సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Mar 07, 2020 , 02:26:51

పక్కాగా పశువుల లెక్క..

పక్కాగా పశువుల లెక్క..

పాలకుర్తి రూరల్‌, మార్చి 06: పశువుల లెక్కా ఇక పక్కా కానుంది. ఇక నుంచి పశువులు ఎక్కడ ఉన్నా తెలిసిపోతుంది. పశువులను దొంగిలించిన ఇట్టే దొరికిపోతారు. మనుషులకు ఆధార్‌ సంఖ్య ఉన్నట్లే ప్రభుత్వం పశువులకు 12అంకెలతో ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్టివ్‌ హెల్త్‌(ఇన్నాఫ్‌) గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోంది. ఆవులు గేదెల చెవులకు ఈ 12 అంకెల ట్యాగ్‌ నెంబర్‌ను వేస్తున్నారు. మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా పశు సంవర్థక సిబ్బంది, గోపాలమిత్రలు ఈ ట్యాగ్‌లను వేస్తూ ఆన్‌లైన్‌లో పశువుల వివరాలను సేకరిస్తూ ఆధార్‌ చేస్తున్నారు. గ్రామాల వారీగా ఆవులు, గేదెల వివరాలను సేకరిస్తూ ఆవులు వాటికి ట్యాగ్‌లు బిగిస్తున్నారు. ప్రభుత్వం పాల ఉత్పత్తి వివరాలతో పాటు పశువుల వివరాలను సేకరిస్తూ ఇన్నాఫ్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారీగా పశు సంవర్థక శాఖ మొబైల్‌ యాప్‌లో పశువుల వివరాలు, యజమాని వివరాలు, పశువుల రకం, ఆడ జాతా.. మగజాతా.., వయస్సు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. గతేడాది నవంబర్‌ నుంచి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. ఆవులు గేదెలు ఎవరైన దొంగిలించినా, తప్పిపోయినా ఈ విధానం ద్వారా వెంటనే దొరుకుతాయి. 


పశువుల చెవులకు వేసిన ట్యాగ్‌ల ద్వారా పశువులు ఎవరివి? యజమాని ఎవరు? ఏ గ్రామానికి చెందిన పశువులని వెంటనే తెలుసుకోవచ్చని, వీటితో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే పాలకుర్తి మండలంలో శాతాపురం, ఈరవెన్ను, కొతులబాధ, తొర్రూరు, తిరుమలగిరి గ్రామాలు పూర్తి కాగా, బమ్మెర, లక్ష్మీనారాయణపురం, వావిలాల గ్రామాల్లో పశువులకు ట్యాగ్‌లు వేస్తున్నట్లు పశు వైద్యాధికారులు తెలిపారు. పాలకుర్తితో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇన్నాఫ్‌ కార్యక్రమం నడుస్తున్నట్లు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి మాచర్ల భిక్షపతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2లక్షల 18వేల తెల్ల, నల్ల పశువులు ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 30వేల పశువులకు ట్యాగ్‌లు వేశామని, 40వేల పశువులకు గాలికుంటు టీకాలు వేశామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 92టీంలు ఏర్పాటు చేయడంతో పాటు 44మందికి ఐడీ కార్డులు ఇచ్చామన్నారు. 


ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా గర్భం ఎప్పుడు దాల్చుతోంది? ఏఏ టీకాలు వేయాల్సి ఉంది? పశువులకు సరిపడే దాణా ఎంత అవసరమో కూడా అధికారులకు, ప్రభుత్వానికి తెలుస్తుంది. ట్యాగ్‌ ఆధారంగా భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు సైతం వర్తిస్తాయని అధికారులు తెలుపుతున్నారు. పాడి ఉత్పత్తి కూడా సులభంగా తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. యజమాని ఫోన్‌కు పశు వైద్యాధికారులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు జిల్లాలో ఎన్ని పాడి పశువులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవచ్చనన్నారు. పశువుల ఆరోగ్య సమస్యలు, కృత్రిమ గర్భధారణపై పశువుల యజమానుల ఫోన్‌కు సమాచారం అందుతుంది. గోపాలమిత్రలు పశు వైద్యాధికారుల సూచనల మేరకు రైతు పాడి పశువుల ఆరోగ్యటీకాలు, దాణా విషయాలు తెలుసుకునే వీలుంది. గ్రామాలకు వచ్చే గోపాల మిత్రలు పశు వైద్యాశాఖ సిబ్బందికి రైతులు సహకరించి ఆవులు, గేదెలకు ట్యాగ్‌లతో పాటు గాలికుంటు టీకాలు వేయించాలని పశు వైద్యాధికారులు కోరుతున్నారు. నెట్‌ ప్రాబ్లమ్‌, సిబ్బంది కొరతతో కొంత ఆలస్యమైనా మళ్లీ నమోదు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు.


logo