ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 29, 2020 , 02:22:54

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 28 : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మార్చి 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. అందులో జనగామ పట్టణంలో తొమ్మిది, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, జఫర్‌ఘడ్‌, కొడకండ్ల, దేవరుప్పుల, నర్మెట మండలాల్లో మరో తొమ్మిది కేంద్రాల చొప్పున ఏర్పాటు చేశారు. మొదటి, రెండో సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులతో కలిపి మొత్తం 12,616 మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఇందులో 5,610 మంది మొదటి సంవత్సరం, 7,004 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు ఉన్నారు. మొదటి సంవత్సరం జనరల్‌ 3,906, వొకేషనల్‌ 1,704, రెండోసంవత్సరం జనరల్‌ 5,430, వొకేషనల్‌ 1,574లో పరీక్షలు రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు జనరల్‌ 2,117, ప్రైవేట్‌లో 1,789 మంది, వొకేషనల్‌ ప్రభుత్వ 708, ప్రైవేట్‌ 996 మంది, రెండో సంవత్సరం జనరల్‌ ప్రభుత్వ 2065, ప్రైవేట్‌ 3,365 మంది, వొకేషనల్‌ ప్రభుత్వ 512, ప్రైవేట్‌ 1,064మంది విద్యార్థులు ఉన్నారు. 


జిల్లాలో ఒక జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఏఎస్సై బృందంతో కూడిన ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందం ఏ పరీక్ష కేంద్రాన్నయినా ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. అదేవిధంగా 18 మంది సిట్టింగ్‌ స్వాడ్లు సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు చేస్తారు. 18 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు(చీఫ్‌ సూపరింటెండెంట్లు), ఆరుగురు అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్లు మొత్తం 42మంది పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు చేరాయి. ప్రతిరోజు సబ్జెక్టుల వారీగా ఇంటర్‌ పరీక్ష పత్రాలు ఏ, బీ, సీగా మూడుసెట్ల ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉంచి ప్రతిరోజు పరీక్ష సమయానికి ముందు ఉదయం 6.45 గంటలకు టీవీ, రేడియో, పోలీస్‌ వైర్‌లెస్‌ సెట్‌ మెసేజ్‌ ద్వారా ప్రకటించే సెట్‌ను మాత్రమే విద్యార్థులకు అందజేస్తారు. 


పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకునేందుకు ఈసారి ప్రత్యేకంగా సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ను రూపొందించారు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సాంకేతిక సమాచార సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈసారి ఫస్టియర్‌ పరీక్షలో 24 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత అదనపు జవాబు పత్రాలు ఇచ్చే విధానాన్ని తొలగించారు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఇంటర్మీడియట్‌ విద్యామండలి స్పష్టం చేసింది. ఉదయం 8.30 నుంచి 8.45 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల లోపలికి అనుమతించి జవాబు పత్రం, ఓఎంఆర్‌ షీట్‌ను అందిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రంలోని ప్రశ్నాపత్రాలు సీలు తీసి, తిరిగి జవాబుపత్రాలు సీలు వేసే ఒక గదిలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం రికార్డు చేస్తారు. ఈసారి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదని అధికారులు తెలిపారు. 


ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు కొన్నిచోట్ల యజమాన్యాలు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వైబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ప్రిన్సిపాల్‌ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తారు. హాల్‌టికెట్లను శుక్రవారం నుంచి కళాశాలల్లో లేదా ఆన్‌లైన్‌లో www.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌ ద్వారా తీసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. 


ఇలా చేయండి..

విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకవోజు ముందుగానే వెళ్లి తెలుసుకుంటే పరీక్ష రోజున ఏలాంటి ఇబ్బంది ఉండదు. పరీక్ష జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల్లోపు కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష రాయడానికి అవసరమైన ప్యాడ్‌, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్‌ వంటివి వెంట తీసుకువెళ్లాలి. విద్యార్థులకు కేటాయించిన స్థలంలో అరగంట ముందుగా వెళ్లి కూర్చోవాలి.


ఇలా చేయొద్దు..

విద్యార్థులు హాల్‌టికెట్‌ తప్ప ఎలాంటి కాగితాలు వెంట తీసుకెళ్లకూడదు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకువెళ్లకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబు పత్రాలను పరీక్ష కేంద్రం నుంచి బయటకు తీసుకువెళ్ల కూడదు. ప్రవేశ పత్రం నంబర్‌ను ప్రధాన జవాబు పుస్తకం, బిట్‌ పేపర్‌, మ్యాప్‌, గ్రాఫ్‌లపై ఎక్కడా రాయకూడదు. విద్యార్థి పేరు, సంతకం, గుర్తింపు చిహ్నం, స్లోగన్‌, దేవుడి నామాలు జవాబు పత్రాలపై రాయకూడదు.


logo