మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 24, 2020 , 03:04:46

నేటి నుంచి ‘పట్టణ ప్రగతి’

నేటి నుంచి ‘పట్టణ ప్రగతి’

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 23 : పల్లెప్రగతిలో గ్రామాల ముఖచిత్రం మారిన స్ఫూర్తిగా పట్టణ ప్రగతికి అడుగులు పడుతున్నాయి. ఈనెల 24 నుంచి 10 రోజులపాటు జనగామ మున్సిపల్‌ పరిధిలో జరిగే తొలిరోజు సోమవారం ఉదయం 8గంటలకు 30 వార్డుల్లో ఏకకాలంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం శ్రీకారం చుట్టబోతున్నది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల భాగస్వామ్యంతో ఇప్పటికే ఒక్కో వార్డుకు 60 మంది సభ్యుల చొప్పున 30 వార్డులకు కలిపి 1800 మందితో వార్డు అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశారు. 15 మంది మహిళలు, 15 మంది యువతీ, యువకులు, 15 మంది సీనియర్‌ సిటిజన్స్‌, 15 మంది ఇతరులు కమిటీల్లో ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఒక్కో వార్డుకు ఒక ప్రత్యేక అధికారి నేతృత్వంలో పారిశుధ్యం, మొక్కల సంరక్షణ, కొత్త పనులపై ప్రణాళికలు రూపొందించడం, అభివృద్ధిలో కీలకమైన ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమవుతున్నారు. 


పట్టణ వార్డులు, కాలనీలకు ప్రాణం పోసేలా స్వపరిపాలన కాంతులను అందించేలా తెలంగాణ ప్రభుత్వం మరో మహత్తర కార్యక్రమానికి సిద్ధం అవుతున్నది. మున్సిపల్‌ కొత్త చట్టంలో పొందుపరిచిన అనేక అంశాల్లో భాగంగా ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు, గ్రాంట్లను పక్కాగా.. పకడ్బందీగా ఖర్చు చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో దోహదపడనుండగా, పట్టణ వార్డుల్లో అభివృద్ధికి అడుగులు పడడం ద్వారా జనగామ ‘పుర’ పాలనకు కొత్తరూపు రాబోతున్నది. పచ్చదనం- పరిశుభ్రతకు పెద్దపేట వేస్తూనే విద్యుత్‌ సరఫరా, వార్డు స్థాయి పనుల గుర్తించడం సహా వాటిలో వెంటనే చేయదగిన వాటికి అప్పటికప్పుడే పరిష్కారం చూపడం, నిధులతో ముడిపడిన పనులకు సంబంధించి ఏడాది, ఐదేళ్ల కార్యాచరణతో ప్రతిపాదనలు తయారు చేసి పట్టణ ప్రగతి ప్రణాళిక నివేదికను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. మురుగుకు, చెత్తకు నిలయాలు మారిన మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడం అవినీతిరహిత పౌరసేవలు అందించడం వంటి పారదర్శకమైన విధానంతో సులభతరంగా పనులు పూర్తిచేయడం పట్టణ ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. 


తొలుత వార్డు సమావేశాలు

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 30 వార్డుల్లో ఏకకాలంలో ప్రత్యేక అధికారి నేతృత్వంలో వార్డు కమిటీ సమావేశం నిర్వహించి కార్యక్రమ ఉద్దేశాన్ని చర్చించి తర్వాత అందరూ కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డు విజిట్‌ ద్వారా ప్రతి అంగుళం అన్ని అంశాలను క్షుణ్ణంగా (ఎక్స్‌రే) పరిశీలించాలి. ప్రతి వార్డు కమిటీలో ఒక పారిశుధ్య సిబ్బంది, వాటర్‌మెన్‌, వీధిదీపాలు వెలిగించే సిబ్బంది వెంట ఉండి వార్టు విజిట్‌లో ప్రజల నుంచి సమస్యలు, అధికారులు, కమిటీ గుర్తించి అంశాల్లో అప్పటికప్పుడు చేయదగినవి కమిటీ ఆధ్వర్యంలో వెంటనే చేయాల్సి ఉంటుంది. ఖాళీస్థలాలు చెత్తాచెదారం లేకుండా, డ్రైనేజీలు శుభ్రం చేయడం, వీధుల్లో పారిశుధ్య పనులు, విద్యుత్‌ వైర్లు సరిచేయడం, ఇళ్లపై ఉన్న తీగలను సరిచేయడం, రోడ్ల గుంతలు పూడ్చడం, ఇంకా ఎన్ని గుంతలు పూడ్చాలి? రోడ్లపై ఉండే నిర్మాణ సామగ్రి, పాతఇళ్ల తొలగింపు, ఎండిపోయిన బోరుబావుల పూడ్చివేత, వంగిపోయి ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, వేలాడే కరెంటు తీగలను గుర్తించి సరిచేయడం, ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్‌ స్తంభాలను నాటడం చేయాల్సి ఉంటుంది. ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడు వార్డులకు ఒక నర్సరీని ఏర్పాటు చేయడం, ఇంటింటా విరివిగా మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోసి రక్షించడం వంటివి. 


అలాగే మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవడం, ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి యజమానులతో మాట్లాడి మొక్కలు సరఫరా చేయాల్సి ఉంటుందే అంశాలను నిర్ణీత ఫార్మేట్‌లో నిబంధనల మేరకు ప్రతి అంశాన్ని నోట్‌ చేసుకొని వాటిలో మ్యాన్‌ పవర్‌తో చేయదగిన చేయించడం, తక్కువ నిధులతో చేయాల్సినవి కూడా వెంటనే పనులు ప్రారంభించడం, ఎక్కువ నిధులు అవసరం ఉన్న వాటిపై ప్రత్యేక అధికారి సమక్షంలో వార్డు అభివృద్ధి సభ్యులతో మాట్లాడి కలెక్టర్‌కు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. వార్డు పరిశీలన కార్యక్రమం ఒకరోజులో పూర్తికాకుంటే రెండోరోజు కూడా కొనసాగించి 10 రోజులపాటు 60 మంది కమిటీ సభ్యులు వార్డులో పర్యటించాలి. వీరిలో ప్రత్యేకంగా గుర్తించిన ఎనిమిది మంది సభ్యులు మాత్రం ఏ సమావేశమైనా తప్పనిససరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పట్టణ ప్రగతి కేవలం 10రోజులతో సరిపెట్టకుండా నిరంతరం జరిగేలా ఇప్పటికే నియమించిన ప్రత్యేక అధికారులు వార్డు కమిషనర్లుగా పూర్తిస్థాయి బాధ్యత వహించి వార్డు అవసరాలు, సమస్యలను గుర్తించి ప్రణాళికబద్ధంగా పనులు చేయాల్సి ఉంటుంది. ప్రతి వార్డులో పారిశుద్ధ్ద్య, వీధిదీపాల నిర్వహణ, వార్డు కమిటీ సభ్యులు, ప్రత్యేక అధికారి ఫోన్‌నంబర్‌ వివరాలతో కూడిన జాబితాను వార్డు కూడలిలో బహిరంగపరుస్తారు. 


వార్డును ఎక్స్‌రే తీయాలి..

వార్డుల వారీగా ప్రణాళికల రూపకల్పనలో భాగంగా ప్రతి వార్డును ఎక్స్‌రే తీయాలి. కౌన్సిలర్లను కలుపుకొని కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రణాళిక తయారు చేసి, ప్రతీ వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ప్రతిరోజు చెత్త మురుగును నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచాలి. శుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలి, గుంతలు, బొందలు, గోతులులేని రహదారులుగా మార్చాలి. పచ్చదనంతో పట్టణం కళకళలాడాలి. చెత్త నిర్మూలనకు డంప్‌యార్డులు ఏర్పాటు చేయాలి. చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపేందుకు వైకుంఠదామాలు ఏర్పాటు చేయాలి. పట్టణ జనాభాకు అనుగుణంగా పరిశుభ్రమైన వెజ్‌, నాన్‌ వెజ్‌, ఫ్రూట్‌, ఫ్లవర్‌ మార్కెట్లు ఏర్పాటు చేయాలి. పట్టణ యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయించాలి. పట్టణ ప్రజలు, జిల్లా కేంద్రానికి వచ్చే వారికి అవసరమైన పబ్లిక్‌ టాయిలెట్లు ఉండాలి. స్ట్రీట్‌ వెండర్స్‌ కోసం మౌళిక సదుపాయాలు కల్పించాలి, ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, సరుకు రవాణా వాహనాలకు నిర్ధిష్టమైన ప్రదేశాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి. ప్రమాదరహితమైన వంగిన విద్యుత్‌ స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ఉంటే ట్రాన్స్‌ఫార్మర్లు మార్చడం, వేలాడే వైర్లను సరిచేయాలి. logo
>>>>>>