ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 25, 2020 , 03:40:06

ఆర్టీసీకి ‘మేడారం’ పండుగ

ఆర్టీసీకి ‘మేడారం’ పండుగ

సుబేదారి, ఫిబ్రవరి 24: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వసూళ్లు తెచ్చిపెట్టింది. ఈ సారి ఊహించని విధంగా ఘననీయంగా ఆదాయం పెరిగింది. రెండేళ్లకోసారి జరుగుతున్న మేడారం జాతరకు భక్తులను ఆర్టీసీ సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. జాతర భక్తులను తరలించడంలో ప్రజల మెప్పు పొందుతూ ఆదాయాన్ని పెంచుకున్నది. ఈ ఫిబ్రవరి మొదటివారంలో జరిగిన మేడారం జాతరకు రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ మెరుగైన సేవలు అందించింది. వారం రోజులపాటు రాత్రింబవళ్లు రాష్ట్రవ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి ఆర్టీసీ సంస్థ భక్తులను చేరవేసింది. వరంగల్‌ రీజియన్‌ నుంచి 18 పాయింట్ల ద్వారా, మిగితా పాయింట్ల నుంచి ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి రీజియన్ల నుంచి మొత్తం 4వేల బస్సులు మేడారం జాతరక రాకపోకలు కొనసాగించాయి. ప్రతి జాతరలో వరంగల్‌ రీజియన్‌ నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని వరంగల్‌-1, వరంగల్‌-2, హన్మకొండ, భూపాలపల్లి, తొర్రూర్‌, మహబుబాబాద్‌, జనగాం, నర్సంపేట, పరకాల డిపోల నుంచి హన్మకొండ, కాజీపేట, వరంగల్‌ కూరగాయాల మార్కెట్‌, జనగాం, స్టేషన్‌ ఘన్‌పూర్‌, కొత్తగూడ, పరకాల, చిట్యాల, మహబుబాబాద్‌, భూపాలపల్లి, ములుగు ఘన్‌పూర్‌, కాటారం, సిరోంచ, కాలేశ్వరం, తొర్రూర్‌, వర్ధన్నపేట, నార్లాపూర్‌, పస్రా పాయింట్ల నుంచి వరంగల్‌ రీజియన్‌ నుంచి 1910  బస్సులు రాత్రి పగలు భక్తులను గమ్యస్థానాలకు చేరవేశాయి. 


వారం రోజులు 15.19కోట్లు

జాతర ప్రారంభం ఈనెల 2వ తేదీ నుంచి జాతర ముగింపు 8వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌లోని తొమ్మిది డిపోల నుంచి వారం రోజుల్లో రూ.15కోట్ల 19లక్షల ఆదాయం సమకూరింది. గత 2018 జాతరకు ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌కు రూ 13కోట్ల 78లక్షల 55వేల ఆదాయం వచ్చింది. 30,325 ట్రిప్పులలో  11లక్షల, 70వేల, 496మంది భక్తులు ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌నుంచి ప్రయాణించారు. ఈసారి 9435 ట్రిప్పులలో 11లక్షల,10వేల,181మంది ప్రయాణించారు. గత జాతర కంటే ఈసారి  రూ. కోటి, 44లక్షల, 23వేలు ఆదనంగా ఆదాయం వచ్చింది. కానీ గత  జాతరకంటే ఈసారి బస్సులలో ప్రయాణించిన భక్తుల సంఖ్య 60వేలకు తగ్గింది. మొత్తానికి మేడారం జాతర పేరుతో ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌కు ఆదాయం ఘననీయంగా పెరిగింది. 


జాతర జాతరకు ఆదాయం పెంచుకోవడంలో వరంగల్‌ రీజియన్‌ అధికారులు , సిబ్బంది శక్తివంచన లేకుండా పనిచేయడం వల్ల ఆదాయం పెరుగుతుందని చెప్పవచ్చు. మిగితా మూడు రీజియన్లు ఖమ్మం, కరీంనగర్‌, రంగారెడ్డి రీజియన్లకు కలిపి సుమారు రూ. 15కోట్ల ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. మొత్తానికి జాతరతో ఆర్టీసీ సంస్థకు రూ.30 కోట్ల ఆదాయంలో వరంగల్‌ రీజియన్‌ నుంచే సగం రూ.15కోట్ల ఆదాయం రావడం వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతరకు  రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఘనంకాలు తెలుపుతున్నాయి. ఇందులో సగం మంది సుమారు 11లక్షలకు పైగా భక్తులు వరంగల్‌ రీజియన్‌(ఉమ్మడి వరంగల్‌జిల్లా) ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.


logo