గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Mar 09, 2020 , 03:19:23

మాంద్యం ఉన్నా మనుగడ మరవని పద్దు

మాంద్యం ఉన్నా మనుగడ మరవని పద్దు

అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ సర్కార్‌ పెద్దపీట వేసింది. ఆ దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. దేశంలో ఆర్థికమాధ్యం ఉన్నా, దాని ప్రభావం ఏమాత్రం పడకుండా ఆయా రంగాలకు భారీగా నిధులు సమకూర్చింది. ఇచ్చినమాట నిలుపుకోవడం, చేసిన వాగ్దానాన్ని అమలు చేయడమన్న అంతస్సూత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్షరాలా నిజం చేసి చూపారు. ఇందుకు నిదర్శనంగానే ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్న సర్కారు సాగునీటి ప్రాజెక్టులకు, రైతుల పంట రుణాల మాఫీకి భారీగా నిధులు కేటాయించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో డీసీసీబీ పరిధిలో రూ.18 కోట్ల రుణమాఫీ జరిగి సుమారు ఎనిమిది వేల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 57 ఏళ్ల వయస్సున్న వారికి ఆసరా పథకంలో పెన్షన్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. మరోవైపు కాళోజీ హెల్త్‌యూనివర్సిటీకి రూ.325.88 లక్షలు, కాకతీయ విశ్వవిద్యాలయానికి గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్‌ కింద రూ. 88,28.81లక్షలను కేటాయించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తర్వాత వేగంగా విస్తరిస్తున్న ఓరుగల్లులో ఇప్పటికే ఐటీ పరిశ్రమలు స్థాపిపించగా, తాజా బడ్జెట్‌తో మరిన్ని కంపెనీలు వస్తాయని, దీంతో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివిధ రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.            -వరంగల్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తేతెలంగాణ


వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: బడ్జెట్‌ అంటే జమాఖర్చుల చిట్టా పద్దులు కాదు. మానవీయ మనుగడ మణిహారం అని మరోసారి రాష్ట్ర సర్కార్‌ స్పష్టం చేసింది. దేశాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యం, మందగమన ప్రభావం రాష్ర్టాన్ని తాకినా ఇచ్చినమాట నిలుపుకోవడం, చేసిన వాగ్దానాన్ని అమలు పరచడం అన్న అంతస్సూత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్షరాలా నిజం చేసి చూపుతున్నారు. ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020-21 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిన మార్గదర్శకాలను, అన్ని రంగాల అభ్యున్నతికి ఆయన చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా వివిధ రంగాల ప్రగతే ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అన్ని వర్గాల ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతం పలుకుతున్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా, ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడినా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ రంగాల కేటాయింపులో వీసమెత్తు కూడా కోత విధించకపోవడాన్ని ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రైతును రాజు చేయడం కోసం సాగునీటి రంగానికి పెద్ద పీట వేస్తూనే వ్యవసాయ అనుబంధ రంగాల పురోభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో గ్రామీణ వృత్తి వికాసం మరింత వెలుగొందనుందనే విశ్వాసం బలపడింది. రైతు రుణమాఫీ అంటే పుస్తక సర్దుబాట్లు చేయడం కాదు.. ఈ యేడాది రూ.25వేల రుణమాఫీకి సంబంధించిన మొత్తాన్ని చెక్కుల ద్వారా పంపిణీ చేస్తామని రైతాంగానికి బడ్జెట్‌ భరోసా ఇచ్చింది. ఈ లెక్కన దాదాపు తక్షణమే డీసీసీబీ పరిధిలోనే దాదాపు రూ.18 కోట్ల రూపాయల రుణమాఫీ కింద దాదాపు  ఆరు నుంచి ఎనిమిదివేల మంది రైతు లు నేరుగా ప్రయోజనం పొందే అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు. సంక్షేమ రంగంలో దేశానికి దిక్సూచీగా నిలిచిన ఆస రా పింఛన్‌ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగబోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 57 ఏళ్ల వయసున్న వారందరూ అర్హత సాధించబోతున్నారని ఆర్థిక మంత్రి హరీష్‌రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొని ఆసరా లబ్దిదారులకు ఊరట కల్పించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసిన అనంతరం ఆర్టీసీని బతికించడమే కాదు కార్మిక వర్గాల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ సీఎం కేసీఆర్‌ ఆర్టీసీకి వచ్చే బడ్జెట్‌లో వెయ్యికోట్లు కేటాయిస్తామని ప్రకటించినట్టుగానే కేటాయింపులు చేశారు. దీంతో తమ సంస్థను ప్రగతిదారుల్లో తీసుకువెళుతున్నారని ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం 

వ్యవసాయ వికాసమే అన్ని రంగాల అభ్యున్నతికి సోపానం అన్న అంశాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి బడ్జెట్‌ దానిపై మరింత భరోసాని కల్పించింది. కాళేశ్వరం, ఎస్పారెస్పీ, దేవాదుల, తుపాకులగూడెం వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే కల ఎంతోదూరంలో లేదని మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే పడావు పడ్డ భూములు ఆకుపచ్చని మాగాణం ఆవిష్కృతం అవుతున్నది. నిత్య కరువు ప్రాంతాలుగా ముద్రపడ్డ ప్రాంతాలైన జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, డోర్నకల్‌, మహబూబాబాద్‌ వంటి నియోజకవర్గాల్లో రాష్ట్ర ఆవిర్భావ అనంతరం చిన్న నీటి వనరుల పరిరక్షణ చేస్తూనే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో రెండు పంటలకు నీరందుతున్నది. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కుల వృత్తుల వికాసం మునుపెన్నడూ లేనివిధంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. గొల్లకురుమలు, ముదిరాజ్‌, గంగపుత్రులకు గొర్రెలు, ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయడంతో వారు ఆత్మగౌరవంతో జీవనాన్ని సాగిస్తున్నారు. 

సుస్థిర సంక్షేమం  

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు గా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్ర భుత్వం సంక్షేమ రంగాన్ని మరింత ముం దుకు తీసుకెళుతున్నది. ఆసరా పింఛన్‌ వయో పరిమితిని 65 నుంచి 57కు కుదించిన సర్కార్‌ ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొనడంతో జిల్లా వ్యాప్తం గా దాదాపు 15 నుంచి 20 వేల మందికి భరోసా లభించబోతున్నది. అంతేకాకండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాలే కాకుండా చేనేత, గీత, ఒంటరి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, విద్య, ఆరోగ్య ప్రమాణాలకు మ రింత భరోసా కల్పించింది. అలాగే కంటివెలుగు స్ఫూర్తితో చెవి, ముక్కు, గొంతు, దంత వైద్యశిబిరాలు నిర్వహించడమే కాకుండా ప్రతీ ఒక్కరికీ హెల్త్‌ ఫ్రొఫైల్‌ సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది. అం తేకాకుండా సంపూర్ణ అక్షరాస్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రికగా రూపుదిద్దుకుంటున్న ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ ఉద్య మ స్ఫూర్తితో ముందుకు సాగబోతున్నది. ఇందుకోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ. 100 కోట్లు కేటాయించడం విశేషం. 

వరంగల్‌కు నిధుల వరద 

రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత వరంగల్‌ అన్ని రంగాల్లో ముం దు వరుసలో నిలబడింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ కేంద్రంగా ప్రగతి వికాసం జరగాలన్న సంకల్పంతో ప్రభుత్వం నిధుల వరద పారించింది. విద్యాకేంద్రంగా పేరున్న వరంగల్‌కు మరిన్ని నిధు లు రాబోతున్నాయి. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయానికి ప్రత్యేక కేటాయిపులు చేసింది. ఇక పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్మిస్తున్న అత్యాధునిక పోలీస్‌ కమాం డ్‌ కంట్రోల్‌ యూనిట్‌కు రూ. 200 లక్షలను కేటాయించింది. 

గోదావరి గ్రోత్‌ ఇంజిన్‌ 

గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రతి ఎకరా న్ని మాగాణం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన జలదీక్ష కాళేశ్వ రం ప్రాజెక్టుతో అంకుర్పారణ జరిగి ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులైన దేవాదుల, రీడిజైనింగ్‌ ద్వారా తుపాకులగూడెం(సమ్మక్క బ్యారేజ్‌) నిర్మాణం పనులు వేగవంతం చేస్తామని బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా స్టేజ్‌-1, 2 కాలువలు వందల కిలోమీటర్ల పొడవున నీటితో కళకళలాడుతున్నాయి. ఈ దృశ్యం శాశ్వతం చేయడం, తద్వారా రైతాంగానికి రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందించడమన్న బృహత్తర యజ్ఞం సాకారం కానుంది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాన్ని జలటూరిజంగా మార్చేందుకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం. ఒకవైపు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన చేపడుతూ మరోవైపు మధ్యతరహా ప్రాజెక్టులైన పాకాల, లక్నవరం, రామప్ప, మల్లూరులకు బడ్జెట్‌లో నిధుల భరోసా లభించింది. 

నియోజకవర్గాల అభ్యున్నతికి నిధులు 

గత రెండేళ్లుగా నియోజకవర్గాల అభివృద్ధి నిధులు రాక ఇబ్బందులుపడ్డ వాతావరణం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి నియోజకవర్గాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తామని బడ్జెట్‌లో స్పష్టం చేసింది. దీంతో ప్రతీ సంవత్సరం నియోజకవర్గానికి రూ.3 కోట్ల నిధులు రాబోతున్నాయి. బడ్జెట్‌లో నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సారథ్యంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు నన్నపునేని, పెద్ది, ఆరూరి, చల్లా, గండ్ర తదితరులు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


వరంగల్‌ ఐటీకి మహర్దశ 

ఐటీ రంగంలో ఇవాళ రాష్ట్రమే దేశానికి మార్గదర్శిగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలను సైతం ఐటీ నగరాలుగా మార్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మరోసారి స్పష్టమైంది. హైదారాబాద్‌ తరువాత వరంగల్‌ అన్ని రంగాల్లో అద్వితీయ ప్రగతి దారుల వెంట పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సైయంట్‌, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజ కంపెనీల క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం క్వాడ్రంట్‌ కంపెనీ ఇక్కడ భూమి పూజ చేసింది. మరోవైపు ఇప్పటికే కాకతీయ ఐటీ సొల్యూషన్స్‌, వెంటాయిస్‌ మొదలైన సంస్థలు మడికొండ ఐటీ పార్క్‌లో తమతమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వీటి స్ఫూర్తితో మరికొన్ని సంస్థలు ఇక్కడ నెలకొల్పేందుకు సాగుతున్న ప్రయత్నాలకు ఆదివారం నాటి బడ్జెట్‌ మరింత భరోసా కల్పించింది. దీంతో ఇక్కడి ఐటీ ఉద్యోగార్థులకు ఇక్కడే ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి. 


logo