గురువారం 09 ఏప్రిల్ 2020
Jangaon - Mar 05, 2020 , 02:57:44

నేత కార్మికులపై కరోనా వైరస్‌

 నేత కార్మికులపై కరోనా వైరస్‌

లింగాలఘనపురం, మార్చి 4: చేనేత కార్మికులపై కరోనా వైరస్‌ దెబ్బ పడుతోంది. వైరస్‌ కారణంగా విదేశీ ముడిసరుకుల దిగుమతులు నిలిచిపోయాయి. ఈ కారణంగావ్యాపారులు నిల్వ ఉన్న సరుకుల ధరలను విపరీతంగా పెంచారు. ఈ కారణంగా మగ్గాలు నిలిచి పోతున్నాయి. కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నేత కార్మికుల కుటుంబాలు వీధినపడే ప్రమాదం ఉంటుందని నేతకార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

లింగాలఘనపురం మండల కేంద్రంతో పాటు వనపర్తి, వడిచర్ల, నవాబుపేట, నేలపోగుల, కుందారం, కిష్టగూడెం, కొత్తపెల్లి గ్రామాలకు చెందిన నేత కార్మికులు కొత్తపెల్లిలో వెంకటేశ్వర చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 800 కుటుంబాలు నేతవృత్తితో జీవిస్తున్నాయి. వీరికి తోడుగా నెల్లుట్ల, గుమ్మడవెల్లి, సిరిపురం గ్రామాల్లో ఉన్న మరో 300 కుటుంబాలు ఇదే పని చేస్తున్నాయి. ఈ కార్మికులు నేసే పట్టు చీరలను నల్గొండ జిల్లా పోచంపెల్లికి చెందిన పలువురు వర్తకులు కొనుగోలు చేస్తారు. వాటికి తుది మెరుగులు దిద్ది పోచంపెల్లి పట్టుచీరలుగా ఇతర పట్టణాల్లోని వివిధ షోరూంలకు తరలించి లాభాలు గడిస్తుంటారు. మండలంలో కొందరు చిరు వ్యాపారులు నేత కార్మికులకు సరుకునంతా ఇచ్చి చీరకు రూ. 1200 కూలీ చెల్లిస్తుంటారు. 


చీరలకు అవసరమయ్యే యారిన్‌(వెఫ్ట్‌) ఒక కిలోకు రూ. 3 వేలు, వార్పుకు కిలోకు రూ. 4వేలు చెల్లించి కొనుగోలు చేస్తే...8 చీరలు ఉత్పత్తి అయ్యేవి. సొంతంగా నేసే కార్మికులకు ఖర్చులు పోగా నెలకు రూ.15 వేల నుంచి రూ. 18 వేలు గిట్టు బాటు అయ్యేవి. కూలీగా నేసే కార్మికులకు నెలకు రూ. 8 వేల నుంచి, రూ. 10 వేలు ఉపాధి లభ్యమయ్యేది. కాగా, ఈ యారిన్‌, వార్పుతో పాటు కార్మికులు వినియోగించే రంగులు, కొన్ని రసాయనాలు చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేవి. కరోనా వైరస్‌ కారణంగా వీటి దిగుమతులు నిలిచి పోయాయి. ఇదివరకే దిగుమతి అయి, నిల్వ ఉన్న సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. రూ. 3 వేలు ఉన్న యారిన్‌ ధరను రూ.5 వేలకు పెంచారు. రూ. 3800 ఉన్న వార్పు ధరను రూ. 4800కు పెంచారు. ముడి సరకుల ధరలు పెరగడం, ఆ స్థాయిలో చీరలకు ధరలు పెరుగక పోవడంతో సొంతంగా చీరలు నేసే వారికి రూ. 7 వేల నుంచి 9 వేలు కూడా గిట్టుబాటు కావడం లేదు. నేత కూలీలకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు కూడా రావడం లేదు. ముడి సరుకులను కొనుగోలు చేసి కూలీలతో నేయిస్తున్న చిరు వ్యాపారులు నష్టాల పాలవుతున్నారు. ముడి సరుకులు కొనక పోవడంతో పలు మగ్గాలు నిలిచి నేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ముడి సరుకులను సబ్సిడీపై అందించి, చీరలకు ధరలు పెంచాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.


logo