శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 28, 2020 , 03:29:41

చెరువులు నిండే.. రైతన్న మురిసే..

చెరువులు నిండే..  రైతన్న మురిసే..

  • ఎమ్మెల్యే రాజయ్య చొరవతో పల్లగుట్టకు గోదావరి నీళ్లు
  • నిండు కుండల్లా నాలుగు చెరువులు
  • మత్తడి దుంకుతున్న చింతల చెరువు 
  • సాగులోకి దాదాపు 1500 ఎకరాలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, మత్స్యకారులు  

స్టేషన్‌ఘన్‌పూర్‌ : తమ ఊరికి గోదావరి జలాలు తరలివచ్చి చెరువులను నింపడంతో స్థానిక రైతులు, మత్స్యకారులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కృషితో ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి మల్లన్నగండి పైపులైన్‌ ద్వారా చిలుపూర్‌ మండలం పల్లగుట్ట గ్రామంలోని నాలుగు చెరువులకు నీరు చేరడం, చింతల చెరువు మత్తడి దుంకుతుండడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. పల్లగుట్టకు గోదావరి నీటిని తరలించాలని కొన్ని నెలల నుంచి పలు మార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు టీఆర్‌ఎస్‌ మండల గౌరవాధ్యక్షుడు పోట్లపల్లి శ్రీధర్‌రావు కలిసి ఎమ్మెల్యే రాజయ్యకు ప్రత్యేకంగా విన్నవించారు. శ్రీధర్‌రావు సహకారం, ఎమ్మెల్యే రాజయ్య చొరవతో ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా మల్లన్నగండి పైపులైన్‌ నుంచి పల్లగుట్ట గ్రామంలోని నాలుగు చెరువులకు గోదావరి జలాలు చేరుతున్నాయి. వీటి కింద దాదాపు 1500ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. చెరువుల కింద రైతులంతా తమ భూముల్లో వరి, పత్తి, మక్క పంటలు సాగు చేస్తున్నారు.మరో వైపు మత్స్యకారులు చెరువుల్లో చేపపిల్లలు వదిలారు. ప్రస్తుతం పైపులైన్‌ ద్వారా పల్లగుట్టలోని నాలుగు చెరువులకు జలాలు చేరుతుండగా ఊర చెరువు, చింతల్‌ చెరువు మత్తడి దుంకుతున్నాయి. 40ఏళ్ల తర్వాత రెండేళ్లుగా వెంకటాద్రి చెరువు మత్తడి పోస్తున్నది. వెంకటాద్రి చెరువు నుంచి గేట్‌వాల్‌ ద్వారా రైతులకు సాగునీరంచేందుకు వంక ఏర్పాటు కోసం శ్రీధర్‌రావు రూ.35వేల ఆర్థిక సాయం చేశారు.   

సాగునీటికి ఢోకా లేదు.. 

మా ఊరి వెంకటాద్రి చెరువు నిండింది. ఇగ సాగునీటికి ఢోకా లేదు. 40ఏళ్ల నుంచి మత్తడి నిలిచిపోయిన ఈ చెరువు రెండేళ్ల సంది దుంకుతాంది. ఆయకట్టు రైతులకు అండగా నిలిచిన శ్రీధర్‌రావు, ఎమ్మెల్యే రాజయ్యకు కృతజ్ఞతలు.

- కుంచాల సంపత్‌రాజ్‌, రైతు, పల్లగుట్ట 

ఎమ్మెల్యే రాజయ్య సహకారంతోనే.. 

స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే రాజయ్య సహకారంతోనే మా ఊరిలో నాలుగు చెరువులను గోదావరి జలాలతో నింపాం.. రైతులు ఆనందంగా ఉండాలనేదే నా ఉద్దేశం.. వెంకటాద్రి చెరువు నుంచి గేట్‌వాల్‌ ద్వారా సాగునీరందించేందుకు వంకను ఏర్పాటు చేశా. అభివృద్ధి పనులకు ఎల్లప్పుడూ సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.

- పోట్లపల్లి శ్రీధర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల గౌరవాధ్యక్షుడు


VIDEOS

తాజావార్తలు


logo