బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 26, 2020 , 03:30:49

ఫలించిన టీఆర్‌ఎస్‌ వ్యూహం

ఫలించిన టీఆర్‌ఎస్‌ వ్యూహం

(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : వరంగల్‌ సహకార ఎన్నికల చరిత్రలో టీఆర్‌ఎస్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌ (డీసీసీబీ), డీసీఎంఎస్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జయపతాకను ఎగురవేసింది. డీసీసీ బ్యాంక్‌ చరిత్రలో తొట్టతొలిసారి 17 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓడీసీఎంలో సైతం అదే చరిత్ర. మంగళవారం హన్మకొండలోని కాళోజీ సెంటర్‌లో డీసీసీబీ కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కోలాహలంగా మారింది. పక్కనే ఉన్న హరిత కాకతీయ హోటల్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లతో చర్చలు జరిపి, ఏకాంగీకారంతో డీసీసీబీ డైరెక్టర్లను ఎంపిక చేసి వారిచేత నామినేషన్లు వేయించారు. మరోవైపు వరంగల్‌ కేంద్ర కారాగారారం ఎదురుగా ఉన్న కల్పలత సూపర్‌బజార్‌ ప్రాంగణంలో డీసీఎంఎస్‌ నామినేషన్ల ప్రక్రియ ఇంతే సజావుగా జరిగింది. 

డీసీసీబీలో 20కి 17 మంది డైరెక్టర్ల ఏకగ్రీవం  

వరంగల్‌ సహకార కేంద్ర బ్యాంక్‌ (డీసీసీబీ)లో మొత్తం 20 మంది డైరెక్టర్లకు గాను మంగళవారం 17 మంది డైరెక్టర్ల కోసం సింగిల్‌ నామినేషన్లు దాఖలు కావడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నిక  అయ్యారు. గ్రూప్‌ -ఏ కేటగిరీ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ల ప్రతినిధులుగా) మొత్తం 16 మంది డైరెక్టర్లు, వ్యవసాయేతర సహకార సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లు గ్రూప్‌-బీ కేటగిరిగా సహకార ఎన్నికల రిజిస్ట్రార్‌ నోటిఫై చేశారు. ఇందులో గ్రూప్‌-ఏ కేటగిరిలో ఎస్సీ సామాజిక వర్గానికి మూడు డైరెక్టర్‌ స్థానాలు కాగా, ఇంందులో కేవలం ఒక్కరు మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. అంటే ఈ వర్గానికి చెందిన రెండు డైరెక్టర్‌ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక గ్రూప్‌ -బీ కేటగిరిలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒక డైరెక్టర్‌ కావాల్సి ఉంది. అయితే ఈ వర్గం నుంచి ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఈ స్థానం ఖాళీ ఏర్పడింది. అంటే మొత్తంగా 20 మంది డైరెక్టర్లకు గాను 17 మంది డైరెక్టర్లు నామినేషన్లు దాఖలు చేయడం, అవన్నీ సింగిల్‌ నామినేషన్లే కావడంతో ఏకగ్రీవం అయ్యాయి. 

 డీసీఎంఎస్‌లోనూ ఏడూ ఏకగ్రీవమే..

డీసీఎంఎస్‌ పీఠంపైనా తొలిసారిగా గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ మొత్తం 10 మంది డైరెక్టర్లకు గాను ఏడుగురు డైరెక్టర్ల కోసం సింగిల్‌ నామినేషన్లు దాఖలు కావడం, మిగితా మూడు డైరెక్టర్ల స్థానాలకు సరియైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ మూడు స్థానాల విషయంలో రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌ తీసుకునే నిర్ణయం ఆధారంగా ఎన్నిక విధానం ఎలా ఉంటుంది? అనేది తేలుతుంది. అయితే మంగళవారం ఏడు సింగిల్‌ నామినేషన్లే దాఖలు కావడంతో అవన్నీ ఏకగ్రీవం అయ్యాయి. గ్రూప్‌-ఏ కేటగిరి కింద ఆరు స్థానాలు ఉండగా ఎస్సీ జనరల్‌ డైరెక్టర్‌ స్థానానికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. అదే విధంగా గ్రూప్‌-బీలో నాలుగు స్థానాలకు గాను ఎస్సీ జనరల్‌ ఒక స్థానం, మరొకటి ఓసీ జనరల్‌ ఒక స్థానం ఈ రెండు స్థానాలకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. మొత్తంగా అటు డీసీసీబీ కానీ, ఇటు డీసీఎంఎస్‌ కానీ రెండు చోట్లా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసింది.  

అన్ని జిల్లాలకు సమప్రాతినిధ్యం..

వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థగా డీసీసీబీ ఉంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్‌) ఉండగా మహబూబాబాద్‌ జిల్లాలోని మల్యాల ప్యాక్‌కు ఎన్నికలు నిర్వహించలేదు (ఈ సంఘానికి ఇంకా గడువున్న నేపథ్యంలో). ఎన్నికలు జరిగిన 90 ప్యాక్స్‌ నుంచి 16 మంది డైరెక్టర్లు డీసీసీబీకి ప్రాతినిధ్యం వహించాలి. జిల్లాల పునిర్వభజన నేపథ్యం, ప్రతీ జిల్లా నుంచి ఆయా సంఘాల పరిధి, ప్రాధాన్యత, రిజర్వేషన్‌ మొదలైన అంశాల ప్రాతిపదికగా డైరెక్టర్లను తీసుకోవాలి. ఈ విషయంలో మంత్రులు అనుసరించిన విధానం, పార్టీ ఆదేశం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకొని అన్ని జిల్లాలకు సమభాగస్వామ్యం కల్పించడంతో అన్ని జిల్లాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి ఇద్దరు డైరెక్టర్లు (నందనం నుంచి మార్నేని రవీందర్‌రావు, ధర్మసాగర్‌ నుంచి గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి), వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి నలుగురు డైరెక్టర్లు (మొగిలిచర్ల నుంచి దొంగల రమేశ్‌, నల్లబెల్లి నుంచి చెట్టుపల్లి మురళీధర్‌, పెంచికలపేట నుంచి కంది శ్రీనివాస్‌రెడ్డి, సంగెం నుంచి సపావత్‌ కిషన్‌నాయక్‌), జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా నుంచి ఒకరు (మొగుళ్లపల్లి నుంచి సంపెల్లి నర్సింగరావు), ములుగు జిల్లా నుంచి ఇద్దరు డైరెక్టర్లు (నర్సాపూర్‌ నుంచి మాడుగుల రమేశ్‌, లక్ష్మీదేవిపేట నుంచి ఎర్రబెల్లి ఉపేందర్‌రావు), మహబూబాబాద్‌ నుంచి ముగ్గురు (మరిపెడ నుంచి చాపల యాదగిరిరెడ్డి, తొర్రూర్‌ నుంచి కక్కిరాల హరిప్రసాద్‌, మహబూబాబాద్‌ నుంచి నాయిని రంజిత్‌) డైరెక్టర్లు, జనగామ నుంచి ఇద్దరు (నర్మెట నుంచి కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, కొడకండ్ల నుంచి కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి) డైరెక్టర్లుగా ఇలా మంగళవారం 14 మంది డైరెక్టర్‌ స్థానాల కోసం సింగిల్‌ నామినేషన్‌ వేసేలా మంత్రులు అనుసరించిన వ్యూహం ఫలించడం విశేషం. అదేవిధంగా ఓడీసీఎంఎస్‌లో సైతం ఇదే సమతూకాన్ని పాటించడం వల్ల అన్ని జిల్లాలకు సమభాగస్వామ్యం లభించినట్టు అయింది. 

ప్రహసనానికి చరమగీతం...

నిజానికి డీసీసీబీ ఎన్నికలంటే రాజకీయాలకు, గ్రూపు తగాదాలకు నెలవుగా మారిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చివరి దాకా ఉత్కంఠలు, పోలీసుల రంగ ప్రవేశం, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడం వంటి పరిణామాలు చోటుచేసుకునేది. ఎన్నికలు జరిగే క్షణంలో వ్యక్తులు మారిపోయే వాతారవణం, సినీఫక్కీలో రాజకీయ పితలాటకం వంటి, ఫ్యాక్షన్‌ తరహా దృశ్యాలు ఏమీ లేకుండా పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా, అధినేత ఆదేశమే ఆజ్ఞగా డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం చేయడంతో ఆపాత క్రూర ఆకృత్య రాజకీయాలకు చెరమగీతం పాడినట్టు అయిందనే చర్చ ఆసక్తిగా సాగింది.  logo
>>>>>>