శనివారం 04 జూలై 2020
Jangaon - Jul 01, 2020 , 02:38:25

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

 ఫిషరీస్‌, వెటర్నరీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితారాజేందర్‌

నెహ్రూపార్క్‌, 30 జూన్‌ : మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత అందరిదని ఫిషరీస్‌, వెటర్నరి శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితారాజేందర్‌ అన్నారు. మంగళవారం జనగామలోని విజయడెయిరీకి ఆమె వచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అనితరాజేందర్‌ డెయిరీ ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, భవిష్యత్‌ తరాలకు ఇదే మనమిచ్చే కానుక అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంచి పోషక విలువలుండే స్వచ్ఛమైన పాలను జిల్లా రైతుల నుంచి సేకరించడం అభినందనీయమని అన్నారు. టెట్రా ప్యాక్‌లకు జనగామ జిల్లా పాలు ఉపయోగపడడం ఎంతో సంతోషకరమని ఆమె పేర్కొంటూ ఇక్కడి డెయిరీకి టెట్రా ప్యాక్‌ మిషన్‌ను మంజూరు చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, డిప్యూటీ డైరెక్టర్‌ బీ.రమేశ్‌,  పాల ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి, సూపర్‌వైజర్‌ నాగరాజు, వెంకట్‌ రెడ్డి, జైసింహారెడ్డి, శ్రీనివాస్‌, మల్లేశం, కృష్ణ పాల్గొన్నారు.

ఉత్సాహంగా హరితహారం ..

దేవరుప్పుల ; మండలంలోని అన్ని గ్రామాల్లో హరితహారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఆయా గ్రామాల్లో ముందస్తుగా తీసిన గుంతల్లో మొక్కలు నాటుతున్నారు. సామూహిక హరితహారానికి ప్రాముఖ్యతనిస్తూ ప్రజలు భాగస్వాములవుతున్నారు. చినమడూరులో మంగళవారం సర్పంచ్‌ వంగ పద్మ నేతృత్వంలో మొక్కలు నాటగా, శ్మశానవాటికలో సామూహిక వనాలను చేపట్టారు. ఎంపీపీ బస్వ సావిత్రి, ఎంపీడీవో అనిత హాజరై మొక్కలు నాటారు. అప్పిరెడ్డిపల్లిలో సర్పంచ్‌ సుధాకర్‌,రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సిందె రామనర్యయ్య పర్యవేక్షణలో సామూహికంగా మొక్కలు నాటారు.  

జనగామ మండలంలో..

జనగామ రూరల్‌ : మండలంలో జోరుగా హరితహారం కొనసాగుతోంది. మంగళవారం మండలంలోని సిద్దెంకి గ్రామంలో కొందరు యువకులు మొక్కలు నాటారు. చౌడారంలో ముక్క విష్ణు పుట్టినరోజు సందర్భంగా మోడల్‌ స్కూల్‌లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తాల సురేశ్‌, బీదని మహేశ్‌, ఆశోక్‌, కరుణాకర్‌, హరి, మల్లేశ్‌, తదితరులు పాల్గొన్నారు. logo