పల్లెప్రకృతి వనాలతో పర్యావరణ పరిరక్షణ

- డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి
- వడ్లకొండలో ప్రకృతి వనం పరిశీలన
జనగామ రూరల్, జూలై 30 : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పల్లెప్రకృతి వనాలు ఎంతో దోహదపడుతాయని డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి అన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వడ్లకొండ గ్రామంలోని ప్రకృతి వనాన్ని గురువారం ఆయన పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ ఈ స్థలంలో మొక్కలు విరివిగా నాటి పెంచాలని సూచించారు. వడ్లకొండ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పార్కును చూసి మిగిలిన అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శారదాస్వామి, ఎంపీవో సంపత్‌కుమార్, ఏపీవో చిక్కుడు భిక్షపతి, ఎంపీటీసీ బొల్లం బాల సిద్ధులు, టీఏ యాదగిరి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
మానవాళి మనుగడ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పెంబర్తి ఉప సర్పంచ్ చినబోయిన రేఖారాజు పిలుపునిచ్చారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా పెంబర్తి గ్రామంలో తన మిత్రులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఇందుకోసం పుట్టినరోజు, పండుగ రోజు, పెళ్లి రోజున మొక్కలు నాటాలని తెలిపారు. కార్యక్రమంలో స్వప్న, స్వాతి, మమత, కన్నయ్య పాల్గొన్నారు.
సింగరాజుపల్లిలో మొక్కల పంపిణీ
దేవరుప్పుల : సింగరాజుపల్లి వన నర్సరీ నుంచి సర్పంచ్ గోపాల్‌దాస్ మల్లేశ్ ట్రాక్టర్‌తో ఇంటింటికీ ఐదు మొక్కలు పంపిణీ చేశారు. ఇప్పటికే అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటామని, కమ్యూనిటీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి ఇంటి ఎదుట పూలు, పండ్ల మొక్కలు నాటాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కారోబార్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.