శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Jun 23, 2020 , 01:06:51

లక్ష్యం.. 50 లక్షల మొక్కలు

లక్ష్యం.. 50 లక్షల మొక్కలు

జనగామ, జూన్‌ 22 : ఆరో విడత హరితహారం కార్యక్రమంలో 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధికారులు అధిగమించాలని  రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు. కరువు ప్రాంతంలో ఆటవీ సంపదను పెంచేందుకు పనిచేయాలని కోరారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ నిఖిల, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి కరోనా కట్టడి, హరితహారం, గ్రామీణ ఉపాధి హామీ, నీటిపారుదలశాఖ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జనగామ జిల్లాలో ఉద్యమ తరహాలో పెద్దఎత్తున మొ క్కలు నాటాలన్నారు. ఇప్పటికే అటవీశాఖ, గ్రామ నర్సరీల ద్వారా సుమారు 65 లక్షల మొక్కలు అందుబాటులో ఉంచామని తెలిపారు. నూతన కలెక్టరేట్‌ ఆవరణలో 13 ఎకరాల భూమిలో గ్రీనరీ పార్కు అభివృద్ధి చేయాలని అన్నారు.

ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్కో ఊరిలో ఎకరం స్థలం గుర్తించి చుట్టూ ఫెన్సింగ్‌ చేసి, ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ఇరిగేషన్‌ పనులు చేయించాలన్నారు. ఎక్కువ కాలం జీవించి ఉండే ఎత్తైన మొక్కలు నాటాలని, అవి నూరుశాతం పెరిగేలా బాధ్యత తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూ చించారు. జిల్లా కలెక్టర్‌ కే నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 34 కరోనా కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. వారిని హోంక్వారంటైన్‌లో ఉంచి మెడిసిన్‌ కిట్స్‌ అందించడంతోసహా ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికలకు 62 క్లస్టర్లకు గాను 62 స్థలాలు గుర్తించామని, దసరా నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 

కరోనా ఉధృతిని అడ్డుకోవాలి..

జనగామ జిల్లాలో కరోనా వైరస్‌ విస్తృతిని అడ్డుకోవాలని, ఆ మేరకు ప్రజలను మరింత చైతన్యం చేసి అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పాజిటివ్‌ వచ్చిన బాధితులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చా రు. అధికారులు అందించిన సమాచారం మేరకు జేకేఎస్‌ అగ్రిమాల్‌ యాజమాన్యం మా స్కులు ధరించకుండా అమ్మకాలు జరిపిన నేపథ్యంలో అందులో పనిచేసే వారికి కరోనా నిర్ధారణ అయిం దన్నారు. ప్రాథమిక లక్షణాలు ఉన్న వారిని హోంక్వారంటైన్‌లో ఉంచి వారికి వైద్య సిబ్బందితో చికిత్స నిర్వహిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఆశ వర్కర్లు బృందాల ద్వారా వారికి అవసరమైన అత్యవసర సరుకులు అందిస్తామని తెలిపారు. కరోనా బారినపడిన ప్రతి వ్యక్తి కూడా సురక్షితంగానే ఉన్నారని అన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ, క్వారంటైన్‌ను పకడ్బందీగా పాటించాలన్నారు. కరోనా విస్తృతిని బట్టి పట్టణం, గ్రామాలను జోన్లుగా విభజించి బాధితులకు చికిత్స అందించాలని, అనుమానితులను హోంక్వారంటైన్‌ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

పల్లెలు అద్దంలా ఉండాలి..

జిల్లాలోని ప్రతి పల్లె అద్దంలా ఉండాలని, రోడ్లపై వర్షం నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపాధిహామీ సిబ్బందితో పనులు చేయించాలని మంత్రి అన్నారు. గతంలో నాటిన చెట్లకు తవుటం చేయడం, రైతు కల్లాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించడం, చెరువులను గోదావరి జలాలతో నింపేందుకు కాలువల ఏర్పాటు, శాశ్వత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి డీఆర్డీవో రాంరెడ్డిని ఆదేశించారు. ఉపాధి హామీ నిధులను పక్కాగా వినియోగించుకోవాలని, కల్లాలు నిర్మించుకునేలా రైతులను చైతన్యం చేయాలని సూచించారు. సాగునీటిశాఖకు ఉపాధి హామీని అనుసంధానించిన దృష్ట్యా రైతులకు మరింతగా మేలు జరుగుతుందన్నారు. 

డీపీవోపై మంత్రి ఆగ్రహం..

పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నావంటూ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్రామాల్లో పారిశుధ్య పనులను సరిగా పర్యవేక్షించడం లేదు.. ఇప్పటికీ అనేకసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోవడంలేదు.. ఇలాగైతే ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తా.. అవసరమైతే డిస్మిస్‌ చేస్తా’ అంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు డీపీవోను హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని, వారి విధులు విస్మర్తిస్తే ఊరుకోమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌యాదవ్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

VIDEOS

logo