ఆదివారం 17 జనవరి 2021
Jangaon - Jul 18, 2020 , 02:38:45

గుట్టుగా గంజాయ్‌

గుట్టుగా గంజాయ్‌

  • రహస్యంగా విక్రయాలు
  • చాపకింద నీరులా విస్తరణ
  • పల్లెల్లోనూ జోరుగా అమ్మకాలు
  • బానిసవుతున్న యువత
  • లాక్‌డౌన్‌తో మరింత పెడదోవన
  • పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మైనర్లు 

పల్లె పొలిమేరల్లో గంజాయి గుప్పుమంటున్నది. చాపకింద నీరులా విక్రయాలు సాగుతున్నాయి. యువతే బానిసవుతుండగా లాక్‌డౌన్‌ కారణంగా మరింత పెడదోవన పడుతున్నది. గంజాయి విక్రయిస్తూ శుక్రవారం ఇద్దరు మైనర్లు పట్టుబడడం జనగామ జిల్లాలో కలకలం రేపింది.   

లింగాల ఘనపురం : జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో గంజాయి విక్రయాలు గట్టు చప్పుడుకాకుండా కొనసాగుతున్నాయి. స్మగ్లర్లు లాక్‌డౌన్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని మైనర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇప్పటి దాకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి విక్రయాలు పల్లెలకూ విస్తరించడం కలకలం రేపుతున్నది. మండలంలో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విషయం వెలుగుచూసింది. మండలంలోని చీటూరుకు చెందిన మైనర్‌ (17) తండ్రి చనిపోవడంతో చదువును మధ్యలోనే ఆపేసి బలాదూర్‌గా తిరుగుతున్నాడు.

ఇదే మండలంలోని వడిచర్లకు చెందిన మరో మైనర్‌ (17) తండ్రి ఇటీవలే జనగామ సమీపంలోని నెల్లుట్ల శ్రీనివాస్‌నగర్‌కాలనీలో కిరాణా షాపు పెట్టాడు. వడిచెర్లకు చెందిన మైనర్‌ హైదరాబాదులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతూ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నాడు. గంజాయి స్మగ్లర్లు వీరిద్దరికీ ఎరవేసి పావులుగా వాడుకుంటున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ. 500 నుంచి రూ.1500 వరకు వీరితో మరికొందరికి అమ్మిస్తున్నారు. మత్తుకు బానిసలైన యువకులు రహస్యంగా నడుస్తున్న విక్రయ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నట్లు తెలుస్తున్నది. ఉప్పందుకున్న పోలీసులు, మొదట నెల్లుట్ల శ్రీనివాస్‌నగర్‌లో ఉంటున్న మైనర్‌ను అదుపులోకి తీసుకొని చీటూరుకు శుక్రవారం ఉదయం 5గంటలకే చేరుకున్నారు. గ్రామ పొలిమేరలో అతడితో మరో మైనర్‌కు ఫోన్‌ చేసి రప్పించారు.

గంజాయి కోసమే వచ్చాడని నిర్ధారించుకొని అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చీటూరులోని మైనర్‌ ఇంట్లో  సోదా చేసి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు నివ్వెర పోయారు. కాగా ఏ గ్రామంలో ఈ విక్రయాలు జరుగుతున్నాయి? ఇంకా ఎంతమంది ఏజెంట్లు విక్రయాలు చేస్తున్నారు? ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆరు నెలల క్రితం జనగామ జిల్లాలోని ఓ సరిహద్దు మండల కేంద్రంలో గంజాయి సేవిస్తూ పలువురు యువకులు పట్టుబడగా పలువురు పెద్దల చొరవతో ఆ విషయం బయటకు పొక్కలేదు. కాగా గంజాయి మాఫియా జిల్లాలో ఎక్కడెక్కడ విస్తరించిందో.. ఎంతలా ప్రభావం చూపిస్తున్నదో పోలీసులు లోతుగా విచారిస్తేనే తేలనున్నది.

పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు 

జనగామ క్రైం : జనగామ జిల్లా కేంద్రంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు బాలురను జనగామ ఎస్సై బీ రాజేశ్‌ నాయక్‌ శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌యాదవ్‌ తెలిపారు. ఇద్దరు బాలురు లింగాలఘనపురం మండలం వడిచర్ల, చీటూరుకు చెందిన వారని, వారి నుంచి ఒక్కోటి 260 గ్రాముల బరువున్న 30 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.20వేల దాకా ఉంటుందని చెబుతున్నారు. కానీ బయట ఒక్కో గంజాయి ప్యాకెట్‌ ధర రూ.1500 దారా పలుకుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 30 గంజాయి ప్యాకెట్లకు సుమారు రూ.50వేల దాకా ఉంటుందని అంచనా. ఏదేమైనా చదువులో రాణించి ఉన్నతస్థాయికి చేరాల్సిన విద్యార్థులు పెడదోవన పడు తూ జల్సాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్‌ను ఫణంగా పెట్టడం అందరినీ ఆందోళనలో పడేస్తున్నది.