గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Mar 09, 2020 , 03:14:26

మార్కెట్‌లో ‘కంది’ కొక్కులు..

మార్కెట్‌లో ‘కంది’ కొక్కులు..

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 08 : జనగామ మార్కెట్‌లో రైతుల ముసుగులో కొందరు వ్యాపారులు పంది కొక్కుల్లా తిష్టవేసి కంది రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ తిరస్కరిస్తున్న కందులను తక్కువ ధరకు కొని రైతుల పేరిట తిరిగి వాటినే ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. అన్నదాత ముసుగులో ఇప్పటికే వందలాది క్వింటాళ్లు అమ్మి సొమ్ము చేసుకున్న మధ్య దళారులు, వ్యాపారులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఖమ్మం, వరంగల్‌ జిల్లాల  స్థాయి అధికారి రంగంలోకి దిగి కందులు అమ్ముతున్న రైతులు అసలా? కాదా? ఏ గ్రామానికి చెందిన రైతు కందులు అమ్మాడు? ఆ గ్రామంలో కంది పంట ఎంత సాగైంది? అన్నది కూపీ లాగుతూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ముందుగా పెట్టుబడి పెట్టి క్వింటాల్‌కు రూ.500నుంచి వెయ్యి రూపాయల తేడాలో కొనుగోలు చేసి అక్కడికక్కడే కడుపులో చల్ల కదలకుండా లాభాలు అర్జిస్తూ రైతు నోట్లో మట్టికొడుతున్నారు. కొందరు వ్యాపారులు సాగిస్తున్న కందుల బినామీ దందాకు మార్కెటింగ్‌ అధికారులు అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారుల కందుల అక్రమ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరన్నది తేల్చేందుకు మార్క్‌ఫెడ్‌, ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసిన కందుల లెక్కలను తోడుతున్నారు. కరువును అధిగమించి అందుబాటులో ఉన్న నీటి వనరులతో కంది పంట సాగు చేసిన జిల్లా రైతుకు కన్నీరే మిగులుతుంది. గత ఏడాదితో పోలిస్తే సగం ధర పడిపోయి రైతులు దిగాలు పడుతుంటే వ్యాపారుల మాయాజాలానికి మరింత నష్టపోతున్నాడు. తేమ వంటి వివిధ కారణాలతో ప్రభుత్వరంగ సంస్థ రైతులను కొనుగోలుకు తిరస్కరిస్తుంటే అదే సాకుతో వ్యాపారులు, మధ్యదళారులు తక్కువ ధరకు కొని ఇన్నాళ్లు కన్నంలో దాచిన రాశులను రైతు పేరిట ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ తతంగంతో కష్టపడి కందిపంట సాగుచేసిన రైతులు నష్టపోతుండగా.. వ్యాపారులు, మధ్య దళారుల జేబులు నిండుతున్నారు. మార్కెట్‌ యార్డుకు రైతులు తెచ్చిన కందులను అధికారులు త్వరగా కొనుగోలు చేయకపోవడంతోపాటు తేమ శాతం, నాణ్యత కారణంగా ఆలస్యం చేస్తుండటం వ్యాపారులు, దళారులకు కలిసొస్తుంది. వివిధ గ్రామాల నుంచి దూరాభారంతో వస్తున్న రైతులు తేమ శాతం తగ్గే వరకు వేచి చూడకుండా ఎంతో కొంత అనే ధోరణితో క్వింటాల్‌కు రూ.3,500 నుంచి 4,500 వరకు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు, దళారులు కొన్ని రోజుల తర్వాత అధికారులు తిరస్కరించిన కందులను తిరిగి వారితోనే బినామీ రైతుల పేరిట క్వింటాల్‌కు రూ.5,800 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా వ్యాపారులు రెండు నుంచి అయిదు రోజుల వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.1000 నుంచి రూ.1300 వరకు లాభం పొందుతున్నారు. మార్కెటింగ్‌ అధికారులు ఇప్పటికైనా స్పందించి మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు సాగిస్తున్న బినామీదందాకు అడ్డుకట్ట వేసి కంది రైతులకు లబ్దిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

రైతుల పేరుతో దగా..

చిన్న, సన్నకారు రైతులు తీసుకొచ్చిన కందులను మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేయడంలేదు. తేమ ఎక్కువగా ఉందని నిరాకరిస్తున్న కందులను ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇవే కందులను గుట్టచప్పుడు కాకుండా రాత్రిపూట సాగుతున్న దందాలో దొరికిపోకుండా రైతు సరుకుగా నమ్మించేందుకు ఆధారాలన్నీ సమకూర్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతు ఉత్పత్తుల కొనుగోలులో రకరకాల సాకులు చూపి ఇబ్బందులు పెడుతున్న అధికారులు కొందరు అడ్డదారుల్లో అమ్ముకునేందుకు మాత్రం తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఇలా అడ్డగోలు దందా సాగిస్తున్న కొందరు వ్యాపారులు తలాకొంచెం వాటాలు పంచుతూ దందా సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అక్రమదందా ఎన్నాళ్లుగానో సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తుంది. పలు గ్రామాల్లో చిల్లరకాంటాల వ్యాపారులు రైతుల ఇళ్ల వద్ద, కల్లాల్లో తక్కువ ధరకు కందులు కొని జనగామ మార్కెట్‌కు తెచ్చి రైతు పేరిట మద్దతు ధరకు అమ్ముకుంటున్నారని జిల్లా కలెక్టర్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. 


జీరో దందా..

మార్కెట్‌లో విక్రయించిన సరుకు తప్పనిసరిగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో తక్‌పట్టీ ఇవ్వాలి. అసలైన తక్‌పట్టీ రైతుకు ఇచ్చి మిగిలిన రెండు నకలీలలో ఒకటి వ్యాపారి, మరొకటి మార్కెట్‌ అధికారుల వద్ద ఉంచుతారు. దీనివల్ల మార్కెట్‌కు రావాల్సిన పన్ను సమకూరడమే కాకుండా అక్రమాలకు అవకాశం ఉండదు. కానీ, ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకుకు తక్‌పట్టీలను ఇవ్వడంలేదు. వ్యాపారులే తెల్లకాగితంపైన రాసిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన మంత్రి హరీశ్‌రావుకు రైతులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రైతులను తూకంలో కూడా మోసం చేస్తున్నారు. ఎరువుల ఖాళీ సంచుల్లో తీసుకొచ్చిన కందులను కూడా కిలో తరుగు తీస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి సంచి బరువు 150గ్రాముల నుంచి 200గ్రాములు మాత్రమే ఉంటుంది కానీ ఈ సంచిలో 10కిలోలు తీసుకొచ్చినా కిలో తరుగు తీయడంతో రైతులు నష్టపోతున్నారు. 


logo