సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Feb 27, 2020 , 03:19:41

మేడారం హుండీల ఆదాయం రూ. 11,64,61,774

మేడారం హుండీల ఆదాయం రూ. 11,64,61,774

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 13 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ను బుధవారం పూర్తిచేశారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపంలో బుధవారం లెక్కించిన నాణేల ద్వారా రూ. 13,09,702,  మిగిలిన నోట్ల లెక్కింపు ద్వారా రూ.86,150 ఆదాయం సమకూరినట్లు మేడారం ఆలయ కార్యనిర్వహణాధికారి తమ్మ రాజేంద్రం తెలిపారు. దీంతో మేడారం జాతరలో ఏర్పాటుచేసిన మొత్తం 502 హుండీల్లోని నోట్లు, నాణేల ద్వారా రూ. 11,64,61,774 ఆదాయం వచ్చింది. ప్రత్యేధికారుల సమక్షంలో ఆభరణాలను తూకం వేయగా బంగారం 1కేజీ 63గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి 53కేజీల 450గ్రాములు వచ్చినట్లు ఈవో తెలిపారు. జాతరలో ప్రారంభ సమయానికి 494 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర ముగిశాక జరిగే తిరుగువారం జాతరలో మరో 8 హుండీలను ఏర్పాటుచేశారు. దాంతో మొత్తం జాతరలో ఏర్పాటుచేసిన హుండీల సంఖ్య 502కు చేరింది. భక్తులు సమర్పించుకున్న కానుకల్లో కేవలం నోట్ల లెక్కింపే తొమ్మిది రోజుల పాటు సాగింది. నోట్ల లెక్కింపు ద్వారా రూ.11,17,99,885 ఆదాయం సమకూరింది. భక్తులు వనదేవతలకు సమర్పించుకున్న ఒడిబియ్యం నుంచి వేరుచేసిన నాణేలు, చివరిగా మిగిలిన నోట్ల ద్వారా మొత్తంగా రూ.46,61,889 ఆదాయం లభించింది. మేడారం హుండీ లెక్కింపు ఈనెల 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు నరసింహ, సునీత, రాజేంద్రం, మేడారం ఆలయ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, ధర్మకర్తలు అట్టం నాగరాజు, పోదెం శోభన్‌, చిలుకమర్రి రాజేందర్‌, చెన్న విజయ్‌కుమార్‌, వాసం రజని, కుమారస్వామి, కత్తి లక్ష్మయ్య, పోరిక కస్నానాయక్‌, పూజారి చంద గణేశ్‌ సమక్షంలో దాదాపు 15రోజుల పాటు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు ప్రక్రియం కొనసాగింది. దాదాపు 300మంది లెక్కింపులో పాల్గొ న్నారు. ఇందులో వివిధ సేవాసంస్థలు, ట్రస్టులు, భక్తమండళ్ల బృందాలు, వివిధ కళాశాలల నుంచి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, వలంటీర్ల ఉన్నారు.

భారీగా వచ్చిన విదేశీ కరెన్సీ

హుండీల్లో విదేశీ కరెన్సీ నోట్లు, నాణేలు భారీగా లభ్యమయ్యాయి. వివిధ దేశాలకు చెందిన కరెన్సీని అధికారులు గుర్తించే ప్రక్రియలో ఉన్నా రు. వాటి విలువను అధికారులు ఇంకా ప్రకటించలేదు. వాటి విలువను లెక్కించేందుకు మరికొంత సమయం పడుతుందని ఈవో తెలిపారు. 

గతంలో కంటే పెరిగిన ఆదాయం

2018 సంవత్సరంలో జరిగిన మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా రూ.10కోట్ల 70లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది 11కోట్ల 64లక్షల ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు కోటి రూపాయల ఆదాయం ఎక్కువగా వచ్చింది. 


logo