ఇలాగైతే ‘కస్టమే’

వరంగల్ రూరల్, నమస్తేతెలంగాణ :కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) డెలివరీలో కొందరు రైస్ మిల్లర్లు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. అధికారుల ఆదేశాలను సైతం పెడచెవిన పెడుతూ నిర్దేశిత గడువును కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి గండి పడుతున్నది. గత వానకాలం సీజన్లో ధాన్యం పొందిన రైస్‌మిల్లర్లు జూన్ నెలాఖరులోగా వందశాతం సీఎంఆర్ డెలివరీ చేయాలని సర్కారు గడువు విధించింది. ఎక్కువ మంది రైస్‌మిల్లర్లు సీఎంఆర్ బకాయి ఉండడంతో డెలివరీ గడువు మరో నెల పొడిగించింది. జూలై 31లోగా ఇవ్వాలని స్పష్టం చేసింది. రైస్‌మిల్లర్స్ అసోయేషన్ ప్రతినిధులతో ఉన్నతాధికారులు సమావేశమై సీఎంఆర్ బకాయిలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఈ నెలాఖరులోగా సీఎంఆర్ వందశాతం డెలివరీ చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కొంద రు రైస్‌మిల్లర్లు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లాలో గత వానకాలం సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన 2,39,576 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 102 రైస్‌మిల్లులకు సీఎంఆర్ విధానంపై కేటాయించారు. ధాన్యాన్ని మరపట్టి 67శాతం బియ్యం అంటే 1,60,516 మెట్రిక్ టన్నులను మిల్లర్లు సీఎంఆర్ కింద సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ (ఎఫ్‌సీఐ)కు డెలివరీ చేయాలి. జూన్ నెలాఖరు వరకు 78.39 శాతం అంటే 1,25,822 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను మాత్రమే మిల్లర్లు డెలివరీ చేశారు. జూలై 31లోగా వంద శాతం డెలివరీ చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టింది. పది రోజుల క్రితం జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.మహేందర్‌రెడ్డి రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమై వందశాతం సీఎంఆర్ డెలివరీ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను నియమించారు. డీఎస్వో, డీఎం, ఏఎం నేతృత్వంలో ఈ మూడు టీంలు పనిచేస్తాయని, రైస్‌మిల్లర్లతో సీఎంఆర్ మొత్తం డెలివరీ చేయించడమే ఈ బృందాల కర్తవ్యమని ప్రకటించారు. తాజాగా సోమవారం కలెక్టర్ హరిత రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, సివిల్ సప్లయీస్ అధికారులతో సమావేశమై సీఎంఆర్ డెలివరీపై సమీక్షించారు. 90.71శాతమే కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా 15,521 మెట్రిక్ టన్నుల బకాయి ఉండడాన్ని తీవ్రంగా పరిగణించారు. గడువు మరో మూడు రోజులే ఉండగా ఇంకా 15,521 టన్నుల సీఎంఆర్ డెలివరీ పెండింగ్‌లో ఉండడం ప్రస్తుతం రైస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ మిల్లులపై అధికారుల దృష్టి
102 రైస్‌మిల్లుల్లో కొన్ని మిల్లుల నిర్వాహకులు అతి తక్కువ సీఎంఆర్ డెలివరీ చేశారు. దీంతో అధికారులు సదరు మిల్లులపై దృష్టి పెట్టారు. నర్సంపేటలోని శ్రీసాయి బాలాజీ ట్రేడర్ నిర్వాహకులు 43.32 శాతం, రాయపర్తి మండల కేంద్రంలోని రోహిణి బిన్ని రైస్‌మిల్ నిర్వాహకులు కేవలం 43.91 శాతం, వర్ధన్నపేట మండలం ఇల్లందలోని లక్ష్మి శ్రీ గణపతి ఇండస్ట్రీస్ నిర్వాహకులు 54.53 శాతం, నడికుడ మండలం నర్సక్కపల్లెలోని కార్తికేయ ఆగ్రోటెక్ మిల్లు నిర్వాహకులు 57.94 శాతం, నర్సంపేట మండలం మహేశ్వరంలోని అశోక ఇండస్ట్రీస్ నిర్వాహకులు 61.77 శాతం మాత్రమే సీఎంఆర్ డెలివరీ చేశారు. ఇంకా 15 బాయిల్డ్ రైస్ మిల్లులు, 29 రా రైస్‌మిల్లుల నిర్వాహకులు 15,521 టన్నుల సీఎంఆర్ బకాయి ఉన్నారు.
కొన్ని మిల్లుల్లో ధాన్యం నిల్
సీఎంఆర్ బకాయి ఉన్న రైస్‌మిల్లుల్లోని కొన్నింట్లో ప్రభుత్వం నుంచి వానకాలం పొందిన ధాన్యం లేదని తెలిసింది. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన వానకాలం ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాలోని 102 రైస్‌మిల్లులకు తరలించారు. వీటిని నిల్వ చేసిన రైస్‌మిల్లర్లలో పలువురు నిబంధనల ప్రకారం మరాడించి ప్రభుత్వానికి సీఎంఆర్ డెలివరీ చేశారు. కొందరు మిల్లర్లు ప్రభుత్వం తమకు గత యాసంగి సీజన్ ధాన్యాన్ని కేటాయించగానే వానకాలం ధాన్యంలో కొంత మార్కెట్‌కు తరలించి క్యాష్ చేసుకున్నట్లు సమాచారం. మరికొంత వానకాలం ధాన్యాన్ని యాసంగి ధాన్యం నిల్వల్లో కలిపేశారు. వానకాలం, యాసంగి ధాన్యం వేర్వేరుగా నిల్వ చేసేందుకు సరిపడా స్థలం లేనందున రెండు సీజన్ల ధాన్యాన్ని కలిపి ఒకేచోట నిల్వ చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు చెప్పారు. సివిల్ సప్లయీస్ అధికారులు కూడా గుర్తించలేని పరిస్థితుల్లో మిల్లర్లు సీఎంఆర్ డెలివరీ చేస్తే సరిపోతుందనే ఆలోచనతో నిల్వలను అంతగా పట్టించుకోలేదు. వానకాలం సీఎంఆర్‌ను రైస్‌మిల్లర్లు వంద శాతం డెలివరీ చేయకపోవడానికి ఇదో కారణమని తెలుస్తున్నది. వానకాలం ధాన్యం నిల్వలు లేని సీఎంఆర్ బకాయిదార్ల విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
తాజావార్తలు
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం
- ‘అనంత’ విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
- శర్వానంద్ నాకు బిడ్డలాంటి వాడు: చిరంజీవి