గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Mar 16, 2020 , 03:48:20

అక్షరం ఆకర్షించాలి..

అక్షరం ఆకర్షించాలి..
  • చేతిరాత బాగుంటేనే అత్యుత్తమ మార్కులు
  • ‘పది’ పరీక్షల్లో రైటింగ్‌పై దృష్టిసారించాలి
  • చిన్న చిట్కాలు పాటిస్తే విజయం మీ సొంతం

చెన్నారావుపేట, మార్చి14: అందమైన అక్షరం విజయ తీరాలను చేర్చుతుంది. విద్యార్థి విజయం చదువులోనే కాదు..రాసే అక్షరంలోనూ ఇమిడి ఉంటుంది. ఆకర్షించే అక్షరం.., అందమైన పద కూర్పు మనస్సును హత్తుకుంటుంది. పరీక్షల్లో విద్యార్థులు ఎంత చదివినా.. చేతిరాత అందంగా లేకుంటే శ్రమంతా వృథానే అవుతుంది. చక్కగా.., క్రమపద్ధతిలో అక్షరాలు కనిపిస్తే పేపరు దిద్దే వారికి మంచి అనుభూతి కలుగుతుంది. మార్కులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరీక్షల సీజన్‌ నడుస్తున్నది. ఇంటర్‌ పరీక్షలు కొనసాగుతుండగా.. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాలి. మార్కుల సాధనలో మంచి చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. జవాబు కచ్చితమైనదే అయినా చేతిరాత సరిగా లేకపోతే ఏదో అసంతృప్తి జవాబు పత్రంలో కనిపిస్తుంది. చేతిరాతను బట్టి వ్యక్తుల గుణగణాలు అంచనా వేయవచ్చని, పరీక్షల్లో మంచి ర్యాంకు, భవితను నిర్దేశించేది అక్షరాలేనని మనోవిజ్ఞాన నిపుణులు, అధ్యాపకులు, మేధావులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.  భవిష్యత్‌ను కీలక మలుపు తిప్పే పరీక్షలు కావడంతో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త పడాలి. మార్చి 19వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అందమైన చేతిరాత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ప్రత్యేక కథనం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

  • అక్షరాల మధ్య ఖాళీ స్థలాలను వదలడం ద్వారా పదాల అర్థాలు మారిపోతాయి.
  • అక్షరాలు, సంఖ్యలను స్పష్టంగా రాయాలి.
  • సమాధానాలు రాసేటప్పుడు విరామ చిహ్నాలు మరిచిపోకూడదు.
  • కొట్టి వేతలు ఎక్కువగా ఉంటే పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేదని తెలిసిపోతుంది.
  • బిట్‌ పేపర్‌ సమాధానాల్లో చిన్నచిన్న ఆంగ్ల అక్షరాలు రాయకూడదు.
  • చేతిరాత బాగాలేదని పరీక్షల సమయంలో బాధపడేకంటే ముందే తగిన జాగ్రత్తలు పాటించి చిన్నచిన్న చిట్కాలను అవలంబిస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
  • గ్లిష్‌ కలిపి రాతయినా, విడి రాతయినా దిద్దేవారికి అర్థమయ్యేలా ఉండాలి.
  • ఆంగ్లంలో కలిపిరాత రాసేవారు 60డిగ్రీల కోణంలో, విడివిడిగా రాసేవారు 90డిగ్రీల కోణంలో రాయాలి.
  • తప్పుగా రాసినప్పుడు ఇష్టం వచ్చినట్లు కొట్టి వేయకుండా ఒక్క గీత గీసి దాని పక్కనే తిరిగి రాయడం ఉత్తమం.
  • అక్షరాల మధ్య కాకుండా పదాల మధ్యలో నిర్ణీత ఖాళీ ఇవ్వాలి.
  • అంకెలు వేసేటప్పుడు కలిపి రాత పనికి రాదు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ షార్ట్‌కట్‌ భాషను వాడకూడదు.
  • తెలుగు, ఆంగ్లం, హిందీ రాసేటప్పుడు అక్షరాలు నిటారుగా, గుండ్రంగా రాయాలి.
  • ఏ4 సైజు కాగితంలో 14నుంచి 15 లైన్లను మాత్రమే రాయాలి.
  • పెన్నును మూడు వేళ్లతో పట్టుకోవాలి. పెన్ను వెనుక భాగం భుజం వైపు చూసేలా ఉండాలి 

 

ఆకర్షించాలి...

 పెన్ను, పెన్సిల్‌ను పట్టుకునే విధానం చక్కగా ఉండాలి. పరీక్షలకు వెళ్లే ముందు కొంత సాధన తప్పకుండా చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే రాత చక్కగా వస్తుంది. అప్పుడే అనుకున్న విధంగా అక్షరాలు రాయవచ్చు. పదాలు, వాక్యాలు, పేరాల మధ్య తగినంత దూరం ఉండాలి. అప్పుడే అక్షరాలు ఆకర్షిస్తాయి. తలకట్టు, దీర్ఘాలు, వత్తులు సరైన రీతిలో ఉండాలి.

-మోతె ఇంద్రసేనారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చెన్నారావుపేట 


స్పష్టంగా ఉండాలి..

అక్షరాలు మరీ చిన్నవి, పెద్దవి కాకుండా స్పష్టంగా ఉండాలి. రాత బాగుంటే జవాబు పత్రాలు దిద్దేవారిని ప్రభావితం చేస్తాయి. గుండ్రంగా, అందంగా రాసే అక్షరాలతో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. గొలుసుకట్టు రాత రాయకూడదు.

-మెట్టుపల్లి జ్యోతి, కస్తూర్బా స్పెషల్‌ ఆఫీసర్‌, చెన్నారావుపేట


logo
>>>>>>