శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Mar 03, 2020 , 02:54:53

ఫొటో జర్నలిస్ట్‌ దారుణ హత్య

ఫొటో జర్నలిస్ట్‌ దారుణ హత్య

గోవిందరావుపేట, మార్చి 2 : ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించమన్నందుకు అప్పు తీసుకున్న దయలేని మనిషి కౄరత్వం ప్రదర్శించాడు. మధ్యవర్తిగా వచ్చిన ఫొటో జర్నలిస్టుపై దాడి చేసి మెడపై కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా నరికి హత్య చేసిన సంఘటన మండలంలోని పస్రా గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ దారుణ హత్యతో పస్రా గ్రామంతో పాటు ములుగు జిల్లా ఒక్క సారిగా ఉల్లిక్కిపడింది. ఇంతటి దారుణం మొదటిసారి చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి పస్రాలోని బెంగళూరు బేకరీ యజమాని దయాకు రూ.ఆరు లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు చెల్లించాలని పలు మార్లు కోరినా దయా సమాధానం ఇవ్వకపోవడంతో సోమవారం దేవేందర్‌రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్‌, వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ కోశాధికారి సునీల్‌రెడ్డిని పస్రాకు తీసుకువచ్చాడు. దయా దగ్గరకు వెళ్లి తాను అప్పు ఇచ్చిన డబ్బులు చెల్లించాలని కోరగా తనకు పస్రా గ్రామానికి చెందిన వెంకన్న అనే చిట్టి వ్యాపారి డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో దయాతో పాటు సునీల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి కలిసి వెళ్లారు. తాను చిట్టి డబ్బులు కొన్ని దయాకు ఇచ్చానని, ఇంకా ఉన్న బకాయి డబ్బులు బిడ్డ పెళ్లి అనంతరం ఇస్తానని వెంకన్న సమాధానం చెప్పడంతో ఈ ముగ్గురు తిరిగి బేకరికి వచ్చాడు. ఈ క్రమంలో బేకరీలో దేవేందర్‌రెడ్డి దయా మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్క సారిగా దయా దేవేందర్‌రెడ్డిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం బేకరి ముందు ఉన్న సునీల్‌రెడ్డిని దయా మాట్లాడుదామని కిరాయి ఉంటున్న ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు. కాగా ఈ ప్రమాదంలో సునీల్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా దేవేందర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ములుగు ఏఎస్పీ సాయిచైతన్య సందర్శించి పూర్తి వివరాలను సేకరించారు. హత్య జరిగిన స్థలంతో పాటు దేవేందర్‌పై దాడి జరిగిన స్థలాన్ని ఏఎస్పీ సాయిచైతన్య పరిశీలించారు. హత్య జరిగిన సంఘటనను పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌, ఎస్సై మహేందర్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. హత్యకు ప్రధాన సూత్రదారి దయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. విచారణ అనంతరం హత్య తీరును, నిందితుల వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. logo