మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Mar 09, 2020 , 03:16:44

రంగుల కేళీ..హోలీ

రంగుల కేళీ..హోలీ

జనగామ రూరల్‌, మార్చి 08 : వేసవి ప్రారంభంలో ఎక్కువగా పూసే మోదుగు చెట్టు  పూలతో రంగులు తయారు చేయడం, ఆకులతో విస్తరాకులు కుట్టడం, కాండంతో ఆయుర్వేదిక్‌ ఔషధాలకు ఉపయోగించడంతో పాటు పండుగల సమయంలో దేవుడి పూజకూ వినియోగిస్తారు. ముఖ్యంగా హోలీ పండుగ వచ్చిందంటే గ్రామాల్లో మోదుగు పూలు తీసుకొచ్చి బాగా ఉడుకబెట్టి దాని రసాన్ని చల్లుకునే ఆనవాయితీ పూర్వం నుంచి వస్తున్నది. ఆకులను డయాబెటిస్‌ బాధితులు వాడితే ఘగర్‌ తగ్గుతుందని అయుర్వేదిక్‌ వైద్యులు చెబుతున్నారు.  అదేవిధంగా పూజలు, నూతన గృహప్రవేశాలకు ఇంట్లో జరిగే హోమాలు, యాగాలు, యజ్ఞాలకు మోదుగు కట్టే కాల్చితే మంచి జరుగుతుందని పూర్వీకులు విశ్వాసం. దీనికి తోడు ఈ కట్టెల ద్వారా వచ్చే పొగతో ఇంట్లో చెడు పోయి మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. మహాశివరాత్రికి శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో మోదుగు పూలతో పూజలు చేస్తారు. రసాయన రంగుల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే మోదుగు పూల రంగుతో ఏంతో ఆరోగ్యమని పూర్వీకుల విశ్వాసం.  

జిల్లాలో ఘనంగా కాముడి దహనం

జనగామ, నమస్తే తెలంగాణ : రంగులకేళీ హోలీ పండుగ సంబురాలను పురస్కరించుకొని ఆదివారం రాత్రి జిల్లా కేంద్రం సహా పలు ప్రాంతాల్లో కాముడి దహనం చేశారు. ఇళ్లలో పనికిరాని కర్రలను పోగుచేసి చప్పట్లు, కోలాటంతో మహిళలు, చిన్నారులు కాముడి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో వేడుకలు జరుపుకున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా హోలీ సంబురాలకు యువత, చిన్నారులు, మహిళలు సిద్ధమవుతున్నారు. 


చిన్నప్పుడు మోదుగు పూలతో హోలీ ఆడేవాళ్లం

చిన్నప్పుడు మోదుగుపూలతోనే రంగుల పండుగ జరుపుకునేటోళ్లం. వారం రోజుల ముందే అడవికి పోయి పూలు తీసుకువచ్చేవాళ్లం. రేపు పం డుగ అనగానే ఇంట్లో మట్టిపొయ్యి పై కుండపెట్టి అందులో పూలు వేసి బాగా ఉడకబెట్టగా వచ్చిన రంగుతోహోలీ ఆడేటోళ్లం. 

-గుర్రపు వెంకటయ్య, సిద్దెంకి 


మోదుగు చెట్లను అందజేయాలి

రసాయనాలతో రంగుల పండు గను జరుపుకోవడంతో చర్మవ్యాధులు వస్తున్నాయి. ప్రభుత్వమే మోదుగు చెట్లను పంపిణీ చేయాలి. నర్సరీల్లో మోదుగు విత్తనాలు నాటాలి. కోడిగుడ్లు, రసాయన రంగులు వాడొద్దు.  మోదుగు పూలతో హోలీ పండుగ జరుపుకోవాలి. 

-పుప్పాల కరుణాకర్‌, సిద్దెంకి


logo
>>>>>>