బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 26, 2020 , 03:28:24

ఎల్లమ్మ పండుగకు వెళ్తూ..

ఎల్లమ్మ పండుగకు వెళ్తూ..

రాయపర్తి, ఫిబ్రవరి 25 : ఎల్లమ్మ పండుగకు వస్తూ దంపతులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన మండలంలోని తిర్మలాయపల్లి గ్రామ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలంలోని రాంనగర్‌ గ్రామానికి చెందిన బొమ్మకంటి రాజు (40), అతడి భార్య బొమ్మకంటి రాణి (35)తోపాటు రాణి చెల్లెలు జిట్టబోయిన కవిత (కరీమాబాద్‌ ఉర్సు బొడ్రాయి నివాసి) ద్విచక్ర వాహనంపై రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో తమ బంధువు జిట్టబోయిన కుమార్‌ ఇంట్లో జరుగుతున్న ఎల్లమ్మ పండుగకు వస్తున్నారు. వర్ధన్నపేట పట్టణం మీదుగా తిర్మలాయపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి కొండూరుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో బొమ్మకంటి రాజు తన ద్విచక్ర వాహనాన్ని ముందు వెళ్తున్న మరో గూడ్స్‌ వాహనాన్ని (ఆశోక లేలాండ్‌) ఓవర్‌ టేక్‌ చేసేందుకు యత్నించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జనగామ జిల్లా పాలకుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బానోతు రమేశ్‌నాయక్‌ తన వాహనంలో ఇదే రోడ్డులో వర్ధన్నపేటకు వస్తున్నారు. తిరుమలాయపల్లి శివారులో బొమ్మకంటి రాజు తన ద్విచక్రవాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పి తమ ముందున్న గూడ్స్‌ వాహనానికి తగిలింది. దీంతో ఎదురుగా వస్తున్న పోలీస్‌ వాహనం ముందు ద్విచక్రవాహనం పడిపోయినట్లు వివరించారు. ఊహించని ప్రమాదానికి పోలీస్‌ వాహనం డ్రైవర్‌ బ్రేకులు వేసినా.. కొంత మేర ద్విచక్ర వాహనంపై ఉన్న ముగ్గురిని బండి లాక్కొని వచ్చింది. ఈ ఘటనలో రాజు, రాణి అక్కడికక్కడే మృతి చెందారు. కవిత పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించినట్లు ఏసీపీ వివరించారు. మృతదేహాలను వర్ధన్నపేటలోని మార్చూరీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులు రాజు, రాణి దంపతులకు 14 ఏళ్ల కూతురు రక్షిత, 8 ఏళ్ల కుమారుడు శశాంత్‌ ఉన్నారు. 

ప్రమాదతీరుపై పలు అనుమానాలు

 తిర్మలాయపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో పోలీస్‌ వాహనం, ద్విచక్ర వాహనం, మరో ప్రైవేట్‌ గూడ్స్‌ వాహనాలు సంఘటన స్థలిలోనే ఉన్నట్లు చెబుతుండడం, గూడ్స్‌ వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలోనే ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైందంటూ పోలీసులు పేర్కొంటున్నారు. మృతుల బంధువులు, స్థానికులు మాత్రం ప్రమాదం జరిగిన తీరుపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రమాదానికి  గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


logo
>>>>>>