సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Mar 04, 2020 , 02:05:27

కందులతో కళకళ..

కందులతో కళకళ..
  • జనగామ మార్కెట్‌కు భారీగా రాబడులు
  • ఒక్కరోజే రెండు వేల క్వింటాళ్లు
  • చేర్యాల, తిరుమలగిరి మార్కెట్‌కు వెళ్లే రైతులంతా ఇక్కడికే..

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 3 : జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు కందులు పోటెత్తాయి. మంగళవారం ఒక్కరోజే సుమారు 2వేల క్వింటాళ్లకు పైగా వచ్చాయి. ఏ జిల్లాలో పండించిన కందులను అదే జిల్లా పరిధిలోని మార్కెట్‌ యార్డుల్లో రైతులు విక్రయించేలా గతంలో కఠినతరమైన నిబంధనలు ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఆ నిబంధనలను సడలించింది. దీంతో జనగామలోని రెండు కవర్‌షెడ్లు, పాత, కొత్త యార్డులోని కల్లాలన్నీ కందుల రాశులతో కళకళాడాయి. గతంలో దేవరుప్పుల ప్రాంతంలో పండించిన కందులను పొరుగు జిల్లాలోని తిరుమలగిరి మార్కెట్‌కు, బచ్చన్నపేట ప్రాంతంలో పండించిన ఉత్పత్తులు చేర్యాల మార్కెట్‌కు తరలించేవారు. పాత నిబంధనలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా రెవెన్యూ, మార్కెటింగ్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఉన్న రైతుల సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్‌కు కందులు వెల్లువలా వచ్చాయి. గత వానాకాలంలో ఆలస్యంగా వర్షాలు కురవడం, వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేయడంతో కంది, మక్క, వేరుశనగ పంటల సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందులకు క్వింటాల్‌ రూ.3,600 నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతున్నది.


ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని జనగామలో ప్రారంభించి, క్వింటాల్‌కు రూ.5,800 ధర పెడుతున్నది. ప్రస్తుతం రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించే పరిస్థితి లేదు. మార్క్‌ఫెడ్‌కు అమ్మితేనే మద్దతు ధర లభిస్తుండడంతో రైతులు జనగామకు వస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థ 72 మంది రైతుల నుంచి 720 క్వింటాళ్ల కందులను మంగళవారం కొనుగోలు చేసింది. ప్రైవేట్‌ ట్రేడర్లు 106 మంది రైతుల నుంచి 1200 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాల్‌ కందులకు రూ.3700 నుంచి, రూ.4550, రూ.5006 వరకు ధరపెట్టారు. ఒక్కరోజే మొత్తం 2వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. నిన్నటి వరకు జనగామ మార్కెట్‌కు రోజూ సగటున దాదాపు 500 బస్తాలకు పైగా కందులు వచ్చేవి. వాటిలో 60 శాతం మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ఈనెలాఖరు నుంచి మార్చి మొదటి వారంలో కంది ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.


చిరుజల్లులతో పరేషాన్‌..

మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా కురిసిన చిరుజల్లులు జనగామ వ్యవసాయ మార్కెట్‌లో కందిరైతులను పరేషాన్‌ చేసింది. ఒక్కసారి ఆకాశం మేఘావృతమై బట్టతడుపు వాన కురియడంతో రైతులు అందుబాటులో ఉన్న టార్పాలిన్లు, కవర్లు కప్పుకున్నారు. కందులు తడిస్తే మార్క్‌ఫెడ్‌ మాయిశ్చర్‌ సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తుందనే భయంతో రైతులు తడువకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


నాణ్యత ప్రమాణాలు పాటించాలి..

మట్టి, సన్న ఇసుక, తాలు, చెత్త- 2.0శాతం వరకు అనుమతిస్తారు. పొట్టి గింజలు-3, ఇతరత్రా ధాన్యం గింజలు-1.0శాతం పగిలిన పప్పు గింజలు-3, రంధ్రాలు, విరిగిన గింజలు-3, తేమ-12, పక్వానికి రాని నల్లగింజలు, వంకర తిరిగిన గింజలు-3 శాతంతో 12 శాతం తేమ ఉండేట్లు రైతులు కందులు తెచ్చి మద్దతు ధర పొందాలి. రైతులు వీఆర్‌వో, వ్యవసాయ విస్తరణ అధికారి, ఏవో ధ్రువీకరణ పత్రాలతో జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రాల్లో కందులు అమ్ముకోవచ్చు. రైతుల పేరుతో ఎవరైనా దళారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించినా, వారికి సహకరించినా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. రెండు కొనుగోలు కేంద్రాలకు జిల్లా స్థాయి విజిలెన్స్‌ బృందాలను నియమించాం. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రైతులకు డబ్బులు విడుదల చేస్తాం. కందుల రాశిలో దుమ్ము, చెత్త, పొట్టు లేకుండా రైతులు చూసుకోవాలి. కూలీల కొరతతో వరికోత యంత్రాలతో కంది చేను కోయించి నేరుగా కందులను అమ్మకానికి మార్కెట్‌కు తెస్తున్నారు. ప్రధానంగా గింజ పగిలి, పప్పుముక్కలు మేలైన కందుల్లో కలిసిపోతుంటంతో నాణ్యత దెబ్బతింటున్నది. ఇలాంటి వాటిని మార్కెట్‌ఫెడ్‌ కొనుగోలు చేయదు. రైతులు తేమ, తాలు, చెత్త ఉన్న కందులను మార్కెట్‌కు తెచ్చి పడిగాపులు కాయడం, మార్క్‌ఫెడ్‌ తిరస్కరిస్తే యార్డు కల్లంలో ఆరబోసి, ప్యాడీక్లినర్‌ యంత్రంలో శుభ్రం చేయడం చేసే బదులు కోసిన ప్రాంతంలోనే శుభ్రం చేసి తేమ లేకుండా మార్కెట్‌కు తెస్తే నేరుగా నాఫెడ్‌ ద్వారా క్వింటాల్‌కు రూ.5,800ధరకు అమ్ముకునే వీలుంటుంది. 

 -మహేశ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌logo