ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 13, 2020 , 03:06:32

మొలకెత్తే జాతీయ పతాకాలు..

మొలకెత్తే జాతీయ పతాకాలు..

  • గ్రీన్‌ వేవ్స్‌ ఆధ్వర్యంలో ప్లాంటబుల్‌ ఫ్లాగ్స్‌
  • విత్తనాలతో తయారుచేసిన సంస్థ

జనగామ క్రైం : హైదరాబాద్‌లోని గ్రీన్‌ వేవ్స్‌ సంస్థ కొత్తగా విత్తనాలతో రూపొందించిన చిన్న సైజు జాతీయ పతాకాలను (ప్లాంటబుల్‌ ఫ్లాగ్‌) జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం ఆ సంస్థ ప్రతినిధులతో కలసి ఐఎంఏ స్టేట్‌ ప్రెసిడెంట్‌ డి.లవకుమార్‌రెడ్డి, లయన్స్‌ క్లబ్‌ జిల్లా వైస్‌ గవర్నర్‌ కన్నా పరశురాములు ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం(15 ఆగస్ట్‌, 26 జనవరి) సందర్భంగా విద్యార్థి, ఉపాధ్యాయులు, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులందరూ తమ అంగీ జేబులకు ప్లాస్టిక్‌ లేదా కాగితంతో కూడిన జాతీయ జెండాలను అలంకరించుకుంటారు. ఆ తర్వాత వాటిని ఎక్కడో పడేయడం వల్ల భూమిలో ఆ ప్లాస్టిక్‌ కలిసిపోదు. దీనిని నివారించడానికి గ్రీన్‌ వేవ్స్‌ సంస్థ పలు రకాల పూల మొక్కలకు సంబంధించిన విత్తనాలతో కూడిన జాతీయ పతాకాలను రూపొందించింది. వీటిని జేబులకు ధరించేలా చిన్న సైజులో తయారుచేసి ప్రజలకు అందించనున్నారు. ఈ ప్లాంటబుల్‌ ఫ్లాగ్‌ను ప్రతి ఒకరూ తమ ఇంట్లో ఉన్న పూలకుండీల్లో పెంచితే వాటి నుంచి మూడు వారాల్లో పలు రకాల పూల మొక్కలు మొలకెత్తుతాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీని వల్ల జాతీయపతాకం గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లదని ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. కావాల్సిన వారు సంస్థ వెబ్‌సైట్‌, మెయిల్‌ ఐడీ www.greenwave srecyclers.com లో సంప్రదించాలని ప్రతినిధి కాసాల సంతోష్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యుడు బెలిదె నాగరాజు పాల్గొన్నారు.


logo