సోమవారం 30 మార్చి 2020
Jangaon - Mar 06, 2020 , 02:54:59

కొవిడ్‌-19పై అలర్ట్‌

కొవిడ్‌-19పై అలర్ట్‌

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 05 : కరోనా కలకలంతో జిల్లా యంత్రాంగం అలర్ట్‌ అయింది. చైనా నుంచి విజృంభిచిన వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజా జీవనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నది. విదేశాల నుంచి వస్తున్న వారిలో అనుమానితులు ఉండటం ఆందోళన కలిగిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం కూడా అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే శాఖల వారీగా మార్గనిర్దేశాలు జారీ చేస్తూ రద్దీ ప్రాంతాల్లో  కరచాలనం చేయొద్దని..ఒకరుకొకరు నమస్కారం చేసుకొని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నది. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణపై ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఐసోలేషన్‌ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందిని నియమించి, మందులు, మాస్క్‌లను అందుబాటులో ఉం చారు. కరోనా వైరస్‌పై ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురు విద్యార్థులు ముఖాలకు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు హాజరుకాగా, క్షౌరశాలల్లో కూడా క్షురకులు, ప్రజలు మాస్క్‌లు ధరించి కనిపించారు. కాగా, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్‌ సిబ్బందికి డిపో మేనేజర్‌ ధరమ్‌సింగ్‌, జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ పీఆర్‌.సుగుణాకర్‌రాజు మాస్క్‌లు అందజేశారు. 


ఆర్టీసీ బస్టాండ్‌లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టి కుర్చీలు, బస్సు సీట్లు, హాంగింగ్‌రాడ్స్‌ను క్లీన్‌ చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు వైద్య విద్యార్థులు చైనాలో చదువుతుండటం.. జిల్లా కేంద్రంలోని ఒక పట్టుదారం (సిల్క్‌ రీలింగ్‌ యూనిట్‌) మిల్లులో చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటంతో వైద్య ఆరోగ్యశాఖ ఆ దిశగా ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పూజారి రఘు, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, డీఎంహెచ్‌వో మహేందర్‌ ఎప్పటికప్పుడు జిల్లాలో కరోనాపై సమీక్షిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఒక ఫిజీషియన్‌, పల్మనాలజీ, స్టాఫ్‌నర్స్‌, సిబ్బందిని నియమించారు. డ్రగ్స్‌, మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ, రైల్వేస్టేషన్‌ వంటి రద్దీ ప్రాంతాల నుంచే వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఉన్నతాధికారుల సూచనలతో గురువారం విధుల్లోకి వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపో కార్మికులందరికీ మాస్క్‌లను అందజేశారు. బస్సు సీట్లను ప్రత్యేక లిక్విడ్‌తో శుభ్రం చేస్తున్నారు. బస్సుల్లో స్ప్రే చేయడం సహా ప్రయాణీకులు నిల్చున్నప్పుడు పట్టుకునే పైపులను క్లీన్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ముందు జాగ్రత్త కోసమే మాస్క్‌లు పంపిణీ చేస్తున్నామని డిపో మేనేజర్‌ ధరమ్‌సింగ్‌ స్పష్టం చేశారు. 


జిల్లా దవాఖానను సందర్శించిన కేంద్ర బృందం

జిల్లా ప్రభుత్వ దవాఖాను గురువారం కేంద్ర బృందం సందర్శించింది. బృందం ప్రతినిధులు డాక్టర్‌ లక్ష్మణ్‌, డాక్టర్‌ యోగానంద అధ్వర్యంలో దవాఖానలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌ అత్యవసర సేవతో పాటు అసంక్రిమిత వ్యాధుల నిర్ధారణ కేంద్రంలో వైద్య పరీక్షలను పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగా ణ ప్రభుత్వం సర్కారు దవాఖానలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నదని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభు త్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌ఎం స్కీం  ద్వారా అందిస్తున్న వైద్యసేవలు జిల్లా ఆస్పత్రి, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వైద్యసేవలను మరింత మెరుగు పరిచేందుకు అవసరమయ్యే అంశాలపై సమీక్షించారు. వారి వెంట సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పూజారి రఘు, ఆర్‌ఎంవో డాక్టర్‌ పగిడిపాటి సుగుణాకర్‌రాజు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అశోక్‌కుమార్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాము తదితరులు పాల్గొన్నారు.logo