గురువారం 04 మార్చి 2021
Jangaon - Sep 11, 2020 , 06:13:56

నేల మురిసేలా రెవెన్యూ సంబురం

నేల మురిసేలా రెవెన్యూ సంబురం

  • ఉమ్మడి జిల్లాలో  రెండో రోజూ వేడుకలు 
  • కొత్త చట్టానికి సకల జనుల జేజేలు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు
  • పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి వేడుకలు 
  •  పే స్కేల్‌ ప్రకటనపై వీఆర్‌ఏల ఆనందహేల

వీఆర్వో వ్యవస్థ రద్దుపై గురువారం సైతం ఉమ్మడి జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త రెవెన్యూ చట్టం తేవడంపై సకల జనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పల్లె పల్లెనా సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు కొనసాగాయి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, రైతులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకుని వేడుకలు చేసుకోగా, అంతటా పండుగ వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా పే స్కేల్‌ ప్రకటనపై వీఆర్‌ఏల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. 

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌ : వీఆర్వో వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ చట్టం తేవడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రెండోరోజూ సంబురాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి పడిన ఇబ్బందులన్నీ తీరి తమ భూములకు భరోసా ఇచ్చారంటూ రైతులు హర్షం వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఎదుట, వేలేరు మండల కేంద్రంలో కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం, గీసుగొండ, రాయపర్తి మండలాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, వీఆర్‌ఏలు సంబురాలు చేసుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల, టేకుమట్లలో, ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు)లో తమకు ఉద్యోగ భద్రత కల్పించినందుకు వీఆర్‌ఏలు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జనగామ జిల్లా లింగాలఘనపురం, మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంతో పాటు బయ్యారం మండలంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. 


VIDEOS

logo