సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Feb 25, 2020 , 03:44:45

శరభ..శరభ..

శరభ..శరభ..పాలకుర్తి, ఫిబ్రవరి 24: స్వయంభూ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరిక్షేత్రం సోమవారం స్వామివారి నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం వేకువజామున స్వామి సన్నిధిలో అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు శరభ.. శరభ.. అంటూ నిప్పు కణికలపై నడిచి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వేకువజామునే ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల మధ్య అగ్ని గుండాల వరకు శరభ శరభ అంటూ నడుచుకుంటూ వెళ్లారు. తొలుత ఆలయంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు.. నిప్పు కణికలపై ఓం నమఃశివాయ.. శరభ.. శరభ.. అంటూ భక్తి పారవశ్యంతో నడిచి వెళ్లారు. వయో భేదం లేకుండా భక్తులు అగ్ని గుండాలపై నడుస్తూ మొక్కులు సమర్పించుకున్నారు. అగ్ని గుండాలపై పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీశ్‌ నడిచి భక్తిని చాటుకున్నారు. భక్తులు సన్నాయి మేళాలు, భజన కీర్తనల మధ్య ఉత్సవమూర్తులను పట్టుకుని అగ్ని గుండాలపై నడిచి వెళ్లారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మేకల వీరస్వామి, ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, ముంజ రాములు, బండారి శ్రీనివాస్‌, అర్చకులు దేవగిరి రామన్న, దేవగిరి లక్ష్మన్న, దేవగిరి రమేశ్‌, దేవగిరి సునీల్‌కుమార్‌, దేవగిరి అనిల్‌కుమార్‌, మత్తగజం నాగరాజు, పాలకుర్తి సంతోశ్‌శర్మ, కాటబత్తిని రమేశ్‌, చిదిరాల ఎల్లయ్య పాల్గొన్నారు.


సోమేశ్వరుడికి మహా అన్నపూజ

లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో సోమేశ్వరుడికి మహా అన్నపూజ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. తొలుత ఆలయం ముందున్న యాగశాలలో స్వామి వారులకు మహోత్సవ పూజా కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు.


పులకించిన క్షీరగిరి క్షేత్రం

తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి క్షీరగిరి క్షేత్రం భక్తులతో పులకించింది. సోమవారం బ్రహ్మోత్సవాలు ముగింపు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండపై నెలకొన్న శిఖరం వద్ద గండదీపం వెలిగించారు. పలువురు భక్తులు కొత్త వాహనాలకు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేయించారు.


ముగిసిన జాతర బ్రహ్మోత్సవాలు

క్షీరగిరి క్షేత్రంలో జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 20వ తేదీ నుంచి ఐదు రోజులపాటు నిర్వహించిన స్వామి వారుల బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతర బ్రహ్మోత్సవాలను జయప్రదం చేసేందుకు నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు తూచ తప్పకుండా ప్రత్యేక చర్యలు చేపట్టి విజయవంతం చేశారు. దైవదర్శనం, పార్కింగ్‌, తాగునీరు, విద్యుత్‌ పారిశుద్ధ్యం, వైద్య శిబిరం, శాంతిభద్రతల విషయంలో ఆయా శాఖల అధికారులు అదేస్థాయిలో విధులు నిర్వర్తించారు.


అందరికీ కృతజ్ఞతలు :  ఈవో

ఐదు రోజులు జరిగిన సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, భక్తులు, ప్రజలకు ఆలయ ఈవో మేకల వీరస్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల జయప్రదానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చే భక్తజనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.


logo