శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jangaon - Mar 16, 2020 , 03:41:19

డెడ్‌లైన్‌ 31

డెడ్‌లైన్‌ 31

బీఎస్‌(భారత్‌ స్టేజ్‌)-4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు గడువు ఈ నెల 31తో ముగియనుంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. వీటి స్థానంలో బీఎస్‌-6 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం బీఎస్‌-4 వాహనాలపై నిషేధం విధించింది. ఈ నెలాఖరులోగా వాహనాల రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని ఆదేశించిన క్రమంలో వాహనదారులు ఆర్టీవో కార్యాలయానికి క్యూ కడుతున్నారు. గడువు దాటిన వాహనాలను తుక్కుకింద లెక్కించనున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 4611 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది. కొద్ది రోజులుగా సగటున రోజుకు 200 వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. ఇదే అదనుగా భావించిన ఏజెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్‌కు పక్షం రోజులు మాత్రమే గడువు ఉండడంతో వాహనదారులు హైరానాపడుతున్నారు.

  • బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు గడువు ఈ నెల 31
  • ఏప్రిల్‌ 1 నుంచి రిజిస్ట్రేషన్ల నిలిపివేత
  • గడువు దాటితే తుక్కు కిందే లెక్క
  • ప్రైవేట్‌ వ్యక్తుల హల్‌చల్‌
  • అదనపు వసూళ్లకు పాల్పడుతున్న రవాణాశాఖ ఏజెంట్లు
  • ఆందోళన చెందుతున్న వాహనదారులు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బీఎస్‌ - 4 వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం వాహనదారలు బారులు తీరుతున్నారు. ఈనెల 31వ తేదిలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే ఆదేశాల మేరకు కార్యాలయం వద్ద వాహనదారుల రద్దీ నెలకొంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వాహనాల కాలుష్యాన్ని నియంత్రించాలని నిర్ణయించుకుంది. బీఎస్‌ -4 వాహనాల్ని సుప్రీంకోర్టు నిషేధించింది. ఇప్పటికే కొనుగోలు చేసిన వారికి ఈనెల 31వ వరకు గడువు ఇచ్చింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌ -6 వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌కు వాహనదారుల తాకిడి ఎక్కువ కావడంతో రోజు వారిగా కేటాయించే స్లాట్స్‌ను పెంచడంతో పాటు సాయంత్రం ఐదు గంటల వరకు సమయాన్ని పొడిగించారు. ఇదే అదనుగా ఏజెంట్లు అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. హోంగార్డులు సైతం ఏజెంట్లుగా అవతారమెత్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. దీంతో ఇటీవల కాలంలో వీరి ఆదాయం విపరీతంగా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్ల సందడి

రవాణాశాఖలో భారత్‌ స్టేజ్‌ - 4 (బీఎస్‌ -4) వాహనాల రిజిస్ట్రేషన్‌ సందడి నెలకొంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బీఎస్‌ - 6 వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి చకాచకా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఈనెల 31వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుంటే ఆ వాహనాల్ని స్క్రాప్‌ కిందే జమకట్టనున్నారు. గడువు సమీపిస్తుండటంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో చూస్తే వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. గంటల కొద్ది సమయం కార్యాలయం వద్ద వెచ్చించాల్సి రావడంతో అసహనానికి లోనవుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు బీఎస్‌ -6 వాహనాల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. తయా రీ సంస్థలు ఇందుకు అనుగుణంగా ఇంజిన్లలో మార్పులు చేశాయి. అయితే ప్రస్తుతం వాహన డీలర్ల వద్ద బీఎస్‌ -4 వాహనాలు ఉన్నాయి. దీంతో వీటిని అమ్మేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. కొంతమంది డీలర్లు తమ బంధువుల పేర  ఆ వాహనాల్ని రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్‌ అయ్యా క కూడా విక్రయించవచ్చు అనే ఆలోచనతో ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. కొంతమంది డీలర్లు కాస్త తక్కువ ధరకైనా ఫర్వాలేదు వాహనాన్ని అమ్మే ద్దాం అని అనుకుంటున్నారు. ఇప్పటికే రవాణాశాఖ అధికారులు బీఎస్‌ - 4 వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు తేదీపై విస్తృత ప్రచారం చేస్తున్నది. ఇప్పటికే డీలర్లతో సమావేశం నిర్వహించారు. అక్కడక్కడ బ్యానర్లు కట్టి ప్రచారం చేశారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

పెరిగిన స్లాట్‌ బుకింగ్స్‌

రోజు వారికంటే స్లాట్స్‌ బుకింగ్స్‌ను అధికారులు పెంచారు. సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. జిల్లాలో 4611 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంది. కొద్ది రోజులుగా సగటున రోజుకు 200 వాహనాల చొప్పున రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. సాధారణ రోజుల్లో 40వాహనాలు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవడం, ఫొటో దిగడం, చాసెస్‌, ఇంజిన్‌నంబర్‌, పత్రాల పరిశీలన తదితర ప్రక్రియ కోసం గంటల తరబడి సమయం పడుతున్నది. దీంతో త్వరగా పనులు పూర్తికావాలని వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఏజెంట్లు రోజు వారికంటే అధికంగా ధరలు వసూళ్లు చేస్తున్నారు. చేసేది ఏమిలేక వాహనదారులు అడిగినంతా ఇచ్చేస్తున్నారు. తాము వసూలు చేసిన దాంటో అధికారులకు వాటా ఉంటుందని బాహాటంగానే చెబుతున్నారు. అన్నీతామే చూసుకుంటామని ఏజెంట్లు వాహనదారులకు భరోసా కల్పిస్తున్నారు. తామేం తక్కువ కాదని హోంగార్డులు కూడా ఏజెంట్ల అవతారం ఎత్తినట్లు కార్యాలయం వద్ద చర్చించుకోవడం కనిపించింది. ఇన్‌స్పెక్టర్‌ వాహనాల్ని తనిఖీలు చేయకుండా కానిస్టేబులే వాహనాల్ని తనిఖీ చేస్తుండటం కనిపించింది. కాగా నెంబర్‌ ప్లేట్‌ వేసే వ్యక్తి కూడా తనదైన శైలిలో ధరలు అమాంతం పెంచేశాడని, రేడియం వేయాలంటే మరింత ముట్టచెప్పాల్సి వస్తున్నదని వాహనదారులు వాపోతున్నారు. 

ప్రైవేట్‌ వ్యక్తుల వసూళ్లు..!

రవాణాశాఖలో ప్రైవేట్‌ వ్యక్తుల వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. ఒక్కో అధికారికి ప్రత్యేకంగా  ఒక్కో ప్రైవేట్‌ వ్యక్తి పనిచేస్తున్నాడనేది బహిరంగ రహస్యం. ఆ వ్యక్తి సదరు అధికారికి అన్ని తానై చూసుకుంటాడు. ప్రైవేట్‌ వ్యక్తులే ఏజెంట్లతో, హోంగార్డులతో మాట ముచ్చట నడిపిస్తారు. తమకేం తెలియదంటూ సిబ్బంది వ్యవహరించడం షరామాములే అని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా ప్రైవేట్‌ వ్యక్తులు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుందని, తమనెవరు ఏం చేయలేరు అన్నట్లు వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అడపా దడపా రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకట్రెండు చోట్ల తనిఖీలు నిర్వహించి రిజిస్ట్రేషన్‌ లేని వాహనాలను సీజ్‌ చేశారు. డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం కోసం చర్యలు తీసుకున్నారు. వారికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లోని విషయాలను డీలర్లకు వివరించారు. వాహనదారులను చైతన్యపరిచే విధంగా బ్యానర్లు కట్టారు. దీంతో వాహనదారుల తాకిడి ఎక్కువైంది. రోజుకు 200కు పైగా వాహనాలు రిజిస్ట్రేషన్‌ కోసం వస్తుండటంతో కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంటున్నది.


logo