సోమవారం 25 మే 2020
Jangaon - Mar 22, 2020 , 03:35:09

అన్నదాతకు అండగా..

అన్నదాతకు అండగా..

  • ‘రైతుబంధు’లో ఎకరాకు రూ.5 వేలు
  • యాసంగి పంటలకు అకౌంట్‌లో జమ
  • జిల్లాలో 89,899 మందికి లబ్ధి
  • సర్కారు చేయూతతో కర్షకుల ఆనందం

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 21 : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే భావనతో కష్టాల సాగులో కన్నీటి సేద్యం చేస్తున్న కర్షకులకు తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వ్యవసాయంలో ఒడిదొడుకులు..కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో చరిత్రలో ఏనాడూ లేని విధంగా వ్యవసాయ రంగం లో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే భూ రికార్డుల ప్రక్షాళనను విజయవంతంగా పూర్తి చేసి, చరిత్రాత్మక పంట పెట్టుబడి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తొలుత రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరానికి ప్రభుత్వం రూ.4వేల చొ ప్పున రెండు పంటలకుగాను ఏడాదిలో రూ.8వే ల పెట్టుబడి ఇచ్చింది. గత ఎన్నికల ముందు ఇచ్చి న హామీ మేరకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెంచి ఏడాదికి రూ.10వేలు అందజేస్తున్నది. గత వానాకాలం సీజన్‌కుగాను రైతు బంధు పథకం పంట పెట్టుబడికి రైతన్నల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. జిల్లాలో 1లక్ష 29 వేల 246 మంది రైతులకు యాసంగికి సంబంధించి రూ.కోటి 74లక్షలు ఖాతాల్లోకి జమ కావా ల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 89,899 మంది రైతులకు రూ.కోటి 01లక్షల 72వేల 702 రూపాయలు జమ అయ్యాయి.  మిగిలిన రైతులకు కూడా డబ్బులు చెల్లించేందు కు వ్యవసాయ అధికారులు చర్యలు వేగవం తం చేశారు. తొలిసారి రైతు బంధు పథకం కింద అర్హులైన రైతులకు నేరుగా చెక్కుల ద్వారా పంట పెట్టుబడి సాయం అందజేయ గా, ఇప్పుడు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జ మ అవుతున్నాయి. 

సంక్షేమానికి పెద్దపీట..

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా చారిత్రక పథకాలు ప్రవేశపెట్టింది. ఐదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో 35సంక్షేమ పథకాలు అమలు చేసింది. సీఎం కేసీఆర్‌ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ప్రపంచం విస్తుపోయే పథకాలు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 40లక్షల మందికిపైగా ఆసరా పింఛన్లు అందుతున్నాయంటే అతిశయోక్తికాదు. అదే విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్లు, ఒంటరి మహిళలకు పింఛన్‌, రైతు బంధు, రైతుబీమా, గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, సబ్సిడీపై వాహనాలు, ప్రతి ఒక్కరికీ ఆరుకిలోల బియ్యం, విద్యార్థులకు సన్నబియ్యం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధిలాంటి కార్యక్రమాలు అమలు చేశారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి వేతనాలు పెంచింది. మాతాశిశు సంరక్షణకు కేసీఆర్‌ కిట్‌ను పంపిణీ చేసింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన 90రోజుల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అర్హులైన రైతులందరికీ పట్టాపాస్‌ పుస్తకాలు పంపిణీ చేసింది. 

పండుగలా వ్యవసాయం..

సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 447 ట్రాక్టర్లు, 11వరికోత యంత్రాలు, 90రోటో వెట్స్‌ అందజేశారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను స్ఫూర్తిగా తీసుకుని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే మూడు దశల్లో సుమారు రూ.150 కోట్లకు పైగా వెచ్చించి 500లకు పైగా చెరువులను పునరుద్ధరించారు. వాతావరణం అనుకూలించడం సహా జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ టీ రాజయ్య పట్టుబట్టి ఆయా నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటల్లోకి గోదావరి, ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటిని నింపడంతో నీటి వనరులన్నీ జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల పంటదిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు కరువుకు చిరునామాగా ఉన్న జనగామ ప్రాంతంలో గత ఏడాది 1.40వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కావడం విశేషం.

అందరికీ పెట్టుబడి సాయం..

అర్హులైన ప్రతిరైతుకూ దశలవారీగా రైతుబం ధు పంటపెట్టుబడి సాయం అందుతుంది. జిల్లా లో 1లక్ష 29వేల 246మంది రైతులకు యాసంగికి సంబంధించి రూ.కోటి 74లక్షలు ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 89,899 మంది రైతులకు రూ.కోటి 01లక్షల72వేల 702 రూపాయలు జమ అయ్యాయి. మిగిలిన రైతులకు త్వరలోనే దశలవారీగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు.  

- జీ నర్సింగం, జిల్లా వ్యవసాయ అధికారి

రైతు కోసం సంక్షేమ పథకాలు..

ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకా లు అమలు చేస్తుంది. రైతుబంధు, రైతుబీమా, పంట రుణాల మాఫీ విడుతల వారీగా చేస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రాజెక్టులు, కాలువల ద్వారా సాగునీరు అందించడం ద్వారా రైతులు గతంలో కన్నా రెట్టింపు వ్యవసాయం చే స్తున్నారు. రైతులకు వ్యవసాయ ఖర్చులకు ప్రభుత్వం నుంచి రైతుబం ధు అందుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- మడిపల్లి సుధాకర్‌గౌడ్‌, రైతు సిద్దెంకి, జనగామ మండలం

రైతుబంధుతో ఊరట..

ప్రభుత్వం రైతులకు పంటల సాగుకు ఎకరానికి రూ.5వేలు ఇస్తోంది. దీంతో యువకులు సై తం వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే. పల్లెల్లో ఎక్కడ చూసినా కాలువల ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి. దీంతో యాసంగి సాగులో భారీగా వరినాట్లు వేశారు. రైతుబంధుతో రైతుల కష్టాలు తీరుతున్నాయి.  

- పుప్పాల బీరయ్య, యువరైతు, సిద్దెంకి, జనగామ మండలం


logo