శనివారం 30 మే 2020
Jangaon - May 17, 2020 , 02:28:59

కౌజు కనకవర్షం

కౌజు కనకవర్షం

మరిపెడ, మే 16: బొత్తల తండాకు చెందిన సంగీత ఎం ఫార్మసీ చదివింది. జయేందర్‌ డిగ్రీ పూర్తి చేశారు. వీరిది నిరుపేద రైతు కుటుంబం. వీరి పెళ్లయ్యాక ఉద్యోగ అన్వేషణలో పడ్డారు. ఎన్నో ప్రైవేట్‌ కంపెనీల మెట్లెక్కారు. చిన్న ఉద్యోగం దొరికినా చాలు కష్టపడి పని చేసి బతుకుదామని భావించారు. స్మార్ట్‌ ఫోన్‌లో, యూ ట్యూబ్‌ చానల్‌లో ఉపాధి అవకాశాల కో సం సెర్చ్‌ చేస్తుండగా నాటు కోళ్లు, కౌజు పిట్టలు, కుందేళ్ల పెం పకం గురించి తెలుసుకున్నారు. తామూ ఆ మార్గాన్ని ఎంచుకుందామని పెద్దల ఆలోచన తెలుసుకున్నారు. మొదట్లో వారు వ్యతిరేకించి నా పిల్లలు తమ కళ్ల ముందే ఉంటారని గుర్తించి వారి తల్లిదండ్రులు, అత్తామామలు వీరి ఆలోచనకు ఓకే చెప్పారు. కుటుంబ పెద్దల సహకారంతో పౌల్ట్రీఫాం ఏర్పాటుకు రెడీ అయ్యారు. వారి వ్యవసాయ భూమి వద్ద ఫాం ఏర్పాటు చేశారు. ‘గా పిట్టలేం పొట్ట నింపుతాయిర..’ అంటూ వీరి ఆలోచనను స్థానికులు కొందరు ఎగతాళి చేశారు. కానీ, వారి మాటలను పట్టించుకోకుండా మొదట నాటు కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఆ రంగం వీరికి అనుభవం నేర్పింది. ఆదాయాన్నీ మిగిల్చింది. వాటితో పాటు కౌజు పిట్టల పెంపకంపై దృష్టి పెట్టారు. నాలుగు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వచ్చింది.  

కౌజు పిట్టల పెంపకం ఇలా..

హైదరాబాద్‌లోని పేరొందిన ఓ పౌల్ట్రీఫాంలో కౌజు పిల్లలను తెస్తున్నారు. ఒక్కో కౌజు పిట్టను ఫాంకు తీసుకొచ్చేసరికి అన్ని ఖర్చులూ కలిపి రూ.12 పడుతోంది. అవి 4 వారాలకు మాంసానికి సిద్ధమవుతున్నాయి. 6 వారాలకు గుడ్డుకు వస్తున్నాయి. వాటికి మొక్కజొన్న, జొన్న, బియ్యం, మినుములు, రాగి రవ్వలు, సజ్జతో చేసిన దాణా వాడుతున్నారు. తెచ్చిన వారంలోపు పిల్లలు జబ్బున పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాంటీబయోటిక్‌ మందును నీళ్ల ద్వారా ఇచ్చి కాపాడుతున్నారు. సరాసరి ఒక్కో కౌజు పిట్ట మాంసానికి ఎదిగే వరకు అన్నీ కలిపి రూ.20 ఖర్చు అవుతున్నది. 

మార్కెట్లో గిరాకీ

 పెళ్లి, ఇతరాత్ర ఫంక్షన్లకు వీటి మాంసాన్ని వినియోగిస్తున్నారు. జత (రెండు) పిట్టలకు రూ.120 నుంచి రూ. 150 వరకు ధర పలుకుతున్నది. వీటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండి, హై ప్రొటీన్స్‌ ఉంటాయని, బ్లడ్‌, షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయని, ఊపిరితిత్తుల వ్యాధి నియంత్రణకు ఇది ఔషధంగా పని చేస్తుంది.

కష్టపడితేనే ఫలితం

 నేను ఎం ఫార్మసీ పూర్తి చేసిన. నా భర్త డిగ్రీ పూర్తి చేసిండు. ఇద్దరం గ్రాడ్యు యేట్లమే. అత్తమామల కళ్లముందర ఉండాలని పౌల్ట్రీఫాం పెట్టినం. నెలకు రూ. 50 వేల ఆదాయం వస్తున్నది. ఐదుగురికి ఉపాధి చూపినం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం దొరకడం సాధ్యం కాదుకదా..! యువత వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్ట పెడితే ఉపాధి లభిస్తుంది.


logo