శుక్రవారం 07 ఆగస్టు 2020
Jangaon - Jul 14, 2020 , 06:09:23

పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

  • స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల పర్యటనలో జిల్లా కలెక్టర్‌ నిఖిల

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, జూలై 13 : ‘పల్లెప్రగతి’ని పూర్తిస్థాయిలో అమలు చేస్తే గ్రామాలు అభివృద్ధిలో ముందుం టాయని జిల్లా కలెక్టర్‌ నిఖిల అన్నారు. సోమవారం మండలంలోని రాఘవాపూర్‌, మీదికొండ, కొత్తపల్లి, తాటికొండ, జిట్టగూడెం గ్రామాల్లో పల్లెప్రగతి పనులను ఆమె పరిశీలించారు. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, హరితహారంలో నాటిన మొక్కలు, నర్సరీలను ఆమె పర్యవేక్షించారు. రాఘవాపూర్‌లో వైకుంఠధామం పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను నిఖిల కోరారు.

గ్రామంలోని వీధులను పరిశీలించి చెత్తాచెదారం ఉన్న ఇంటి యాజమానులకు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. గ్రామశివారులో ఉన్న నర్సరీని పరిశీలించారు. మీదికొండ గ్రామంలో శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు పనులు పక్షం రోజుల్లో పూర్తికావాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రటరీ విమలను వెంటనే వేరే గ్రామానికి బదిలీ చేయాలని డీపీవో వెంకటేశ్వర్లును ఆదేశించారు. కొత్తపల్లిలో నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నర్సరీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలో పల్లెప్రగతి పనుల్లో మరింత వేగం పెంచాలని కోరారు.

తాటికొండలో వననర్సరీని పరిశీలించిన కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని గ్రామాల్లో వైకుంఠధామాల పనులు బాగున్నాయని సర్పంచ్‌లను ఆమె అభినందించారు. జిట్టగూడెంలో పనుల ప్రగతిని అడిగితెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ పల్లెప్రగతి పనుల పూర్తికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. నిధులకు కొరతలేదని, పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని ఆమె అధికారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని సమస్యలను సర్పంచ్‌లు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్‌డీవో రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమేశ్‌, తహసీల్దార్‌ విశ్వప్రసాద్‌, ఎంపీడీవో కుమారస్వామి, ఈవోపీఆర్డీ మహబూబ్‌ఆలీ, ఎంపీపీ కందుల రేఖ, వైస్‌ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, ఆర్‌ఐలు కృపాకర్‌రెడ్డి, భగత్‌, సర్పంచ్‌లు కందుల శ్రీలత, నాగరబోయిన మణెమ్మ, ఆనందం, చల్లా ఉమాదేవి, మాలోత్‌ లలిత, ఎంపీటీసీ బెల్లపు వెంకటస్వామి, ఉపసర్పంచ్‌లు రంజిత్‌, రాములు, వార్డు సభ్యులు గొడుగు సంజీవ్‌, రీగన్‌ తదితరులు పాల్గొన్నారు.

నెలఖారులోగా పనులు పూర్తికావాలి..

అన్ని గ్రామాల్లో మిగిలిన పల్లెప్రగతి పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ నిఖిల అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆమె కోరారు.logo