గురువారం 26 నవంబర్ 2020
Jangaon - Jun 10, 2020 , 03:03:25

శాయంపేట స్పెషల్‌బ్రాండ్‌ చేనేత షర్టింగ్స్‌

శాయంపేట స్పెషల్‌బ్రాండ్‌ చేనేత షర్టింగ్స్‌

  • ఉమ్మడి జిల్లాలో తొలిసారి కాటన్‌ షర్టింగ్‌ ఉత్పత్తి
  • ఆర్డర్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్న టెస్కో
  • కార్మికులకు రెట్టింపు ఆదాయం

శాయంపేట చేనేత స్పెషల్‌ బ్రాండ్‌ నమోదు చేసుకుంది. డిమాండ్‌ ఉన్న కాటన్‌ షర్టింగ్‌ను ఉత్పత్తి చేస్తు న్నది.  గతంలో చద్దర్లు, టవల్స్‌, పాలిస్టర్‌, తుండ్లు  వంటి ఉత్పత్తులనే నేసేవారు. సంవత్సరం నుంచి వీటితో పాటు గిరాకీ ఉన్న వస్ర్తాలను ఉత్పత్తి చేస్తూ అదాయాన్ని పెంచుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర సహ కార సంస్థ (టెస్కో) శాయంపేట చేనేత సొసైటీకి షర్టింగ్‌ క్లాత్‌ ఆర్డర్లు ఇస్తున్నది. ఈ క్రమంలో కార్మికులకు మరింత ఉపాధితో పాటు రెట్టింపు ఆదాయం వస్తున్నది.

- శాయంపేట విలేకరి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎక్కడా లేని విధంగా శాయంపేట చేనేత సొసైటీ తొలిసారి కాటన్‌ షర్టింగ్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడ సుమారు వందకుపైగా కార్మికులు పనిచేస్తూ ఉపాధి పొందుతు న్నారు. అనుబంధ రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. చద్దర్లు, టవల్స్‌, పాలిస్టర్‌, తుండ్లు  వంటి వాటితో పాటు గిరాకీ ఉన్న వస్ర్తాలనూ ఉత్పత్తి చేస్తూ అదాయాన్ని పెంచుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ‘టెస్కో’ ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుం డడంతో ప్రస్తుతం షర్టింగ్‌ బ్రాండ్‌గా నిలిచింది. అయితే షర్టింగ్‌లో పలు రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. 2/60, 2/80, 2/100, 2/120 రకాలను ఉత్పత్తి చేస్తున్నది. యారన్‌(నూలు) రకాన్ని బట్టి షర్టింగ్‌ ఉత్పత్తి జరుగుతున్నది. సంఘంలో 12 నుంచి 15 మగ్గాలపై షర్టింగ్‌ క్లాత్‌ ప్రొడక్షన్‌ చేపట్టారు. సుమారు 15 మంది కార్మికులు దీనిని ఉత్పత్తిని చేస్తున్నారు. నెలకు సుమారు 2500 మీటర్ల వస్ర్తాన్ని నేస్తున్నారు. షర్టింగ్‌ ఉత్పత్తి కష్టమైనా సంపాదన ఎక్కువగా ఉండడంతో ఆసక్తి చూపుతున్నారు. యారన్‌ను హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌డీసీ నుంచి సంఘం పాలకవర్గం కొనుగోలు చేసి తీసుకొస్తున్నది. ఆ తర్వాత తయారైన షర్టింగ్‌ను ‘టెస్కో’కు విక్రయిస్తున్నది. షర్టింగ్‌ క్లాత్‌ మీటరుకు రూ. 50 నుంచి రూ.88 వరకు చెల్లి స్తున్నది.

వేర్వేరు రకాల వస్ర్తానికి వేర్వేరుగా ధర ఇస్తున్నది. ఈ క్రమంలో కార్మి కులు ఒక్కొక్కరు  నాలుగు నుంచి ఆరు మీటర్ల వరకు షర్టింగ్‌ను తయారు చేస్తున్నారు. ఇలా సుమారుగా ఒక్కో కార్మికుడు రూ.300 నుంచి రూ.400 వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తున్నది. షర్టింగ్‌ తయారు చేస్తున్న కార్మికులు ఒక్కొక్కరు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు ఆదాయాన్ని పొందు తున్నారు. గతంలో టవల్స్‌ తయారు చేసేవారు రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు సంపాదించే వారు. కానీ షర్టింగ్‌ పని చేస్తే ఆదాయం రెట్టింపు అయినట్లు కార్మికులు చెబుతున్నారు. ఒక్కో షర్టింగ్‌ క్లాత్‌ వెరైటీని బట్టి మీటరుకు రూ.150 నుంచి రూ.200 చెల్లిస్తున్నట్లు చెప్పారు. నెలనెలా టెస్కో 2 నుంచి 3 వేల మీటర్ల ఆర్డర్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. డిమాండ్‌ ఉండడంతో ఉత్పత్తి వేగంగా జరుగు తోంది. సంస్థ నుంచి ప్రతి నెలా డబ్బులు అందుతున్నాయి. గతంలో రూ. 2 వేలు సంపాదిస్తున్న వారు షర్టింగ్‌ క్లాత్‌తో రూ.4వేల నుంచి రూ. 6వేలు, రూ.10వేల వరకు సంపాదిస్తుండడం విశేషం.

ఆదాయం పెరిగింది!

ఇరవై ఏండ్లుగా మగ్గం నేస్తున్న. ఏడాది నుంచి షర్టింగ్‌ క్లాత్‌ తయారు చేస్తున్న. గతంలో వచ్చే ఆదాయం కంటే ప్రస్తుతం రెట్టింపు ఆదాయం వస్తున్నది. రోజుకు నాలుగు, ఐదు మీటర్లు నేస్తున్న. మీటరుకు మూడు నాడెలు పెట్టి నేస్తే రూ.54, ఒక నాడె పెట్టి నేస్తే రూ.50 ఇస్తున్నరు. ఈ లెక్కన రోజుకు రూ.200కు తక్కువ కాకుండా పనైతది. అంతకు ముందు లుంగీలు నేసిన. ఒక లుంగీ నేస్తే రూ.50 ఇచ్చేవారు. రోజుకు నాలుగు వచ్చేవి. టవల్స్‌ నేస్తే  రెండు, మూడు తీర్లున్నాయి. పెద్ద తువ్వాలలు నేస్తే ఒకదానికి రూ. 35 ఇస్తారు. రోజుకు ఏడు, ఎనిమిది నేస్తా. షర్టింగ్‌ వల్ల కొంత ఆదాయం పెరిగింది. అంతకుముందు నెలకు రూ.3వేల వరకు వచ్చేవి.  

  • - కార్మికుడు సామల చంద్రమౌళి