ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 13, 2020 , 03:06:32

గురువులకు గుర్తింపు కార్డులు

గురువులకు  గుర్తింపు కార్డులు

  • n ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆర్‌ఎఫ్‌ఐడీల జారీకి కసరత్తు
  • n ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం
  • n స్కూళ్లు తెరిచేనాటికి అందించాలని సర్కారు నిర్ణయం
  • n ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,758 మంది టీచర్లు

నెల్లికుదురు/నర్మెట : గురువులకు ఆధునాతన గుర్తింపు కార్డులిచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. పాఠశాలలు తెరిచేనాటికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ సాంకేతికతను జోడిస్తూ శాశ్వత ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేయనున్నది. ఈ మేరకు గతేడాదే వివరాలు సేకరించిన అధికారులు, తాజాగా మరింత సమాచారం అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఇందుకు ఈ నెల 31దాకా ఆన్‌లైన్‌లో నమోదుకు గడువిచ్చారు. 2019-20లో అందించిన డైస్‌ నమునాల్లో పొందుపరిచిన వివరాల మేరకు సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈసారి బ్లడ్‌ గ్రూపు, నివాస సమాచారాన్ని కూడా చేర్చారు. వివరాలను సరిచూసుకొని తేడాలుంటే ఈ నెలఖరులోగా www.schooledu. telangana.gov.in సైట్‌ ద్వారా సమర్పించాలని విద్యాశాఖ డీఈవోల ద్వారా ఉపాధ్యాయులను కోరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11758 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నది. ఇప్పటికే ఉపాధ్యాయుల హాజరుశాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా వారికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డు లు జారీ చేయనున్నది. ఫొటో, చిప్‌ఉండే ఈ ప్రత్యేక కార్డులను అన్నిరకాల సేవలకు ప్రామాణికంగా తీసుకోనున్నారు.  

కార్డులో ఉండే వివరాలు 

ఉపాధ్యాయుడి పూర్తిపేరు, పుట్టిన ప్రాంతం, తేదీ, ప్రస్తుత నివాస ప్రాంతం, ఉద్యోగంలో చేరిన తేదీ, ఫోన్‌, ఆధార్‌, పాన్‌ నంబర్లు, బ్లడ్‌ గ్రూపు, పనిచేస్తున్న జిల్లా, మండలం, పాఠశాల డైస్‌ కోడ్‌, హోదా, గతంలో ఎక్కడ పనిచేశారు? ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు? జీతభత్యాలు తదితర వివరాలన్నీ నిక్షిప్తం చేస్తారు.

కార్డుతో ప్రయోజనాలు

ఉద్యోగోన్నతులు, బదిలీలు, ఇతర ప్రయోజనాలకోసం ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. సాధారణ ఉద్యోగోన్నతులు, బదిలీల సమయాల్లో జరిగే కౌన్సిలింగ్‌లలో సీనియారిటీ విషయాల్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పడు జారీ చేసే ఈ కార్డుతో ఇలాంటి సమస్యలకు చెక్‌పడనున్నది. 

డుమ్మా కొడితే ఇట్టే పట్టేస్తారు

విధులకు సరిగ్గా హాజరుకాకపోయినా, ముందస్తు అనుమతి లేకుండా విధులకు డుమ్మాకొట్టి, మరుసటి రోజు పాఠశాలకు వచ్చి రికార్డుల్లో సంతకాలు పెట్టినా, సమయానికి పాఠశాలకు చేరుకోకున్నా, ముగింపు సమయానికి ముందే వెళ్లినా ఈ కార్డులతో ఇట్టే పట్టేస్తారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ మిషన్లున్నాయి. ఉపాధ్యాయులకు కార్డులు జారీ కాగానే సంబంధిత కార్డు స్వైప్‌ చేస్తేనే హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,758 మంది ఉపాధ్యాయులుండగా, అందరికీ కార్డులు జారీ చేయనున్నారు.


logo