శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 29, 2020 , 02:24:31

ప్రగతి జోరు..

ప్రగతి జోరు..

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 28 : పట్టణ ప్రగతి కార్యక్రమం ఐదోరోజు జనగామలో ముమ్మరంగా కొనసాగింది. వార్డుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలు గుర్తిస్తూ పరిష్కరిస్తున్నారు. చెత్తలేకుండా శుభ్రం చేయడంతోపాటు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుతున్నారు. ప్రజలు కూడా తమవంతుగా భాగస్వాములవుతున్నారు. కాలనీల్లో మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, అభివృద్ధి కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో పనులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో కలెక్టర్‌ కే నిఖిల విస్తృతంగా పర్యటించారు. 3, 7, 8, 9, 10వ వార్డులో కౌన్సిలర్లు డాక్టర్‌ సుధాసుగుణాకర్‌రాజు, మల్లవరం అరవింద్‌రెడ్డి, తాళ్ల సురేశ్‌రెడ్డి, ముస్త్యాల చందర్‌, నీల శ్రీజ రాంమనోహర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

 3వ వార్డులో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవోలు మధుమోహన్‌, రమేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌యాదవ్‌, స్వరూపరాణి, అంజాజీ కాలనీల్లో పర్యటించి పారిశుద్ద్య పనులు, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలను తొలగించారు. 


7వ వార్డులో జిల్లా కలెక్టర్‌ మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేయగా, 8వ వార్డులోని హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద ఖాళీస్థలాలను పరిశీలించి యజమానులకు నోటీసులు ఇచ్చి జరిమానా విధించాలని ఆదేశించారు. పలు కాలనీల్లో శ్మశానవాటిక, రోడ్డుపై చెత్త వేస్తున్న డంపింగ్‌ ప్రాంతాలను ఆమె సందర్శించారు. వార్డు కౌన్సిలర్లు, అభివృద్ధి కమిటీల చొరవతో కాలనీలను పరిశుభ్రం చేసుకొని జనగామ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామని, ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని  పిలుపునిచ్చారు. అదేవిధంగా మిగిలిన అన్ని వార్డుల్లో వాడవాడలా అధికారులు, ప్రజాప్రతినిధుల పాదయాత్ర పరిశీలనతో కాలనీల్లో ప్రగతి పండుగ సందడి నెలకొన్నది.. పల్లె ప్రగతి సక్సెస్‌ స్ఫూర్తితో పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సర్కారు ఆశయానికి ప్రజలంతా స్వచ్ఛందంగా సంపూర్ణ మద్ధతు ఇస్తున్నారు. ఏడాది, ఐదేళ్ల ప్రణాళిక లక్ష్యాన్ని ప్రజలకు వివరిస్తూ..అవసరాలను గుర్తిస్తూ ఉత్సాహంగా ముందుకుసాగుతున్నారు.logo