్యాంకు ఖాతాలు సరిగా లేనందున జాప్యం జరిగిందని, 10 రోజుల్లో అందరికీ పరిహారం అందిస్తామని కలెక్టర్‌ అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సమావేశం జాప్యం అవుతోందని, ఇక నుంచి సకాలంలో కమిటీ సమావేశం నిర్వహించేలా శ్రద్ధ తీసుకోవాలని కమిటీ సభ్యుడు బొమ్మల కట్టయ్య కోరారు. ఈ సమావేశానికి  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మెంబర్లుగా వ్యవహరిస్తారని, వారు కూడా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు కొన్ని పోలీస్‌స్టేషన్లలో త్వరగా కేసు నమోదు కావడం లేదన్నారు. సభ్యుడు పరుశరామలు మాట్లాడుతూ విచారణలో ఉన్న (యూఐ) కేసులు, అండర్‌ ట్రయల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల భూములకు పట్టాలు రాకుండా కొందరు భూకబ్జాదారులు ఇబ్బంది పెడుతున్నారని అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని ఆర్‌.పరంజ్యోతి కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో వాసుచంద్ర, డీసీపీ పుష్ప, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి బీ.నిర్మల, కమిటీ మెంబర్లు జడ్‌ రాందాస్‌, భద్రునాయక్‌, దామోదర్‌, ఎన్‌ఎస్‌ నాయక్‌, వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


logo