శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Sep 10, 2020 , 04:51:09

వీరనారి ఐలమ్మ

వీరనారి ఐలమ్మ

  • భూమి కోసం.. భుక్తి కోసం పోరు సలిపిన ధీర వనిత
  •  నేడు ఐలమ్మ వర్ధంతి

ఆమె అమర గీతం.. మెరిసే ఎర్రటి విప్లవ జ్యోతి.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించిన ధీశాలి. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్‌ చిట్యాల ఐలమ్మ. నిజాంను ఎదిరించి భూమి కోసం.. భుక్తి కోసం ప్రజలను కూడగట్టి పోరు సల్పిన  ఆమె ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నేడు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..   

- పాలకుర్తి/పాలకుర్తి రూరల్‌

ఐలమ్మ ఓ అగ్నికణం. తెలంగాణ సాయుధ పోరాటంపై ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నా ముందుగా గుర్తొచ్చేది ఆమే. ఆమె భూ సమస్యే దీనికి నాంది పలికింది. ఐలమ్మ 1895 లో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం లో జన్మించింది. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యను వివాహం చేసుకుంది.

పౌరహక్కుల పాతర..

ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న సాంఘిక, ఆర్థి క, రాజకీయ పరిస్థితులు రైతాంగ సాయుధ పోరాటానికి ఉత్ప్రేరకం అయ్యాయి. 1948లో అసఫ్‌జాహీ వంశ పాలన చివరి దశలో పౌరహక్కులను పాతరేసి జనాలను అణగదొ క్కారు. స్వాతంత్రోద్యమం ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ఆరాచకాలు, వెట్టి చాకిరీ, హింస రాజ్యమేలింది. ఈ నేపథ్యంలో నిజాం అడుగులకు మడుగులొత్తే దొరలకు వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రజాపోరు మొదలైంది. దీంతో ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లను నిజాం తెలంగాణ ప్రజలపైకి ఉసిగొల్పాడు. వారు నరరూప రాక్షసులుగా గృహ దహనాలు, మానభంగాలు, హత్యలు చేసేవారు.

విస్నూరు రామచంద్రారెడ్డి అరాచకాలు..

చుట్టూ 60 గ్రామాలకు కేంద్రంగా ఉన్న విస్నూరులోని దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి అరాచకాలకు అంతేలేదు. రైతుల ను పీడించడమేగాక, రకరకాల పన్నులు వసూలు చేసి ము ప్పుతిప్పలు పెట్టేవాడు. రజాకార్ల అండతో మహిళలను హిం సించేవాడు. కార్మికులకు కూలి చెల్లించకుండా దోపిడీకి గురి చేసేవాడు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేస్తున్న ఆంధ్ర మహాసభ రామచంద్రారెడ్డి దోపిడీని ఎండగ ట్టేది. రైతులు, కూలీలకు అవగాహన కల్పిస్తూ పోరాటానికి సిద్ధం చేసేది. ఆంధ్ర మహాసభ నాయకులకు పాలకుర్తిలో చిట్యాల ఐలమ్మ ఆశ్రయం కల్పించింది. పెత్తందార్ల అరాచ కాలను ఎదిరించేందుకు వారి సహకారంతో ప్రజలను కూడ గట్టి పోరాటం నిర్వహించడమేగాక వందలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేయించారు. 

ఐలమ్మ భూ పోరాటం..

1921లో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ఉద్య మంగా ప్రారంభమైన ఆంధ్ర జన సంఘం మారిన పరిస్థితు ల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. 1944లో భువనగిరి మహాసభ నాటికి కమ్యూనిస్టుల ప్రా బల్యంతో చరమగీతం పాడడమే లక్ష్యంగా భూమి, భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయి ఈ మహాసభతో ఉత్తే జం పొందిన ఐలమ్మ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసింది. మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి కౌలుకు తీసుకున్న భూములను విస్నూరు దేశ్‌ముఖ్‌ కిరాయి గుండాలు స్వాధీన పరుచుకున్న క్రమంలో ఆంధ్ర మహాజన సభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు. కిరాయి రౌడీలను తరిమి కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఇలా ఎన్నో పోరా టాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసిన ఐల మ్మ 1985 సెప్టెంబర్‌ 10న తుది శ్వాస విడిచారు. తెలంగాణ సాయుధ పోరాటం వీరనారి ఐలమ్మ నిర్వహించిన పోరా టం నేటి యువతరానికి ఆదర్శం.

VIDEOS

logo