గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Mar 16, 2020 , 03:43:18

మట్టిని ఇసుకగా మార్చి..

మట్టిని ఇసుకగా మార్చి..

ఇన్ని రోజులు వాగులు, వంకల్లో ఇసుక తీసిన అక్రమార్కులు చివరికి మట్టిని కూడా వదలడం లేదు. మట్టిని నుంచి ఇసుక తీసి కొత్తరకపు వ్యాపారానికి తెరలేపారు. ఇందుకోసం రిజర్వాయర్లు, వాగులను ఎంచుకుని వాటిలో మోటార్లు ఏర్పాటు చేసి మట్టిని ఫిల్టర్‌ చేసి ఇసుకలా మార్చుతు న్నారు. మండల పరిధిలోని రిజర్వాయర్‌ పరిధిలో రోజుకు వందల ఎకరాల్లో మట్టిని తవ్వుతూ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.

  • ఉప్పుగల్లు రిజర్వాయర్‌ నుంచి ఇసుక దందా
  • మట్టిని ఫిల్టర్‌ చేసి విక్రయిస్తున్న వైనం
  • జేసీబీలతో ఆకేరువాగులో అక్రమ తవ్వకాలు
  • అధికారులు స్పందించాలని స్థానికుల వేడుకోలు

జఫర్‌ఘడ్‌, మార్చి 15 : మండలంలోని ఉప్పుగల్లు ఆకేరు వాగు పరివాహక ప్రాంతంలో గతంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగేది. దీంతో వాగులో ఇసుక తరిగి పోవడంతో భూ భకాసురుల కన్ను ఉప్పుగల్లు రిజర్వాయర్‌పై పడింది. రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి రిజర్వాయర్‌ పనులు ప్రారంభించింది. ఇదే అదనుగా భావించిన కొందరు ఇసుక వ్యాపారులు రిజర్వాయర్‌ పరిధిలోని భూముల్లో తవ్వకాలు ప్రారంభించి ఇసుక అమ్మకాలు మొదలు పెట్టారు. రిజర్వాయర్‌ పరిధిలోని భూమిలో ఇసుక కరువవడంతో మట్టిని జేజీబీలతో తవ్వి కుప్పలుగా పోసి ఫిల్టర్‌ చేస్తున్నారు. దీని నుంచి ఇసుక తీసి రవాణాకు చేస్తున్నారు. మట్టిని ఫిల్టర్‌ చేసేందుకు ట్రాక్టర్లకు నీటి పంపులు ఏర్పాటు చేసి మట్టి నుంచి ఇసుకను వేరుచేస్తున్నారు. ఇలా రిజర్వాయర్‌ పరిధిలోని సుమారు 800 ఎకరాల్లో ఇసుక దందా నిర్విరామంగా కొనసాగుతుంది. 

ఇష్టారాజ్యంగా అక్రమ దందా

ఫిల్టర్‌ ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేస్తూ అక్రమార్కులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటు న్నారు. మండలంలోని ఉప్పుగల్లు నుంచి పట్ట పగలే ట్రాక్టర్లలో హన్మకొండ వైపు ఇసుక తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మండలంలోని కూనూరు, కోనాయిచలం, తిడుగు గ్రామాల్లోని ఆకేరు వాగు నుంచి  ప్రతి రోజూ ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో భూ గర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అడపా దడపా దాడులు నిర్వహిస్తున్నా,  ఇసుక రవాణాదారులు మాత్రం వారి దాడులను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.   

 రిజర్వాయర్‌ కట్టకు ముప్పు...

ఇసుక అక్రమ రవాణా కోసం రిజర్వాయర్‌లో జేసీబీల తో తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో రిజర్వాయర్‌ కట్టకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానిక రైతులు వాపోతున్నారు. అక్రమార్కుల తవ్వకాలతో రిజర్వాయర్‌ కట్ట నిర్మా ణం కంటే లోతుగా గుంతలు ఉండడంతో కట్టకు ముప్పు వాటిల్లుతుందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తవ్వకాలు ఆపాలని కోరుతున్నారు.

నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌..

ట్రాక్టర్‌ డ్రైవర్లు ఇసుకను తరలిస్తున్న క్రమంలో నిర్లక్ష్య ంగా నడుపుతుండడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. ఇసుక డంపు  ప్రాంతం నుంచి హన్మకొండ, జఫర్‌ఘడ్‌ వైపు ట్రాక్టర్లు వెళ్లే క్రమంలో డ్రైవర్ల్లు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వేగంగా ట్రాక్టర్లు నడుపుతున్నారు. దీంతో, ద్విచక్ర, ఇతర వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  సంబంధిత అధికారు లు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని పలు గ్రామా ల ప్రజలు కోరుతున్నారు.


logo
>>>>>>