శుక్రవారం 22 జనవరి 2021
Jangaon - Jul 02, 2020 , 00:19:57

బీటీ-3తో బురిడీ

బీటీ-3తో బురిడీ

       గుట్టుచప్పుడు కాకుండా  పత్తి గింజల విక్రయాలు

ప్రభుత్వం నిషేధించినా దొడ్డిదారిన దళారుల అమ్మకాలు

గడ్డి, రసం పీల్చే పురుగును తట్టుకుంటుందని రైతులకు కుచ్చుటోపీ

విత్తనాలు వాడితే భూములు సారం కోల్పోయే ప్రమాదం

నిఘా పెంచిన పోలీసు,  వ్యవసాయ శాఖ అధికారులు

మానుకోట జిల్లాలో రూ.55 లక్షల విలువ చేసే సీడ్స్‌ సీజ్‌

తొర్రూరు, జూలై 01 : భూసారానికి ప్రమాదం ముంచుకొస్తున్నది.. వాణిజ్య పంట అయిన పత్తి రూపంలో సారవంతమైన నేలలు దెబ్బతినేలా రైతుల ముందుకు మాయదారి విత్తనాలను మోసుకొస్తున్నారు. ఇప్పటి వరకు ప్రయోగ దశలోనే ఉండి దేశంలోనే నిషేధించిన బీటీ-3 (రౌండప్‌ రెడీఫ్లెక్స్‌ టెక్నాలజీ) విత్తనాలను మహబూబాబాద్‌ జిల్లాలో కొందరు దళారులు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు కేంద్రంగా కొందరు జిల్లాలోకి ఈ విత్తనాలను పట్టుకొస్తున్నారు. బీటీ-3 పత్తి విత్తనం వాడితే గడ్డి, రసంపీల్చే పురుగుల సమస్య ఉండదంటూ రైతులకు మాయమాటలు చెబుతున్నారు. భూములు సారం కోల్పోయేలా చేసే ఈ విత్తనాలను కట్టబెడుతున్నారనే సమాచారం రావడంతో నేరుగా జిల్లా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మహబూబాబాద్‌, తొర్రూరు ప్రాంతాల్లో అమ్ముతున్న విత్తనాలను స్వాధీనం చేసుకుని పలువురు విక్రయదారులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  

ప్రయోగాత్మక దశలోనే ప్రమాద భరితమని గుర్తించి బీటీ-3 విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు జిల్లా కేంద్రంగా తెలంగాణకు గుట్టుచప్పుడు కాకుండా ఈ విత్తనం ప్రవేశించింది. కొంత మంది దళారులు రైతుల అమాయకత్వం, అవసరాలను ఆసరాగా చేసుకుని భూసారాన్ని పిప్పి చేసే బీటీ-3 విత్తనాలను అంటగడుతున్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న బీటీ-2 విత్తనాలు మొలకెత్తిన తర్వాత చుట్టు పక్కల పెరిగే కలుపు, గడ్డిని చంపడం చాలా కష్టతరంగా మారింది. మొక్క చుట్టూ పెరిగిన గడ్డిని చంపేందుకు పురుగు మందు వాడితే మొదటికే మోసం వచ్చి పత్తి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎక్కువ డబ్బులు ఖర్చుచేసి కూలీల సాయంతో గడ్డిని తీయించక తప్పదు. అయితే బీటీ-3 విత్తనాలు విత్తితే మొలకల మధ్య పెరిగే గడ్డిపై మందు పిచికారీ చేసినా పత్తి మొలక చనిపోదు. పైగా ఈ మొలకలకు రసంపీల్చే పురుగుల బెడద అసలే ఉండదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో కొద్ది మంది రైతులు ఈ విత్తనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు.  

17 ఏళ్లుగా బీటీ-2 విత్తన సాగు..

బేసిల్లస్‌ తురంరజెన్సీసిస్‌ (బీటీ) అనే విత్తనాలు 17 ఏళ్ల కిందట మార్కెట్‌లోకి రంగప్రవేశం చేశాయి. ఎన్నిరకాల మందులను పిచికారీ చేసినా పురుగులు చనిపోక మొక్కలు నాశనమవుతున్న తరుణంలో అన్నింటినీ తట్టుకునేలా ఈ వంగడాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిచయం చేశారు. ఇవి మార్కెట్‌లోకి వచ్చిన కొత్తలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. బీటీ మొక్కలను పంట చేతికొచ్చిన తర్వాత తిన్నప్పటికీ పశువులు చనిపోతాయని, వీటిని తరచుగా తాకితే రైతులకు రోగాలు వస్తాయనే వదంతులు వచ్చాయి. అయితే, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించడంతో రానురాను ఈ వంగడాలను అందరు వాడుతూ అధిక దిగుబడి పొందుతున్నారు. అయితే ఈ బీటీ విత్తనాలు  పచ్చ, గులాబీ పురుగులను మాత్రమే తట్టుకోగలుగుతాయి. లద్దె పురుగు సమస్య అధికమైన తరుణంలో బీటీ-2 అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు గడ్డి, రసం పీల్చే పురుగుల సమస్యను కూడా అధిగమించగలిగే శక్తి బీటీ-3 విత్తనాలకు ఉందంటూ కొందరు దళారులు గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.  

కౌలు భూముల్లోనే అధికం..

బీటీ-3 విత్తనాలతో భూములు సారం కోల్పోతాయి. భూముల ను కౌలుకు తీసుకున్న రైతులే ఎక్కువగా వాడుతున్నారు. పత్తి దిగుబడి పెరుగుతుందని వీటిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పత్తి రకాల్లో కలుపు మొక్కలను తీయించడం పెద్ద కష్టంగా మారింది. దీని కోసం రూ.వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తున్నందున ప్రత్యామ్నాయంగా ఈ విత్తనాలను వాడుతున్నారు.   

భూముల్లో పడిపోతున్న నత్రజని శాతం..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటికే బీటీ పత్తి విత్తనాలు, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం తగ్గుతుందని భూసార పరీక్ష కేంద్రాల అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి సారవంతమైన భూముల్లో 150 నుంచి 250 యూనిట్ల మేర నత్రజని శాతం ఉండాలి. అనేక మండలాల్లో నిర్వహించిన నేల స్వభావ పరీక్షల్లో 125 యూనిట్లకు లోపు నత్రజని ఉంటుందని, ఇదే సమయంలో భాస్వరం, పొటాషియం శాతం మోతాదుకు మించి నమోదవుతుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీటీ-3 వంటి విత్తనాలను పండిస్తే భవిష్యత్‌లో పంటల పరిస్థితి దారుణంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి నకిలీ విత్తనాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్టం నుంచి మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన కొన్ని ప్రాంతాలకు ఈ నకిలీ విత్తనాలు రవాణా అవుతున్నాయి. ఖమ్మం జిల్లా ఏకునూరుకు చెందిన గుండ్ల శ్రీనివాస్‌ ఈ విత్తన సరఫరాలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. తూర్పు గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన గోపినాథ్‌ అనే వ్యక్తి నుంచి ఈ పత్తి విత్తనాలను శ్రీనివాస్‌ కొనుగోలు చేసి సంచులు, ఆహార పదార్థాలు వేడిగా ఉండేందుకు వినియోగించే ప్యాకింగ్‌ కవర్లలోనింపి భద్రాద్రికొత్తగూడెం జిల్లా, తొర్రూరుకు సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విత్తనాలు తయారు చేసే ప్రధాన వ్యక్తి గోపినాథ్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. కిలో బీటీ-3 విత్తనానికి రూ.1500 చొప్పున  దళారులకు విక్రయిస్తున్నారు. వారు రైతులకు కిలోకు రూ.2400 వరకు విడి విత్తనాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 2015లో నకిలీ విత్తనాల విక్రయానికి సంబంధించి జిల్లాలో మూడు కేసులు, 2017లో ఏకంగా జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. అప్పట్లో గుంటూరు నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చిన కొంత మంది వ్యక్తులు తొర్రూరు, మరిపెడ ప్రాంతాల్లో రైతులకు విక్రయించారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాలతో నిఘా పెట్టిన పోలీసులు విత్తనాలను విక్రయిస్తున్న వారిపై   కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.  మహబూబాబాద్‌లో పట్టుబడిన నకిలీ విత్తనాల చరిత్ర మరోలా ఉంది. వేదా సీడ్స్‌ కంపెనీ పేరుతో మేడ్చల్‌ జిల్లా నుంచి బీటీ-2 రకం పత్తి విత్తనాలు అంటూ ప్యాకెట్ల కవర్లను తీసుకువచ్చి రైతులకు అంటగట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలీ నుంచి మేడ్చల్‌ జిల్లా కొల్లాపూర్‌కు ఈ నకిలీ విత్తనాలు సరఫరా చేశారు. వీటిని మహబూబాబాద్‌కు చెందిన వ్యాపారి తీసుకొచ్చి విక్రయిస్తుండగా పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. గత రెండేళ్లలో నకిలీ విత్తనాల విక్రయం తగ్గిపోగా తాజాగా జిల్లాలోని మహబూబాబాద్‌, తొర్రూరు ఏరియాల్లో రూ.55 లక్షల విలువ చేసే పత్తి, మిరప విత్తనాలు పట్టుబడ్డాయి.  


logo