గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 26, 2020 , 03:20:03

17మంది డైరెక్టర్లు ఏకగ్రీవం

17మంది డైరెక్టర్లు ఏకగ్రీవం

సుబేదారి, ఫిబ్రవరి 25: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) పాలకమండలి ఎన్నికల నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. హన్మకొండ అదాలత్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయంలో మంగళవారం ఉదయం 8గంటలనుంచి మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారి మద్దిలేటి నామినేషన్ల పత్రాలను స్వీకరించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 3:30 వరకు నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 5గంటలకు ఉపసంహరణ పక్రియ ముగిసింది. డీసీసీబీ పాలకవర్గంలో మొత్తం 20 మంది డైరెక్టర్‌ పోస్టులకు కేటగిరి ఏ-లో 16 డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వాటిలో ఎస్సీ రిజర్వేషన్‌ 3, ఎస్టీ రిజర్వేషన్‌ ఒకటి, బీసీ రెండు, మిగిలిన 10 డైరెక్టర్‌ పోస్టులు జనరల్‌. క్యాటగిరి బీ-లో 4 డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, బీసీ ఒకటి, జనరల్‌ ఒకటి కేటాయించారు. ఈ స్థానాలకు నామినేషన్ల దాఖలైనవి. డీసీసీబీ మొత్తం 20 డైరెక్టర్‌ పోస్టులను రెండు విభాలుగా కేటగిరి ఏ. కేటగిరి- బీగా విభజించారు. కేటగిరీ ఏ-లో 16 డైరెక్టర్‌ పోస్టులు ఉండగా వీటికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 90మంది ప్రాథమిక వ్యవసాయసహకార సంఘాల చైర్మన్లు పోటీ చేయవచ్చు. కేటగిరీ బీ-లో 4 డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వీటికి వ్యవసాయేతర సంఘాలు మత్య్స, గొర్రెలు మేకలు పెంపక సంఘాలు, చేనేత సంఘాలు, ఇతర పొదుపు సంఘాలు డీసీసీబీలో వాటాధనం కలిగిన 22 సంఘాల చైర్మన్లు పోటీ చేయడానికి అర్హులు. 

కేటగిరి- ఏ లో 16డైరెక్టర్లకు 17 నామినేషన్లు

కేటగిరీ ఏ-16 డైరెక్టర్లకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎర్రబెల్లి గోపాల్‌రావు, మాడుగుల రమేశ్‌, సపావత్‌ కిషన్‌నాయక్‌, నాయని రంజిత్‌, కంది శ్రీనివాస్‌రెడ్డి, కుందురు వెంకటేశ్వర్‌రెడ్డి, కేసిరెడ్డి ఉపందర్‌రెడ్డి, చాపల యాదగిరిరెడ్డి, సంపల్లి నరసింహారావు , దొంగల రమేశ్‌, కక్కిరాల హరిప్రసాద్‌ ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మార్నే రవీందర్‌రావు, చెట్టుపల్లి మురళీధర్‌ రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. వీరిద్దరి నామినేషన్ల పరిశీలనలో ఒక్కొక్క నామినేషన్‌ను మాత్రమే ఎన్నికల అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. పరకాల పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండెబోయిన నాగయ్య ఓడీసీఎంఎస్‌ డైరెక్టర్‌ నామినేషన్‌ పత్రాలను డీసీసీబీ కార్యాలయంలో దాఖలు చేయడంతో ఆయన నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి డీసీసీబీ ఎన్నికల నిబంధలనకు విరుద్ధంగా ఉన్నందున తిరస్కరించారు. 

14మంది డైరెక్టర్లు ఏకగ్రీవం

క్యాటగిరి ఏ- 16 డైరెక్టర్ల పోస్టులకు దాఖలైన 17 నామినేషన్లలో ఇద్దరు మార్నేని రవీందర్‌రావు, చెట్టు మురళీధర్‌ రెండు సెట్లు నామినేషన్‌వేయడంతో ఒక్కొక్క నామినేషన్‌ను మాత్రమే పరిగణిలోకి తీసుకున్నారు. గుండెబోయిన నాగయ్య నామినేషన్‌ రద్దు కావడంతో సింగిల్‌గా దాఖలైన 14మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారి మద్దిలేటి సాయంత్రం 5గంటల తర్వాత పరిశీలించి, డైరెక్టర్‌ పదవులకు ఆమోదం తెలుపుతూ, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన 14 మంది డైరెక్టర్లు మాడుగుల రమేశ్‌(ఎస్సీ) సపావత్‌ కిషన్‌నాయక్‌ (ఎస్టీ), దొంగల రమేశ్‌(బీసీ), నాయని రంజిత్‌(బీసీ), జనరల్‌ నుంచి ఎర్రబెల్లి గోపాల్‌రావు, కక్కిరాల హరిప్రసాద్‌రావు, కంది శ్రీనివాస్‌రెడ్డి, కుందురు వెంకటేశ్వర్‌రెడ్డి, కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, చాపల యాదగిరిరెడ్డి, చెట్టుపల్లి మురళీధర్‌, మార్నేని రవీందర్‌రావు, సంపెల్లి నరసింహారావు. 

రెండు ఎస్సీ డైరెక్టర్‌ పోస్టులు ఖాళీ

కాటగిరి-ఏలో 3 డైరెక్టర్‌ పోస్టులను ఎస్సీలకు కేటాయించారు. అయితే, మూడు పోస్టులకుగాను ఒక్కరు మాత్రమే నామినేషన్‌ దాఖలుచేశారు. మిగిలిన రెండు స్థానాలకు నామినేషన్లు రాకపోవండతో ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 

కేటగిరి-బీలో 3నామినేషన్లు

కేటగిరి బీ-లో 4 డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వాటికి ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్సీ నుంచి పోలేపాక రమేశ్‌, బీసీ నుంచి ఎలుగుల రవిరాజు, జనరల్‌ నుంచి టీజీవో అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు నామినేషన్‌ వేయడంతో వారిని ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ప్రకటించారు. ఎస్టీ డైరెక్టర్‌ పోస్టుకు నామినేషన్‌ దాఖలుకాకపోవడంతో ఆ స్థానం ఖాళీగానే ఉంది. 

మొత్తం 20మంది డైరెక్టర్లకు గాను..

డీసీసీబీ పాలకమండలి కేటగిరి ఏ-, కేటగిరి-బీ నుంచి మొత్తం 20మంది డైరెక్టర్లకుగాను 17మంది అభ్యర్థులు సింగిల్‌గా నామినేషన్‌వేయడంతో 17మందిని ఎన్నికల అధికారి మద్దిలేటి ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారులుగా పుల్లారావు, వెంకటేశ్వరావు, విజయభాస్కర్‌ వ్యవహరిస్తున్నారు. ప్రధాన ఎన్నికల అధికారిగా మద్దిలేటి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ,17మందిని ఏకగ్రీవంగా డైరెక్టర్లుగా ప్రకటించే బాధ్యతలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగింది.


logo