మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jul 26, 2020 , 06:18:52

చరిత్ర గుర్తులు.. ‘తాటికొండ’ గుట్టలు..!

చరిత్ర గుర్తులు.. ‘తాటికొండ’ గుట్టలు..!

  • రెండు గుట్టలకూ చారిత్రక నేపథ్యం 
  • ఖిలాగుట్టపై ఆధ్యాత్మిక శోభ 
  • గాలి గుట్టపై పురాతన సమాధులు 
  • పరిశోధన కొనసాగిస్తున్నచరిత్రకారులు 
  • వెలుగులోకి వస్తున్న ఆసక్తికర అంశాలు
  • పెరుగుతున్న సందర్శకులు 

ఒకే ఊరిలో రెండు గుట్టలు.. ఇప్పుడు చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ గుట్టలకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. దీంతో  వీటిపై చరిత్రకారులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అవే ఖిలాగుట్ట, గాలిగుట్ట. ఒక గుట్ట ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంటే మరో గుట్ట వేల ఏళ్ల నాటి సమాధులతో చరిత్రను తనలో దాచుకుంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ గుట్టలు ఎక్కడో కాదు జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండలో ఉన్నాయి. 

- జనగామ నమస్తే తెలంగాణ, స్టేషన్‌ఘన్‌పూర్‌ 


బహుజన నాయకుడు సర్దార్‌ సర్వాయి పాపన్న ఏలుబడికి చిరునామాగా మారిన గ్రామం తాటికొండ. ఇక్కడ క్రీ.పూ. 5వేల ఏళ్ల క్రితం నాటి చరిత్రపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. చరిత్రకారులు ఎన్నో విషయాల్ని ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చారు. పరిశోధనలు చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. జనగామ జి ల్లాలోని ప్రతి గ్రామాన్ని సందర్శించిన చరిత్రకారుడు రత్నాకర్‌రెడ్డి కొంతకాలం క్రితం  తాటికొండ గ్రామాన్ని సందర్శించారు. ఆయన పరిశోధనలో కొత్త విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. గ్రామంలోని ఖిలాగుట్ట, గాలిగుట్ట రెండు కూడా  చారిత్రకంగా ప్రాధాన్యత సం తరించుకున్నట్లు వివరించారు. చుట్టు పక్కల గ్రామాల వారు గుట్టల పైకి ఎక్కి అక్కడి విషయాల్ని తెలుసుకున్నారు. వీటి విశిష్టత అంతటా వ్యాపించడంతో ఇతర ప్రాంతాల వారు  వచ్చి గుట్టలను సందర్శిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా సెల వు దినాల్లో యువత ఈ గుట్టలపైకి ఎక్కడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

పచ్చదనం, డోల్మాన్‌ సమాధులతో గాలిగుట్ట

గాలిగుట్ట ఎత్తు తక్కువగా ఉండి విశాలమైన  ఉపరితలం కలిగి ఉంటుంది. చుట్టుపక్కల పచ్చదనంతో కళకళలాడుతూ ఆహ్లాదకరంగా  కనిపిస్తుంది. ఈ గాలిగుట్ట చుట్టూ కోట కట్టినట్టు ఎత్తైన గుట్టలున్నాయి. మల్లన్న గండి నుంచి నిరంతరం వాగు ప్రవహిస్తూ గుట్ట పక్క నుంచే వెళ్తుంది. ఈ ప్రాంతంలో గాలి ఎక్కువగా వీస్తుండడంతో  గాలిగుట్ట అని పేరు వచ్చింది. ఈ గుట్టపై నవీన శిలాయుగం నుంచి ఆదిమానవుల వరకూ జీవించారని చెప్పడానికి చాలా ఆధారాలున్నాయి. రాతి గొడ్డళ్లు నూరుకోగా ఏర్పడిన గుర్తులు(గ్రూమ్స్‌) 20 వరకు ఉన్నాయి. గుర్తులు ఉన్న చోట బండను గృహావసరాలకు తొలిచివేయడం వల్ల అనేక ఆధారాలు కనుమరుగయ్యాయి.  ఈ గుట్టపై పదుల సంఖ్యలో డోల్మాన్‌ సమాధులు ఉన్నాయి. ఇవి క్రీ. పూ. 500 ఏళ్ల క్రితం నిర్మించిన సమాధులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. కొన్ని డోల్మాన్‌ సమాధులు గుండ్రంగా ఉన్న ఏక రాతిపై నిర్మించగా చాలా సమాధులు చతురస్త్రంగా చెక్కిన రాళ్లను ఒకదానిపై మరొకటి పెట్టి కప్పుబండలను అమర్చారు. ఇవి ఐదు అడుగుల నుంచి 20 అడుగుల వరకు పొడవు ఉన్నాయి. తాటికొండ గుట్టపై ఇలాంటివి సుమారు 40 సమాధులు ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాతి గుండ్లపై నిర్మించిన రాకాసి గుండు చూపరులను విశేషంగా ఆకర్శిస్తున్నది.  ఇదే గుట్ట దిగువన డాల్మానాయిడ్‌ సమాధి కూడా ఉంది.

డాల్మనాయిడ్‌, కైరన్‌ సమాధులు 

డోల్మాన్‌ సమాధిలో మరొక గూడు నిర్మించినట్లయితే దాన్ని డాల్మానాయిడ్‌ సమాధి అంటారు. ఈ సమాధులు కేవలం జనగామ జిల్లాలోని గూడూరు, తాటికొండ గ్రామాల్లోనే ఉన్నాయి. అలాగే, గాలిగుట్ట కింద బృహద్‌శిలాయుగపు శ్మశానవాటిక ఉంది. ఇక్కడి సమాధుల్లో కార్న్‌ సర్కిల్స్‌(కైరన్‌ సమాధులు) అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని స్థానికులు రాకాసి రాళ్ల కంచెగా పిలుస్తున్నారు. గాలిగుట్టపై బౌద్ధస్తూప ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయి.  గాలిగుట్ట ఉపరితలంపై ఎత్తైన మట్టి దిబ్బలున్నాయి.దీనికి తోడు రాయి, మట్టితో కూడిన ఓనిర్మాణం ఉంది. ఈ వృత్తాకారపు మట్టి దిబ్బలు చాలా వరకు శిథిలమయ్యాయి. దీంతో మట్టి దిబ్బల నిర్మాణం నామమాత్రంగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 

గుండాలు, కోటలతో ఖిలాగుట్ట

ఖిలాగుట్టపై పాపన్న నిర్మించిన కోటకు మొత్తం నాలుగు మార్గాలున్నాయి. ఇందులో మూడు ప్రవేశ ద్వారాలు  కాగా, శత్రు సైనికులు దాడిచేస్తే తప్పించుకోవడానికి గుట్ట వెనుక భాగాన మరో ద్వారం ఉంది. అదే విధంగా ఈ గుట్ట పై ఏడు గుండాలు ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. శ్రీరాముని గుండంలో  ఏటా కార్తీకపౌర్ణమి రో జు పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహిస్తారు.  తామెర గుండంలోని తామెర పూలను గృహప్రవేశానికి ఉపయోగిస్తారు. దర్భగుండంలోని గరిక పోచలను గోదాదేవి పూజలకు ఉపయోగిస్తారు. తలనీలాల గుండంలో తలనీలాలు సమర్పించి స్నానం చేస్తారు. ఇవే గాక ఆంజనేయస్వామి గుండం, సర్వగుండం ఉన్నాయి. ఈ గుండాల సమీపంలో ఎత్తైన బండపై రామాలయం ఉంది. ఆ ఆలయంలోని విగ్రహాలు చోరీకి గురయ్యాయి. గరుత్మంతుడి పీఠం ప్రస్తుతం ఉంది. ఇక్కడ పచ్చీసు బండ కనిపిస్తుంది. ఖిలాగుట్ట కింద సర్వాయి పాపన్న నిర్మించిన నాలుగు మూలల్లో నాలుగు ఎత్తైన రాతి బురుజులున్నాయి. వీటిని కలుపుతూ ఐదు అడుగుల వెడల్పుతో సుమారుగా 15 అడుగుల ఎత్తు మట్టిగోడలు ఉన్నాయి. ఈ గోడల నిండా శాతవాహనపు ఎరుపు, నలుపు రంగు కలిగిన అనేక మృణ్మయ పాత్రల ముక్కలు చాలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాత్రలు హన్మకొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. నిటారుగా ఉన్న ఖిలాగుట్టపై చుట్టూ  కోటగోడ ఉంది. కింద ఉన్న  మట్టిని పైకి తరలించి దాన్ని నిర్మించారు. అసలు ఈ గుట్ట ఎక్కాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాలి. కానీ, ఆనాడే మ ట్టిని తరలించి పైన గోడలు కట్టారంటే ఎంతగా శ్రమించారో తెలుస్తోం ది. గుట్టపై అనేక చోట్ల శిల్పాలను చెక్కారు. ఆలయం ముందు ఉన్న గుండుపై మహాబలిపురాన్ని గుర్తుకు తెచ్చేలా శిల్ప సౌదర్యం ఉంది. వినాయకుడిని సేవిస్తున్న ఏనుగుల వరుస, హనుమంతుడు, వానర సైన్య శిల్ప సౌందర్యం అబ్బురపరుస్తుంది. శిల్పాలు చెక్కడానికి ముం దు గీసిన గీతలు కూడా కనిపిస్తాయి. ఆలయం లోపల ఎదురుగా రా ముడు, సీత, గరుత్మంతుడి శిల్పాలుండగా, కుడివైపు బండకు ఆళ్వారు ల శిల్పాలున్నాయి. ధ్వజ స్తంభం కింద బండకు ఇద్దరు స్త్రీమూర్తుల శి ల్పాలున్నాయి. రామాలయానికి ముందు భాగాన ఉన్న శిథిల శివాలయంలో లింగం ఉంది. ఖిలాగుట్టకు ఆనుకుని వల్లభరాయుని చెరువు ఉంది. చెరువు పక్కనే పాటిగడ్డపై పొడవాటి బౌద్ధ స్తూపం ఉందని గ్రా మస్తులు చెబుతున్నారు. ఏడు కప్‌ మార్క్స్‌తో మూడు వరుసల్లో ఉండ డం తాటికొండ ఖిలాగుట్ట ప్రత్యేకత. చాలా చోట్ల రెండు వరుసల్లోనే కన్పిస్తాయి. గుట్ట ఎక్కే క్రమంలో ఫిరంగులు అమర్చే ప్రాంతాల నుంచి ఊరి శివారు వరకు  కన్పిస్తాయి. గుట్టపై కూలిన మట్టిదిబ్బలు ఉన్నా యి. శిథిలమైన ఆలయ ఆనవాళ్లు ఉన్నాయి. అదే విధంగా పెట్రోగ్లిప్‌ రూపంలో ఎత్తైన హనుమాన్‌ చిత్రం అస్పష్టంగా ఉంది. ఈ చిత్రం కింది రెండు వరుసల్లో ఉన్న లిపి అస్పష్టంగా ఉంది. అదేవిధంగా గుట్టపై రెం డు వరుసల్లో ఐదేసి చొప్పున సమాన దూరంలో రోళ్లు ఉన్నాయి. వీటిని సీతారాముల వామన గుంటలు అని పిలుస్తారు. ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖిలాగుట్టపై వేడుకలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు నిర్వహిస్తారు. శ్రీరామ గుండంలో ఉసిరికొమ్మలతో స్నానాలు చేసి దర్శించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.


VIDEOS

తాజావార్తలు


logo