శనివారం 06 జూన్ 2020
Jangaon - May 17, 2020 , 02:28:57

దేవాదుల పరవళ్లు

దేవాదుల పరవళ్లు

జలయుగం.. తెలంగాణ అంతటా జలసోయగం.. ప్రతి పల్లె జల సంబురంలో తేలియాడుతున్నది. బీడు  గోదారమ్మ ముద్దాడుతున్నది. దమ్మిడికి పని చేయదనుకున్న నేల నేడు సిరుల పంటతో రైతన్నకు అభిషేకం చేస్తున్నది. సీఎం కేసీఆర్‌ జల తపస్సు తెలంగాణ రైతన్నల కన్నీటిని తుడిచి వేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రోత్సాహం.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవతో పద్నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మనసుల్లో గోదావరి జలాల పాల నురగల పరుగులు ఆనందాన్ని నింపాయి. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని సౌత్‌ కెనాల్‌లో బొల్లికుంట వద్ద తలెత్తిన భూసేకరణ సమస్యతో నలభై వేల ఎకరాలకు  నీరందని పరిస్థితి ఉత్పన్నమైంది. సమస్య పరిష్కారంతో 12 గ్రామాల్లోని 18,246 ఎకరాలకు సాగు నీరందనుంది. ఇక్కడ 32 చెరువుల్లో 400 ఎంసీఎఫ్‌టీల నీరు నింపేందుకు దేవాదుల అధికారులు నిర్ణయించారు. దీంతో భూగర్భ జలమట్టం పెరుగనుంది. డీ-8 కెనాల్‌ ద్వారా ప్రతిరోజూ 15 ఎంసీఎఫ్‌టీల నీటి సరఫరా జరుగుతున్నది. ఈ కెనాల్‌ పరిధిలోని 13 ఎల్‌ మైనర్‌ కాల్వ నిర్మాణం పూర్తయితే మరో 13,298 ఎకరాలకు దేవాదుల నీరు అందనున్నది.ఈ మైనర్‌ కాల్వ పొడవు 8 కి.మీ. ఇందులో మొదట భూసేకరణ జరుగకపోవడం వల్ల 2.50 కి.మీ. కెనాల్‌ నిర్మాణం నిలిచిపోయింది. మిగతా 5.50 కి.మీ. నిర్మాణం పూర్తయింది. ఈ నేపథ్యంలో 2.50 కి.మీ. కెనాల్‌ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూసేకరణపై ఎమ్మెల్యే చల్లా దృష్టి పెట్టారు. 

చేతికి అందే దూరంలో దేవాదుల నీళ్లు.. అందుకోవడానికి అడ్డుగా కేంద్ర సర్కారు నిబంధనలు.. రైతుల గోడు పట్టని గత ప్రభుత్వాలు ఈ సమస్యను ఎన్నికల హామీగానే చూశాయి.  తెలంగాణ సర్కారు, ఎమ్మెల్యే చల్లా చొరవతో అధికారులు చురుకుగా కదిలారు. 2007 నుంచి నానుతున్న సమస్యకు కారణం వెతికారు. ఒక్క బ్రిడ్జి నిర్మాణం, కొంత భూ సేకరణతో సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అంతే.. పద్నాలుగేళ్ల వనవాసం వీడి దేవాదుల జలాలు 40వేల ఎకరాలను ముద్దాడాయి.


logo