ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 08, 2020 , 02:59:35

పల్లె ప్రకృతి వనాలు గడువులోగా పూర్తి చేయాలి

పల్లె ప్రకృతి వనాలు గడువులోగా పూర్తి చేయాలి

జనగామ రూరల్‌. ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ప్రకృతివనాల నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌ అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని వడ్లకొండ గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. హమీద్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం పెంపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు నాలుగు వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పని చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, వడ్లకొండలో నిర్మిస్తున్న పల్లె ప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన గ్రామాల్లోనూ పనులు జరిగేలా కృషి చేయాలని హమీద్‌ కోరారు. పార్కు చుట్టూ పెద్ద మొక్కలు నాటేందుకు కృషి చేయాలని, ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పెద్ద మొక్కలు తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక్కడ జరుగుతున్న పనులు బాగున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి కేఆర్‌ లత, సర్పంచ్‌ బొల్లం శారద, ఎంపీటీసీ బొల్లం బాల సిద్దులు, ఎంపీవో సంపత్‌ కుమార్‌, ఏపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 


logo