ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 25, 2020 , 03:46:51

నిండుకుండలా సింగరాయ చెరువు

నిండుకుండలా సింగరాయ చెరువు

దేవరుప్పుల, ఫిబ్రవరి 24 : మండలంలోనే పెద్ద చెరువుగా గుర్తింపు తెచ్చుకున్న సింగరాజుపల్లి గ్రామంలోని సింగరాయ చెరువు గోదావరి జలాలతో నిండి సముద్రాన్ని తలపిస్తున్నది. 153 ఎకరాల శిఖం, 250 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువు నిండడం వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. యాసంగి చెరువు కింద 250 ఎకరాలు నాటు పెట్టగా సింగరాజుపల్లి రైతులతో పాటు, నీర్మాల రైతుల పొలాలు పారుతున్నాయి.  మూడేళ్లుగా ప్రతి ఏటా గోదావరి జలాలతో సింగరాయ చెరువు నిండుతుండగా 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో భూగర్భజలాలు పెరిగాయని పలు గ్రామాల రైతులు అంటున్నారు. ఈ చెరువు ఎర్రమట్టితో నిండి ఉండడం వల్ల నీరు భూగర్భం ద్వారా మండలంలోని బంజార, చింతబాయి తండా, పెదమడూరు, చినమడూరు, సీతారాంపురం వరకు  యాదాద్రి భువనగిరి జిల్లా మడిపడిగ, గంగాపురంతో పాటు పలు గ్రామాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంబురంగా పంటలు సాగుచేసుకుంటున్నారు. 


నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి నీరు..

సింగరాజుపల్లిలోని సింగరాయ చెరువుకు నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాలు కాలువల ద్వారా వస్తుండగా సోమవారం నీటిమట్టం పెరిగి మత్తడి పోస్తున్నది. సింగరాయ చెరువుకు, దేవాదుల కాలువకు మధ్య జాతీయ రహదారి ఉండగా స్థానిక రైతుల విజ్ఞప్తి మేరకు మంత్రి దయాకర్‌రావు నేషనల్‌ హైవే తవ్వి పైప్‌లైన్‌ వేయడంతో అవసరమైనప్పుడల్లా చెరువు నింపడం సులువు అవుతుందని రైతులు అంటున్నారు.logo