ఆదివారం 31 మే 2020
Jangaon - May 17, 2020 , 02:29:01

యూరియా ఆగయా!

యూరియా ఆగయా!

ఖిలావరంగల్‌: వానకాలం పంటల సాగుకు ముందే తెలంగాణ ప్రభుత్వం యూరియా నిల్వలను పెంచుతున్నది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రతి ఎకరానికీ కావాల్సిన ఎరువులు, విత్తనాలు సమకూర్చే పనిలో నిమగ్నమైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రైతులు అడిగిన ఎరువుల బస్తాలు ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. 

విడతల వారీగా దిగుమతి

వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు లక్షన్నర మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరముంటుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. మార్క్‌ఫెడ్‌ ఖాతాలో ఇది వరకే 20 వేల బస్తాల యూరియా నిల్వ ఉంది. ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు వివిధ కంపెనీలకు చెందిన 26,700 మెట్రిక్‌ టన్నుల ఎరువులను దిగుమతి చేసుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి వరంగల్‌ రైల్వే గూడ్స్‌ షెడ్‌కు జంబో గూడ్సు రైళ్ల ద్వారా విడతల వారీగా ఎరువులు తెప్పించి ఉమ్మడి జిల్లాల్లోని గోదాములకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు నాగార్జున యూరియా 8000 మెట్రిక్‌ టన్నులు, నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) ఎరువులు 2700, కోరమండల్‌ కాంప్లెక్స్‌ ఎరువులు 6000, క్రిబ్‌కో కంపెనీకి చెందిన 8700 మెట్రిక్‌ టన్నులు, ఐపీఎల్‌ కంపెనీకి చెందిన డీఏపీ, పొటాష్‌ 1300 మెట్రిక్‌ టన్నుల ఎరువులు దిగుమతి అయ్యాయి. మే చివరి వరకు ఈ ప్రక్రి య కొనసాగుతుందని వ్యవసాయాధికారులు చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో యూరియా డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందని, అప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో ఎరువులు తెప్పిస్తామని, గోదాములు సరిపోకపోతే ఫంక్షన్‌ హాళ్లలో నిల్వ చేస్తామని అధికారులు చెప్పారు.


logo