శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jangaon - Aug 06, 2020 , 03:50:52

మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికలు ఏకగ్రీవం

మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికలు ఏకగ్రీవం

జనగామ, ఆగస్టు 5 : జనగామ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికల్లో మరోసారి గులాబీ గుబాళించింది. నాలుగు స్థానాలకు నలుగురు టీఆర్‌ఎస్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశానికి ఎక్స్‌అఫిషియో సభ్యుడి హోదాలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌ హాజరవ్వగా ఇన్‌చార్జి కమిషనర్‌ రవీంద్రనాథ్‌ చేతులెత్తి ఎన్నుకునే పద్ధతి ద్వారా కోఆప్షన్‌ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 30 కౌన్సిలర్‌ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌ నుంచి 16 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యేతో కలుపుకొని పార్టీకి 17 ఓట్ల (సగానికంటే ఎక్కువ) బలం ఉంది. అయితే నలుగురు బీజేపీ సభ్యుల్లో ఎన్నిక ప్రక్రియలో ఇద్దరు సభ్యులు హాజరుకాగా, అధికార టీఆర్‌ఎస్‌ బలపరిచిన ముస్లిం, మైనార్టీ సభ్యులుగా బరిలో నిలిచిన ఇద్దరికి బీజేపీ సభ్యుడు బొట్ల శ్రీనివాస్‌ ఓటేశారు. మైనార్టీ అభ్యర్థులకు 18 ఓట్లు, ఇద్దరు జనరల్‌ అభ్యర్థులకు 17 ఓట్ల చొప్పున రాగా బీజేపీ సభ్యురాలు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి తటస్థంగా ఉన్నారు. మరో ఇద్దరు బీజేపీ సభ్యులు మహంకాళి హరిశ్చంద్రగుప్త, ఉడుగుల శ్రీలత ఓటింగ్‌ తంతు ముగిసిన తర్వాత సమావేశ మందిరంలోకి ప్రవేశించి హాజరు రిజిస్ట్రర్‌లో సంతకం చేశారు. కొత్త పుర చట్టం ప్రకారం నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే అవకాశం కల్పించగా, అందులో ముస్లిం, మైనార్టీల నుంచి ఇద్దరు (మహిళ, జనరల్‌), జనరల్‌ నుంచి (మహిళ, జనరల్‌) సభ్యులకు అవకాశం కల్పిస్తూ మున్సిపల్‌ అడ్మిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఏ) నోటిఫికేషన్‌ జారీ చేశారు. రెండు జనరల్‌ స్థానాలకు ఐదు, మరో రెండు మైనార్టీ స్థానాలకు ఏడుతో కలిసి మొత్తం 12 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మైనార్టీ స్థానం నుంచి కె.మధుకుమార్‌, మహ్మద్‌ మతీన్‌ అబ్బాస్‌ దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. జననల్‌ కో-ఆప్షన్‌ స్థానాల నుంచి ఉల్లెంగుల నవ్యశ్రీ, మహ్మద్‌ ఎజాజ్‌ అహ్మద్‌, నాగులపల్లి శ్రీశైలం, ఎన్‌.విష్ణువర్ధన్‌రెడ్డి , శోభనబోయిన అనురాధ, మైనార్టీ కమ్యూనిటీ కోఆప్షన్‌ స్థానాల నుంచి పానుగంటి రాహెల, మొహ్మద్‌ ఎజాజ్‌ అహ్మద్‌, మహ్మద్‌ జహీరొద్దీన్‌, మసిహుర్‌ రెహ్మాన్‌ జకీర్‌, ఎండీ అన్వర్‌ పాషా దరఖాస్తులు సరిగా ఉన్నప్పటికీ వారిని బలపరిచి, మద్ధతుగా ఓటేసే సభ్యులకు సంఖ్య బలం లేకపోవడంతో ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండడంతో నలుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమం అయ్యింది.

 టీఆర్‌ఎస్‌ కో-ఆప్షన్‌ సభ్యులు వీరే..

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు సహా మెజార్టీ కౌన్సిలర్ల బలం ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ ఖాతాలో మరో నలుగురు కోఆప్షన్‌ సభ్యులు చేరారు. జనరల్‌ స్థానం నుంచి మాజీ కౌన్సిలర్‌ ఉల్లెంగుల నవ్యశ్రీ నర్సింగ్‌, నల్ల విష్ణువర్ధన్‌రెడ్డి, ముస్లిం, మైనార్టీ స్థానం నుంచి పానుగంటి రహేలా, మసిహుర్‌ రెహ్మన్‌ జకీర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో విష్ణువర్ధన్‌రెడ్డి 1989లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామకమై మండల రిసోర్స్‌ పర్సన్‌గా, అక్షరదీపిక కోఆర్డినేటర్‌గా అనేక బాధ్యతలు నిర్వహించారు. పీఆర్‌టీయూ, జీహెచ్‌ఎంఏ సంఘాల్లో క్రియాశీకలంగా వ్యవహరించి ఈ ఏడాది మే 31న రిటైర్డు గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌ హోదాలో పదవీ విరమణ పొందారు. గత మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులుగా పానుగంటి రాహెల కోడలు ఒక ఓటు, ఉల్లెంగుల నవ్యశ్రీ రెండు ఓట్ల తేడాతో ఓటమి పాలవ్వగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వారి కుటుంబంలో కోఆప్షన్‌ అవకాశం కల్పించారు. మసిహుర్‌ రెహ్మేన్‌ జకీర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా వ్యవహరించారు. 

జనగామను సుందరంగా 

మార్చుకుందాం : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జిల్లా కేంద్రంగా అవతరించి జనగామ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. కోఆప్షన్‌ ఎన్నిక తర్వాత ఆయన కౌన్సిల్‌ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికే రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యాక ఒక్కో వార్డు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. పట్టణాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మార్చుకునేలా ప్రజలను చైతన్యపర్చే బాధ్యత వార్డు కౌన్సిలర్లు, కొత్తగా ఎన్నికైన కోఆప్షన్‌ సభ్యులపై ఉందన్నారు. ప్రతిఒక్కరూ పచ్చదనాన్ని కాపాడుతూ ఇంటి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జనగామను ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక మంత్రి కేటీఆర్‌ సుముఖంగా ఉన్నారని, కొద్దినెలల్లోనే జనగామకు మంచిరోజులు రాబోతున్నాయని చెప్పారు. పట్టణం చుట్టూ రింగ్‌రోడ్డు, ప్రత్యేక పారిశ్రామిక వాడ, బతుకమ్మకుంట మరింత అభివృద్ధి, రంగప్పచెరువు సుందరీకరణ వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని ముత్తిరెడ్డి తెలిపారు. కాగా, పట్టణంలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కట్టడికి కొద్దిరోజులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు ప్రజలు, వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని అధికారికంగా అనుమతిస్తే పాటించేందుకు సిద్ధమని బీజేపీ సభ్యుడు హరిశ్చంద్రగుప్త ప్రతిపాదించగా మున్సిపల్‌ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిస్తే కలెక్టర్‌తో మాట్లాడేందుకు ముత్తిరెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. logo