ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jun 12, 2020 , 09:27:47

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాడి రైతులకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాడి రైతులకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు

  • రైతులకు రూ.1.60 లక్షల నుంచి  రూ.3లక్షల వరకు రుణం
  • కిసాన్‌ క్రెడిట్‌కార్డులు కలిగి ఉన్న వారంతా అర్హులే
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 30,544 మందికి అవకాశం
  • రోజువారీ 30వేల లీటర్ల పాల సేకరణకు విజయ డెయిరీ ప్రణాళిక

పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. వ్యవసాయంతో సమాంతరంగా పాడి పరిశ్రమను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తున్నది. షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రూ.1.60లక్షల రుణం ఇచ్చేందుకు ఈ నెలాఖరు వరకు దరఖాస్తుకు గడువు విధించింది. విజయ డెయిరీ,  ఇతర సంఘాల డెయిరీల్లో సభ్యత్వం ఉన్న రైతులందరినీ అర్హులుగా పేర్కొంది. 

తొర్రూరు : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాడి రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించనుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీ పరిధిలో  వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలు ఉండగా వరంగల్‌ ప్రధాన డెయిరీతో పాటు ఏడు చిన్న తరహా పాల శీతలీకరణ కేంద్రాలు పని చేస్తున్నాయి. జనగామ జిల్లాకు ప్రత్యేక మిల్క్‌షెడ్‌ ఉండగా దీని కింద కూడా ఏడు మినీ పాల శీతలీకరణ కేంద్రాలు పాల సేకరణలో ఉన్నాయి. ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు కాగా పాడి రైతుల సొసైటీలతో ఏర్పాటైన ముల్కనూర్‌ పాల సేకరణ సొసైటీ పరిధిలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన రైతులు ఉన్నారు. ఈ మూడు కేంద్రాలకు రోజూ పాలు పోస్తున్న రైతులంతా ప్రభుత్వం బ్యాంక్‌ల ద్వారా ఇప్పించే రుణాలకు అర్హత కలిగి ఉండనున్నారు. 

30,544 మంది రైతులకు అవకాశం

వరంగల్‌ విజయ డెయిరీ మిల్క్‌షెడ్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో వరంగల్‌ ప్రధాన డెయిరీతో పాటు ధర్మసాగర్‌, నర్సంపేట, సంగెం, మహబూబాబాద్‌, తొర్రూరు, ఏటూరునాగారం, ములుగు మినీ పాల శీతలీకరణ కేంద్రాలు 314 గ్రామ పాల సేకరణ కేంద్రాల నుంచి రోజుకు 20వేల లీటర్ల మేర పాలను సేకరిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో రెండు నెలలుగా 9వేల లీటర్ల పాలను మాత్రమే సేకరిస్తున్నారు. ఈ ఎనిమిది సేకరణ కేంద్రాల్లో కలిపి 8,444 మంది పాడి రైతులు సభ్యత్వాలు కలిగి ఉన్నారు. జనగామ మిల్క్‌షెడ్‌తో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌, లింగాలఘన్‌పూర్‌, నర్మెట, బచ్చన్నపేట, కామారెడ్డిగూడెం, కృష్ణాజిగూడెంలో 7 చిన్న తరహా పాల శీతలీకరణ కేంద్రాలు రోజు వారి 229 గ్రామ కేంద్రాల ద్వారా 20వేల లీటర్ల పాలను సేకరిస్తుండగా 10, 600 మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు. ముల్కనూర్‌ డెయిరీ పరిధిలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన 82 పాల సేకరణ కేంద్రాల్లో 11,500 మందికి సభ్యత్వాలు ఉన్నాయి. వీరందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలకు లోబడి రూ.1.60 లక్షల నుంచి రూ.3లక్షల వరకు తక్కువ వడ్డీతో బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందే అర్హతను కలిగి ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి కిసాన్‌ క్రెడిట్‌కార్డులను జారీ చేసేలా డెయిరీ అధికారులు కార్యాచరణను రూపొందించి కసరత్తు చేస్తున్నారు. 

రుణం పొందేందుకు అర్హతలు ఇవే....

విజయ డెయిరీ, ముల్కనూర్‌ పాల సొసైటీ పరిధిలోని పాల సేకరణ కేంద్రాల్లో ఏడాది కాలంగా పాలు పోస్తూ బిల్లులు తీసుకున్న పాడి రైతుల వివరాలను సంబంధిత కేంద్రాల అధ్యక్షులు ధ్రువీకరించనున్నారు. రుణం తీసుకునేందుకు అర్హత ఉన్న వారు విధిగా సభ్యత్వాన్ని కలిగి ఉండి రెండు పాస్‌  ఫొటోలు, ఆధార్‌కార్డు, భూమి పట్టా పాస్‌ పుస్తకం, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌లు, పాడి రైతుగా ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని సూపర్‌వైజర్లకు అందజేస్తారు. వీటిని బ్యాంకులకు ఇచ్చి రూ.1.60 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాన్ని పొందవచ్చు. ఆపైబడి రూ.3లక్షల వరకు రుణాన్ని పొందేందుకు బ్యాంక్‌ షూరిటీని ఇవ్వాల్సి ఉంటుంది.  

30వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా..

వరంగల్‌ విజయ డెయిరీ ఆధ్వర్యంలో నవంబర్‌ చివరి నాటికి రోజు వారి 30వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యాన్ని విధించుకున్నా రు. ప్రైవేట్‌ డెయిరీలతో సమానంగా 6శాతం వెన్న కలిగి ఉన్న గెదే పాలకు ప్రభుత్వం రూ.36 ధర ఇస్తూనే అదనంగా లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకాన్ని ఇస్తున్నది. వరంగల్‌ యూనిట్‌ ద్వారా ప్రతి రోజూ ప్రస్తుతం 3వేల లీటర్ల పాలు, పాల పదార్థాలను విక్రయిస్తుండగా మరో ఐదు నెలల్లో ఈ సామర్థ్యాన్ని పదివేల లీటర్లకు పెంచాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ఉన్న నాలుగు పాల ఉత్పత్తి వస్తువుల విక్రయ కేంద్రాలను 50కి పెంచి ప్రధాన మండల, మున్సిపల్‌, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో ఉన్న 314 పాల సేకరణ కేంద్రాలను 500లకు పెంచేందుకు ప్రణాళిక చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నాగారంలో రూర్బన్‌ పథకంలో నూతన పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు, మహబూబాబాద్‌, ములుగు, ఏటూరునాగారం కేంద్రాల్లో పాల సేకరణ పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

పాల ప్యాకెట్ల తయారీని పెంచుతాం - డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌

వరంగల్‌ మిల్క్‌షెడ్‌ ద్వారా ప్రతి రోజూ 3వేల లీటర్ల విజయ పాల ప్యాకెట్లను విక్రయిస్తున్నాం. మరో ఐదు నెలల్లో పదివేల లీటర్ల ప్యాకెట్లను విక్రయించేలా ఐదు జిల్లాల పరిధిలో కేంద్రాలను పెంచుతాం. వరంగల్‌లో ఉన్న విజయ డెయిరీ పాల కేంద్రంలో దీనికి తగిన అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం పాడి రైతులకు అందజేసే రుణాలతో పాల సేకరణ పెరుగుతుందని ఆశిస్తున్నాం. 


VIDEOS

logo