శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Sep 02, 2020 , 02:48:18

ఆన్‌లైన్‌ పాఠాలపై డీఈవో పర్యవేక్షణ

ఆన్‌లైన్‌ పాఠాలపై డీఈవో పర్యవేక్షణ

జనగామటౌన్‌/దేవర్పుప్పుల/జనగామరూరల్‌, సెప్టెం బర్‌ 1 : తెలంగాణ విద్యాశాఖ మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ పాఠాలను ప్రారంభించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిగసారపు యాదయ్య పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్‌లైన్‌ పాఠాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని 540 ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. దీనిపై ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజూ 3 నుంచి 5వ తగరతి విద్యార్థులకు 1.30 గంటలకు, 6, 7, 8వ తరగతి విద్యార్థులకు 2 గంటలకు, 9, 10వ తరగతి విద్యార్థులకు 3 గంటలకు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభమవుతుందని డీఈవో వివరించారు. క్లాసులు ప్రారంభమైనప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు సహకరించాలని కోరారు. డీటీహెచ్‌, స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో లేని వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ప్రసాద్‌, కడమంచి కృప తదితరులు ఉన్నారు. 

ఉపాధ్యాయులు పరిశీలించాలి : డీఈవో

ఆన్‌లైన్‌ పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా వినేలా పరిశీలించడమేగాక వారిని ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని  డీఈవో యాదయ్య అన్నారు. దేవరుప్పుల మండలం చినమడూరు గ్రామంలో ఆయన విద్యార్థుల ఇళ్లకు వెళ్లారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లలో వస్తున్న పాఠాలను వింటున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  విద్యార్థులు పాఠాలు వినేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వారికి రోజువారీ వర్క్‌ షీట్‌ ఇవ్వాలని, దానిని పూర్తి చేసిన అనంతరం తీసుకోవాలని కోరారు. ఆన్‌లైన్లో పాఠాలు వింటున్న విద్యార్థుల వివరాలు నోట్‌ చేసుకోవాలని, వినని వారి గురించి తెలుసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. 

అలసత్వం వహిస్తే చర్యలు

చినమడూరు ఉన్నత పాఠశాల నుంచి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ లేదని, విద్యార్థులకు సమాచారం ఇవ్వడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని డీఈవో యాదయ్య తెలిపారు. ఇకముందు అలసత్వం వహిస్తే  చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ తరగతుల పరిశీలనకు మూడంచెల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. 


VIDEOS

logo