శనివారం 30 మే 2020
Jangaon - May 20, 2020 , 01:13:47

జల శ్యామలం

జల శ్యామలం

  • కేసీఆర్‌ విజన్‌
  • సీఎం కృషితో పచ్చని పైర్లు, నిండు కాల్వలతో కళకళలాడుతున్న ఓరుగల్లు 
  •  కాల్వ నిర్మాణానికి ఎమ్మెల్యే ధర్మారెడ్డి 
  • రూ.40 లక్షలు ఖర్చు చేయడం అభినందనీయం
  •  దేవాదుల డీ8 కాల్వ నీటిని విడుదల చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  •  బొల్లికుంట నుంచి గవిచర్ల వరకు ఎంపీ, ఎమ్మెల్యేలతో  కలిసి కాల్వ  పరిశీలన
  •  సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

‘దశాబ్దాల కల నెరవేరింది..గోదావరి జలాల పరుగులు చూస్తుంటే ప్రజల కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతున్నది.  సీఎం కేసీఆర్‌ కృషి వల్లే తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నది’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం బొల్లికుంట నుంచి వర్ధన్నపేట మండలం చెన్నారం వరకు ఉన్న డీ-8 కాల్వలోకి గోదావరి జలాలు రావడంతో మంత్రి ఎర్రబెల్లి.. ఎంపీ పసునూరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరితో కలిసి పూజలు చేశారు. అనంతరం ఉపకాల్వల ద్వారా చెరువుల్లోకి నీటిని విడుదల చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు.    

 వర్ధన్నపేట/ సంగెం/ మామునూరు : రైతుల దశాబ్దాల స్వప్నాన్ని సీఎం కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని, గోదావరి జలాలతో చెరువులను నింపి  బీడు భూముల్లో బంగారు పంటలు పండేలా కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని బొల్లికుంట నుంచి వర్ధన్నపేట మండలం చెన్నారం వరకు కాల్వలో గోదావరి జలాలు రావడంతో మంత్రి దయాకర్‌రావు ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డితో కలిసి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి బొల్లికుంట నుంచి గవిచర్ల వరకు పర్యటించారు. నీటిని పరిశీలిస్తూ 14కిలోమీటర్లు కాల్వ వెంబడి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మండలంలోని 13 గ్రామాలకు నీరు విడుదల చేస్తున్న సందర్భంగా మహిళలు పసుపు, కుంకుమ, పూలతో స్వాగతం పలికారు. ప్రతి కాల్వకు నీరు అందించే సమయంలో పూలను నీళ్లల్లో వేసి, కొబ్బరికాయలు కొట్టి మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పసుపు కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రికి నీరాజనాలు పలికారు. మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

సీఎం కేసీఆర్‌ విజన్‌..

  చెన్నారం గ్రామ చెరువుకు నీరు వెళ్లే కాల్వ గేటు  ఎత్తిన అనంతరం  మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌ విజన్‌ నేడు తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్నదన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అపర భగీరథుడిలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.  దీనిమూలంగా ఎస్సారెస్పీ, దేవాదుల కాలువల ద్వారా వరంగల్‌ ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దేవాదుల సౌత్‌ కెనాల్‌కు నీటి విడుదల జరిగిందన్నారు. సౌత్‌ కెనాల్‌ ద్వారా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పరిధిలోని సుమారు 18,246 ఎకరాలకు సాగునీరు అందనున్నదని చెప్పారు. సంగెం మండల రైతుల దశాబ్దాల కల నెరవేరిందని వారి కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతున్నదన్నారు.  కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రూ.600 కోట్లు ఖర్చుచేసి 60 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ చేయించారని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సొంతంగా రూ. 40లక్షలు పెట్టి కాల్వ పునరుద్ధరణకు పూనుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ దేవాదుల కాల్వకు నీళ్లు వదిలారని, ప్రతి చెరువు నింపాలని ఆదేశించారని తెలిపారు. ఎకరానికి నీరందించడానికి నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతున్నదని, రైతులు చుక్క నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనసున్న సీఎం మనకుండటం మన అదృష్టమన్నారు. రైతులకు, రైతు కూలీల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం చెప్పిందే రైతులు చేయాలని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. గాడిపల్లి, వెంకటాపురం 

గ్రామాలకు కాల్వ పనులను పది రోజుల్లో ప్రారంభిస్తామన్నారు.  ప్రజల కోసం పని చేసిన నాయకుడిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి  చిత్రపటానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి క్షీరాభిషేకం చేశారు.

 ప్రతి ఎకరాకూ నీరు : ఎమ్మెల్యే అరూరి  

దేవాదుల, ఎస్సారెస్పీల ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తెలిపారు. మండలంలోని చెన్నారం గ్రామ చెరువుకు నీరు వెళ్లే కాల్వలోకి నీటిని విడుదల చేయడంతో చెన్నారం ప్రజాప్రతినిధులు, రైతులు ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ.. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఉన్న ప్రతి గ్రామానికి నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సౌత్‌ కెనాల్‌ ద్వారా చెన్నారం, ఉప్పరపల్లి గ్రామాల పరిధిలోని సుమారు 495 ఎకరాలకు సాగునీరు అందనున్నదని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ భిక్షపతి, చెన్నారం, ఉప్పరపల్లి గ్రామాల స ర్పంచ్‌లు పునుగోటి భాస్కర్‌రావు, ఆరెల్లి స్రవంతి, గుజ్జ గోపాల్‌రావు, సింధం లక్ష్మీనారాయణ, బర్ల జీవన్‌బాబు పాల్గొన్నారు.

అపర భగీరథుడు కేసీఆర్‌ : ఎమ్మెల్యే చల్లా

తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి అపరభగీరథుడని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దేవాదుల సౌత్‌ కెనాల్‌ ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలో 91,700 ఎకరాలకు సాగు నీరు అందనున్నదని తెలిపారు. వర్ధన్నపేట, సంగెం మండలాల్లో సుమారు 18వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రైతు పంటలు వేసే పద్ధతి గురించి అవగాహన లేని సన్నాసులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈజీఎస్‌లో కాల్వ పనులు చేయించాలన్నారు. 

రంజాన్‌ను ఆనందంగా జరుపుకోవాలి

రాయపర్తి/ పర్వతగిరి : ప్రపంచ మానవాళిని ప్రాణభయంతో పరుగులు పెట్టిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తిని అల్లా దయతోనే తప్పించగలుగుతున్నామని  మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌, మంత్రి విజ్ఞప్తి మేరకు కావేరి సీడ్స్‌ అధినేత భాస్కర్‌రావు నేతృత్వంలో మంగళవారం మండలంలోని ముస్లిం కుటుంబాలకు రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని 39 గ్రామాల పరిధిలో ఉన్న 660 ముస్లిం కుటుంబాలకు  సరుకులు అందజేశారు.  ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి  మంత్రి హాజరై మాట్లాడారు. దానధర్మాలు చేయడంలో కావేరి సీడ్స్‌ అధినేత భాస్కర్‌రావు రారాజు అని, భాస్కర్‌రావులో ఉన్న సమాజ హిత పరోపకార లక్షణాలే ఆయనను జీవితంలో ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాయన్నారు. అలాగే  పర్వతగిరి మండల కేంద్రంలో ముస్లిం కుటుంబాలకు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు  చింతపట్ల సోమేశ్వర్‌రావు,ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌, సర్పంచ్‌ గారె నర్సయ్య, కావేరీ సీడ్స్‌ ప్రతినిధి చందు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, జిల్లా నాయకులు బిల్ల సుధీర్‌రెడ్డి, అయిత రాంచందర్‌, ముస్లిం మతపెద్దలు  పాల్గొన్నారు.


logo