గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Jun 22, 2020 , 01:53:55

కష్టాల కడలిలో మార్వాడీ కుటుంబం

కష్టాల కడలిలో మార్వాడీ కుటుంబం

  • అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో సతమతం
  • బ్రెయిన్‌ క్యాన్సర్‌తో భార్య మృతి.. 
  • వెన్నుపూస నొప్పితో భర్త ఇబ్బందులు
  • దాతల సహకారంతో బతుకీడుస్తున్న వైనం
  • భారంగా మారిన పిల్లల చదువులు
  • ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల వేడుకోలు

పోచమ్మమైదాన్‌, జూన్‌ 21 : రాజస్థాన్‌ నుంచి వరంగల్‌ నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. మిఠాయి దుకాణాన్ని నడుపుకుంటూ ఆనందంగా జీవిస్తుండ గా అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి. ఆరు సంవత్సరాల నుంచి భర్త వెన్నుపూస నొప్పితో బాధపడుతుండగా.. భార్య బ్రెయిన్‌ క్యాన్సర్‌తో 9 నెలల క్రితం కన్నుమూసింది. దీంతో  ఆర్థికంగా చితికిపోయి అష్టకష్టాలు పడుతున్న ఆ కుటుంబం దాతల సాయంతో బతుకుబండిని నెట్టుకొస్తోంది. 

ఓం ప్రకాశ్‌ కుటుంబం (మార్వాడీ బ్రాహ్మణ) రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి 30 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం వరంగల్‌ నగరానికి వచ్చింది. గిర్మాజీపేట ప్రాంతంలో ఓ మిఠాయి దుకాణం పెట్టుకుని ఓంప్రకాశ్‌ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబం సంతోషంగా సాగుతున్న సమయం లో దంపతులు అనారోగ్యానికి గురయ్యారు. ఆరు సంవత్సరాల నుంచి ఓం ప్రకాశ్‌ వెన్నుపూస నొప్పితో సరిగా నడవలేక, కూర్చోలేక ఇబ్బందులు పడుతున్నాడు. అలాగే, నాలుగు సంవత్సరాల క్రితం భార్య సావిత్రికొలారియా బ్రెయిన్‌ క్యాన్సర్‌కు గురై ఇంటికే పరిమితమైంది. దీంతో ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో మిఠాయి దుకాణాన్ని బంద్‌ చేశారు. భార్యను బతికించుకోవడానికి దాదాపు రూ.10 లక్షలకు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. ఇదే సమయంలో పెద్ద కూతురికి రెండేళ్ల క్రితం దాతల సాయంలో పెళ్లి చేశారు. అలాగే, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య 9 నెలల క్రితం కన్ను మూసింది. దీంతో ఓంప్రకాశ్‌ చిన్న కూతురు, కుమారుడు కుటుంబానికి అండగా ఉంటూ చదువుకుంటున్నారు. ఇదే క్రమంలో వృద్ధురాలైన తల్లి శాంతాబాయి సైతం పక్షవాతానికి గురై మృతిచెందడంతో విషాదం అలుముకుంది. ఓం ప్రకాశ్‌ పనిచేయలేక ఇంటికి పరిమితం కావడం, ఇద్దరు పిల్లలను చదివించుకోవడం భారంగా మారింది. 

దాతల చేయూత..

వీరి కుటుంబ పరిస్థితులను చూసిన దాతలు తోచిన సాయం అందిస్తూ ఆదుకుంటున్నారు.  బొల్లికుంటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కే ప్రవీణ్‌రెడ్డి ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. వీరి కుటుంబ దుస్థితిని తెలుసుకుని సాయం చేయడానికి ముందుకు వచ్చారు. పెద్ద కూతురు వివాహానికి రూ.3లక్షల పైగా సాయం అందించడంతోపాటు కుటుంబానికి కూడా చేయూతనిస్తున్నారు. అలాగే, కాకతీయ వైద్య కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ తుమ్మ ప్రభాకర్‌రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నారు. కృష్ణాకాలనీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న కుమార్తె వైష్ణవి చదువు ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. కుమారుడు ఆనంద్‌ పోచమ్మమైదాన్‌లోని భారతి డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండియర్‌ చదువుతున్నాడు. దాతలు సహకరించి ఆదుకోవాలని మార్వాడీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

మా కుటుంబాన్ని ఆదుకోవాలి..

ఒకప్పడు సుఖసంతోషాలతో బతికిన మా కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతోంది. అనారోగ్యంతో భార్య, తల్లి చనిపోయారు. వెన్నుపూస నొప్పితో సరిగా నడవలేక, కూర్చోలేక సతమతమవుతున్నా. వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. చేతిలో పనిలేదు, చేయడానికి శక్తి లేదు. ఇప్పటికే కొంతమంది దాతలు ముందుకు వచ్చి  సాయం అందించారు. వారి మేలు మరువలేను. కుటుంబం గట్టెక్కడానికి, పిల్లల పెద్ద చదువులకు ఆర్థిక పరిస్థితులు అడ్డు వస్తున్నాయి. దాతలు కనికరిస్తే మాకు మంచి రోజులు వస్తాయనే ధీమాతో ఉన్నాం. దాతలు 9849374172 నంబర్‌లో సంప్రదించాలి.

- ఓంప్రకాశ్‌ 

VIDEOS

logo