బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Mar 01, 2020 , 03:07:51

పట్టణాలు అద్దంలా మెరవాలి

పట్టణాలు అద్దంలా మెరవాలి

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 29: పట్టణాలు అద్దంలా మెరవాలి.. వార్డుల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలి.. ప్రజలకు మౌలిక వసతులు ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 10 రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారం ఆరో రోజుకు చేరింది. ఈ సందర్భంగా జనగామ పట్టణంలో వాడవాడలా జిల్లా అధికార యంత్రాంగం ప్రగతిబాట పర్యటన చేపట్టింది. 23వ వార్డులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. 10, 11, 12, 30వ వార్డులో పారిశుద్ధ్యం, ఖాళీ పాట్లు, స్థలాల్లో చెత్తాచెదారంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించారు. కలెక్టర్‌ కే నిఖిల స్థానిక వార్డు కౌన్సిలర్లు పాక రమ, చందర్‌, గుర్రం భూలక్ష్మి, చంద్రకళ, బొట్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కాలనీల్లో విస్తృతంగా పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. చిన్నచిన్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కరించారు. కొద్దిపాటి నిధులతో కూడిన పనులను త్వరగా చేయాలని ఆదేశాలిచ్చారు. ఎక్కువ నిధులు అవసరం ఉన్న వాటిని ఏడాది, ఐదేళ్ల ప్రణాళికలో ప్రతిపాదించాలని సూచిస్తూ జిల్లా అదనపు కలెక్టర్‌ ఓజే మధు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్యతో కలిసి కలెక్టర్‌ వార్డుల్లో గల్లీగల్లీ కలియదిరిగి పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వారికి ట్రీగార్డులు అమర్చారు. 26వ వార్డులో కౌన్సిలర్‌ మహాంకాళి హరిశ్చంద్రగుప్తా ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవో రమేశ్‌, ప్రత్యేక అధికారి జితేందర్‌రెడ్డి, ఆర్పీ నాగమణి, లగిశెట్టి వీరలింగం, ఎర్రం ప్రసాద్‌, కిశోర్‌తో కలిసి కూరగాయలు, నాన్‌వెజ్‌ మార్కెట్‌ ప్రాంతం, వ్యాపార, వాణిజ్య సమూదాయాల ఎదుట పారిశుద్ధ్యం, చెత్త సేకరణ వంటి అంశాలను పరిశీలించారు. 3వ వార్డులో కౌన్సిలర్‌ డాక్టర్‌ సుధాసుగుణాకర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి రోడ్లను ఊడ్చి శ్రమదానం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌ యాదవ్‌ పాల్గొని పలు కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. మిగతా వార్డులోనూ పట్టణ ప్రగతి పనులు కొనసాగాయి.


జనగామను ఆదర్శంగా మారుద్దాం : కలెక్టర్‌

పట్టణప్రగతిలో భాగంగా జనగామను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని కలెక్టర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. స్పెషల్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నాలుగు కమిటీల బృందం ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని వార్డులో సమస్యలను గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని, అధికారుల పనితీరుపై తాను ప్రతీరోజు సమీక్షిస్తానని చెప్పారు. పల్లె ప్రగతిలో గ్రా మాల రూపురేఖలు మారినట్లే పట్టణ ప్రగతి ద్వారా వార్డుల్లోని కాలనీల ముఖచిత్రం మారాలన్నారు. ప్రతి సమస్యను గుర్తించి పరిష్కారం కోసం నివేదించాలన్నారు.


logo
>>>>>>