మంగళవారం 26 మే 2020
Jangaon - May 20, 2020 , 01:13:26

తునికాకే ఆధారం

తునికాకే ఆధారం

  • ఆకు సేకరణలో గొత్తికోయలు, ఆదివాసీలు
  • కట్టకు రూ.1.80 పైసలు చెల్లింపు
  • 56,300 స్టాండర్డ్‌ బ్యాగుల లక్ష్యం 
  • ములుగు జిల్లాలో నాలుగు డివిజన్ల ద్వారా 16900
  • భూపాలపల్లిలో రెండు డివిజన్ల నుంచి 39,400 

ములుగు, నమస్తేతెలంగాణ : ఆకే జీవనాధారమైంది..లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన మారుమూల అటవీ ప్రాంత ప్రజలకు తునికాకు సేకరణ వరంగా మారింది. కొద్దిరోజుల క్రితం వర్షం కురవడంతో ఈ సీజన్‌లో తునికాకు కోతకు సిద్ధమైంది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండ తీవ్రంగా ఉండటంతో  కుటుంబ సభ్యులంతా కలిసి ఉదయమే అడవికి వెళ్లి తునికాకు సేకరిస్తున్నారు. మధ్యాహ్నం వరకు తిరిగి వచ్చి ఆకులను లెక్కించి కట్టలు కట్టి, సమీపంలోని కల్లాలకు తరలిస్తున్నారు. 60 ఆకుల కట్టకు రూ.1. 80 పైసల చొప్పున అటవీశాఖ చెల్లించేందుకు నిర్ణయించింది. ములుగు జిల్లాలో 4 డివిజన్ల పరిధిలో 31యూనిట్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2 డివిజన్ల పరిధిలోని 46 యూనిట్లలో 231 కల్లాల ద్వారా తునికాకు సేకరిస్తున్నారు. ఈ సీజన్‌లో ములుగు జిల్లాలో 16,900, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 39,400 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ లక్ష్యంగా అధికారులు నిర్దేశించారు. 

56,300 స్టాండర్డ్‌ బ్యాగుల సేకరణ లక్ష్యం

ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మొత్తంలో  తనికాకు సేకరణే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ములుగు జిల్లాలోని ములుగు, తాడ్వాయి, వెంకటాపురం, ఏటూరునాగారం డివిజన్‌ కేంద్రాలుగా 31 తునికాకు సేకరణ యూనిట్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, మహదేవపూర్‌ డివిజన్‌ ద్వారా 46 యూనిట్లలో 231 తునికాకు సేకరణ కల్లాలను ఏర్పాటు చేశారు. 2019లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 12,170 స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యం కాగా, 11,700 స్టాండర్డ్‌ బ్యాగులను సేకరించారు. తునికాకు సేకరణ సజావుగా నిర్వహించేందుకు ఆయా డివిజన్లలో ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ఇన్‌చార్జిగా నియమించారు.  

డివిజన్ల వారీగా లక్ష్యం..

ములుగు జిల్లా : 

ములుగు డివిజన్‌ పరిధిలో 1700 బ్యాగులు

తాడ్వాయిలో 5900

వెంకటాపురంలో 2800

ఏటూరునాగారంలో 6500 స్టాండర్డ్‌ బ్యాగులు 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా :

భూపాలపల్లి డివిజన్‌లోని 24 యూనిట్ల ద్వారా 19,800,

మహదేవపూర్‌ డివిజన్‌ పరిధిలోని 22 యూనిట్ల ద్వారా 19,600 స్టాండర్డ్‌ బ్యాగులు 


logo