ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jun 21, 2020 , 02:58:09

నిబంధనలు పాటించకుంటే చర్యలు

నిబంధనలు పాటించకుంటే చర్యలు

  • జిల్లాలో 17 మందికి కరోనా పాజిటివ్‌
  • మాస్కులు ధరించకుంటే జరిమానా
  • వైరస్‌కు కారణమైన జేకేఎస్‌ ఫర్టిలైజర్‌పై కేసు నమోదుకు ఆదేశం
  • ప్రెస్‌మీట్‌లో కలెక్టర్‌ నిఖిల వెల్లడి

కలెక్టరేట్‌, జూన్‌ 20 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ వైద్యుల సూచనలు పాటించాలని కలెక్టర్‌ నిఖిల ప్రజలను కోరారు. ఇప్పటికే జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లుట్ల, శామీర్‌పేట, పట్టణంలోని బాలాజీనగర్‌, పోస్టాఫీస్‌, గుండ్లగడ్డ ప్రాంతాల్లో ఆరు కుటుంబాలకు చెందిన 17 మందికి పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ తెలిపారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటించకుంటే రూ. 5000, మాస్కు ధరించకుంటే రూ.500 జరిమానా విధించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేకేఎస్‌ ఫర్టిలైజర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డీసీపీని ఆమె ఆదేశించారు. ఫర్టిలైజర్‌ దుకాణంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబీకులకు, రైతులకు ర్యాండమ్‌ టెస్టులు చేశామని, మిగిలిన వాటికి సంబంధించి రిపోర్టు రావాల్సి ఉందన్నారు. కరోనా నివారణకు జిల్లాలో పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌శాఖల సమన్వయంతో మూడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు నిఖిల వివరించారు. ఈ బృందాలు పట్టణంలో తనిఖీలు చేస్తాయని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దుకాణాల ముందు గుంపులుగా ఉండొద్దని ఆమె సూచించారు. భౌతికదూరం పాటిస్తూ, శానిటైజర్‌ను వినియోగించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా వాసులంతా జాగ్రత్తలు తీసుకోవాలని నిఖిల కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, స్వీయ నియంత్రణతో కరోనాను కట్టడి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

VIDEOS

logo