కరోనా కట్టడికి వ్యాపారవర్గాల బంద్

జనగామ నెహ్రూపార్క్ 22 జూన్ : కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగు తుండడంతో వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 73కు పెరగడంతో లాక్డౌన్ ద్వారా మాత్రమే వైరస్‌ను అరికట్టవచ్చని భావించి సోమవారం దుకాణాల బంద్ చేపట్టారు. ఇప్పటికే బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో పట్టణంలోని బట్టల వ్యాపారులు, ఎలక్ట్రానిక్స్, హోమ్ ఐప్లెన్సెస్, బిల్డింగ్ ప్లానర్స్ అసోసియేషన్స్ సోమవారం నుంచి బంద్ నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు డీటీహెచ్ సర్వీస్‌లు, రిపేరింగ్ షాపులు మూసి ఉంటాయని, ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే రూ. 5116 జరిమానాను చెల్లించాలని ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తీర్మానం చేసింది. నిత్యావసర వస్తువుల దుకాణాలకు మాత్రం సాయంత్రం 4 గంటల వరకు తెరిచిఉంటాయని పేర్కొంది. ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గమనించి సహకరించాలని వ్యాపారులు కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ బాధ్యులు గట్టు అమర్నాధ్, కందుకూరి నాగరాజు, గట్టు శ్రీను, నూకల ప్రవీణ్, విజయ్, చొక్కారపు శ్రీను, బట్టల వ్యాపారులు, బిల్డింగ్ ప్లానర్స్ తదితరులు పాల్గొన్నారు.
పలు వార్డుల్లో స్వచ్ఛందంగా బంద్
జనగామ పట్టణంలోని 13, 16, 30 వార్డుల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ధర్మకంచ కమిటీ హాలు వద్ద సమావేశమై స్వచ్ఛంద బంద్‌ను నిర్వహించారు. వార్డులోని దుకాణాలను 4 గంటల వరకే నిర్వహించేలా చూడాలని, ప్రజలు గుంపులుగా లేకుండా చూసేందుకు వార్డుకు ముగ్గురు చొప్పున కమిటీలను ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించాలని, శానిటైజర్లు లేకుండా దుకాణాలు నిర్వహిస్తే జరిమానాలు తప్పవని వ్యాపారులకు తెలిపారు. వార్డుల్లోకి వచ్చే దారులకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అవసరముంటే తప్ప బయటకు వెళ్లరాదని, బయటి వ్యక్తులను అనుమతించకూడదని సమావేశంలో నిర్ణయించారు. అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్య పరిస్థితులను అడిగితే వారికి సహకరించాలని తెలిపారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు ఉన్నట్లయితే ఆశ వర్కర్లకు తెలియజేసి హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు గాదెపాక రామచంద్రం, బొట్ల శ్రీనివాస్, మల్లిగారి చంద్రకళ, మాజీ కౌన్సిలర్ మేడ శ్రీను, వార్డు సభ్యులు గిరిమల్లె రాజు, విజయ్, ఉడ్గుల కిష్టయ్య, నీర్మాల రాములు, పానుగంటి ప్రవీణ్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లుట్లలో స్వచ్ఛందంగా బంద్..
లింగాలఘనపురం : కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో మండలంలోని నెల్లుట్లలో సోమవారం స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించారు. జనగామ పట్టణంలోని జేకేఎస్ ఫర్టిలైజర్ షాపు నుంచి కరోనా విస్తరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జేకేఎస్లో నెల్లుట్ల, లింగాలఘనపురం, సిరిపురం, నాగారం తదితర గ్రామాలకు చెందిన వ్యక్తులు దినసరి, నెలసరి వేతనాలపై పని చేస్తున్నారు. మరికొందరు విత్తన, ఎరువుల కంపెనీల ప్రతినిధులుగా, కమీషన్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీరికి తోడు పలువురు రైతులు ఇదే షాపు నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడంతో నెల్లుట్లకు చెందిన పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీనితో స్థానిక సర్పంచ్ చిట్ల స్వరూపరాణి సోమవారం పంచాయితీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, గ్రామంలో ఈ నెల 30 వరకూ లాక్డౌన్ విధిస్తున్నట్లు తీర్మానించారు. ఈ మేరకు గ్రామంలోని పలు దుకాణాలు మూతపడగా, ఆటోలు నిలిచి పోయాయి. లింగాలఘనపురంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా రాగా సర్పంచ్ విజయమనోహర్ గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు, వాటర్ప్లాంట్లు, మద్యం షాపులు తెరిచి ఉంచాలని, అంతే గాకుండా ఎట్టి పరిస్ధితుల్లోనూ బెల్టు షాపుల్లో సిట్టింగ్‌లు నిర్వహించరాదని ఆదేశించారు. అదే బాటలో బండ్లగూడెం, సిరిపురం జీపీలు అడుగులు వేస్తూ స్వచ్ఛందంగా లాక్డౌన్ ను ప్రకటిస్తున్నాయి. మరోవైపు నాయీబ్రాహ్మణ సంఘం వారు నేటి నుంచి సెలూన్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లుట్లలో 9 మందిని హోంక్వారైంటన్లో ఉంచగా, వారికి సర్పంచ్ చిట్ల స్వరూపరాణి నిత్యావసరసరకులను వారి ఇళ్లకు పంపిణీ చేస్తున్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!